logo

జగనన్న భూరక్ష.. రైతులకే శిక్ష!

జగనన్న భూరక్ష పేరుతో చేపట్టిన భూముల రీసర్వేతో రైతులకు ఒరిగిందేమీ లేదు. సర్కారు పెద్దలకు సర్వే రాళ్లు కొనుగోలులో కమీషన్లు దక్కాయి.. వాటిని పాతిపెట్టే పనిలో స్థానిక అధికారులకు వాటాలు అందాయి.

Updated : 05 Jul 2024 08:24 IST

తప్పులతడకగా హక్కు పత్రాలు
సబ్‌ డివిజన్లు జరక్క.. అమ్ముకోవడానికి వీల్లేక..
సర్వే లోపాలపై కూటమి సర్కారు దృష్టి

జగనన్న భూరక్ష పేరుతో చేపట్టిన భూముల రీసర్వేతో రైతులకు ఒరిగిందేమీ లేదు. సర్కారు పెద్దలకు సర్వే రాళ్లు కొనుగోలులో కమీషన్లు దక్కాయి.. వాటిని పాతిపెట్టే పనిలో స్థానిక అధికారులకు వాటాలు అందాయి. అన్నదాతల భూ హక్కుల విషయంలో చిక్కులు మాత్రం వీడలేదు. రెండున్నరేళ్లుగా సాగుతున్న భూముల రీసర్వేతో భూ వివాదాలు పరిష్కారం కాకపోగా కొత్త సమస్యలు వచ్చి పడుతున్నాయి. రైతుల ఆధీనంలో ఉండే భూ విస్తీర్ణాలు తగ్గిపోయాయి. ల్యాండ్‌ పార్సిల్‌ నంబర్లు (ఎల్‌పీ) కేటాయించి భూముల సబ్‌ డివిజన్లు చేయకపోవడంతో విక్రయాలకు ఇబ్బందులు పడుతున్నారు. కూటమి సర్కారు భూసర్వేలో లోపాలపై దృష్టి సారించాలని పలువురు రైతులు కోరుతున్నారు.

ఈనాడు, అనకాపల్లి, న్యూస్‌టుడే, పాడేరు, నక్కపల్లి: అనకాపల్లి జిల్లాలో మొత్తం 737 గ్రామాలున్నాయి. 9.18 లక్షల ఎకరాల భూములను రీసర్వే చేయాల్సి ఉంది. మూడు విడతల్లో 450 గ్రామాల్లో సర్వే పూర్తిచేశారు. వాటిలో చాలావరకు భూమి కొలతలు తక్కువగా పడ్డాయి. సాగు విస్తీర్ణం నుంచి పాసుపుస్తకాల్లో ముద్రించే పేర్లు, ఆధార్, ఫోన్‌ నెంబర్లు అన్నీ తప్పుల తడకలుగా ఉంటున్నాయి. వందేళ్లనాటి భూ సమస్యలను పరిష్కరిస్తున్నామని గొప్పలు చెప్పుకుంటున్న వైకాప సర్కారు భూ యజమానుల మధ్య సరికొత్త సమస్యలను సృష్టించింది. ప్రతీ గ్రామంలోను 20 నుంచి 30 మంది రైతుల నుంచి అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. జిల్లాలో 402 గ్రామాలకు సంబంధించి భూములు ఎల్‌పీఎంలుగా మార్పులు చేశారు. వాటిలో 318 గ్రామాలకు సంబంధించి ఎల్‌పీఎంలకు మార్కెట్ విలువ నిర్ధారించి రిజిస్ట్రేషన్లు చేయిస్తున్నారు.. మరో 102 గ్రామాలకు సంబంధించిన ఎల్‌పీఎంలు రెవెన్యూ నుంచి రిజిస్ట్రేషన్‌ శాఖకు రావాల్సి ఉంది. ఆయా గ్రామాల్లో రిజిస్ట్రేషన్లకు ఇబ్బందులు తలెత్తుతున్నాయి. నక్కపల్లి మండలంలో 20 గ్రామాలు, దేవరాపల్లి మండలంలో 27 గ్రామాల్లో భూములు ఎల్‌పీఎంలోకి మార్పులు చేసినా వాటి జాబితాలను సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయాలకు చేర్చకపోవడంతో మూడు నెలలుగా రిజిస్ట్రేషన్లకు తంటాలు పడాల్సి వస్తోంది.

అమ్మలేక అప్పులు చేయాల్సి వచ్చింది..

నా కూతురు పెళ్లికి డబ్బులు లేక 30 సెంట్లు భూమి అమ్మాను. నా భూమి కొన్న రైతు నుంచి రూ. 5 లక్షలు అడ్వాన్సు తీసుకున్నాను. అతనికి ఆ భూమిని రిజిస్ట్రేషన్‌ చేద్దామని కె.కోటపాడు రిజిస్ట్రేషన్‌ కార్యాలయానికి వెళ్లాను. మా ఊరు భూములు రిజిస్ట్రేషన్‌ అవ్వవని చెప్పారు. చేసేదేం లేక అతని దగ్గర తీసుకున్న డబ్బుకు వడ్డీ కడుతున్నాను. - పూడి ఎరుకునాయుడు, చిననందిపల్లి

మూడు నెలలుగా ఇబ్బందులు పడుతూనే ఉన్నాం

మా గ్రామంలో సుమారు 650 ఎకరాల భూమికి 900 మంది రైతులు హక్కుదారులు. ఈ భూములన్నింటిపీ సర్వే చేసి ల్యాండ్‌ పార్సిల్‌ మ్యాప్‌ (ఎల్‌పీఎం) నంబర్లు ఇచ్చారు. కుటుంబ అవసరాల నిమిత్తం ఎవరైనా భూమి అమ్మితే, ఆ భూమి రిజిస్ట్రేషన్‌ కార్యాలయంలో రిజిస్ట్రేషన్‌ అవ్వడం లేదు. ఈ సమస్య గత మూడు నెలల నుంచి ఉన్నా పరిష్కరించడంలో అధికారులు నిర్లక్ష్యం చూపుతున్నారు.

పూడి సత్యారావు,మాజీ సర్పంచి, చిననందిపల్లి

1011 గ్రామాల్లో రీ సర్వే పూర్తి

అల్లూరి జిల్లాలోని 1011 గ్రామాల్లో 2,95,776 హెక్టర్లలో భూముల రీ సర్వే పూర్తిచేసినట్లు డీఎస్‌ఎల్‌ఓ వై. మోహన్‌రావు తెలిపారు. వెక్టరైజేషన్‌ స్థితి ఉన్న గ్రామాలు 1004 ఉన్నాయని చెప్పారు. డీఎల్‌ఆర్‌ తహసీల్దార్‌ లాగిన్‌లో 136 పెండింగ్‌ ఉన్నాయని పేర్కొన్నారు. 12858 మ్యుటేషన్లు మంజూరు చేయగా.. 9347 ఆమోదించినట్లు తెలిపారు.  

సర్వే పూర్తిచేసినా ఇబ్బందులే

నాకు, మా సోదరుడికి కలిపి గొడిచెర్ల రెవెన్యూ పరిధిలో ఎకరం భూమి ఉంది. వైద్యం నిమిత్తం చేసిన అప్పులు, ఇతర వ్యక్తిగత అవసరాల కోసం భూమిని విక్రయించడానికి ఆరు నెలలుగా చూస్తుంటే సాధ్యం కావడంలేదు. ఈ గ్రామం రీసర్వే జరిగి, ఎల్పీ నంబరు కేటాయించినా ఆ జాబితా ఇంత వరకు రిజిస్ట్రార్‌ కార్యాలయానికి చేరలేదు. దీంతో ఆగ్రామంలో భూములు రిజిస్ట్రేషన్లకు ఇబ్బందులు తలెత్తుతున్నాయి.

పొడగట్ల రమేశ్, ఉద్ధండపురం, నక్కపల్లి

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని