logo

సమస్యలపై నిర్వాసితుల మొర

ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్‌ దినేశ్‌కుమార్‌ ఆధ్వర్యంలో బుధవారం చింతూరు ఐటీడీఏ సమావేశ మందిరంలో నిర్వహించారు.

Published : 04 Jul 2024 01:26 IST

చింతూరు, న్యూస్‌టుడే: ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్‌ దినేశ్‌కుమార్‌ ఆధ్వర్యంలో బుధవారం చింతూరు ఐటీడీఏ సమావేశ మందిరంలో నిర్వహించారు. విలీన మండలాల ప్రజలు తరలివచ్చి తమ సమస్యలను అధికారులకు ఏకరువు పెట్టారు. గత వరదల సమయంలో బాధితులు ఎవరికీ సరైన సాయం అందలేదని పలువురు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ఏడాది మళ్లీ వరదలు వచ్చే వరదలు, పోలవరం నిర్వాసితుల సమస్యలను కలెక్టర్‌ దృష్టికి తీసుకొచ్చారు. 39 ముంపు గ్రామాలను గుర్తించిన ప్రభుత్వం చాలా మందికి పరిహారం ఇవ్వలేదన్నారు. తమ సమస్యలు పరిష్కరించాలని నిర్వాసితులు అధికసంఖ్యలో వినతులు ఇచ్చారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేస్తామన్నారు. తమ పరిధిలో పరిష్కారమయ్యే సమస్యలను తక్షణమే పరిష్కరించాలని పీఓలను  ఆదేశించారు. 

బాధితులను ఆదుకునేందుకు సిద్ధంగా..

గోదావరి, శబరి నదులకు వరదలు సంభవిస్తే విలీన మండలాల్లోని బాధితులను ఆదుకునేందుకు అధికారులంతా సిద్ధంగా ఉండాలని కలెక్టర్‌ దినేశ్‌కుమార్‌ ఆదేశించారు. చింతూరు ఐటీడీఏ సమావేశ మందిరంలో బుధవారం వరద ముప్పుపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ భద్రాచలం, ధవళేశ్వరం వద్ద వచ్చే వరద ఆధారంగా చింతూరు, కూనవరం, వరరామచంద్రాపురం, ఎటపాక మండలాల్లో ముంపునకు గురయ్యే గ్రామాలను గుర్తించి తక్షణమే వారిని పునరావాస కేంద్రాలకు తరలించాలన్నారు. పాఠశాల భవనాల్లో పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నందున ఉపాధ్యాయులు స్థానికంగా ఉండాలని సూచించారు. బాధితులకు సకాలంలో తాగునీరు అందించేందుకు గ్రామీణ నీటి సరఫరా విభాగం అధికారులు చర్యలు చేపట్టాలని ఆదేశించారు. నాలుగు మండలాల్లో మూడు నెలలకు సంబంధించిన  ఆహార నిల్వలు ప్రతి ఏటా నిల్వ చేస్తున్న ప్రాంతాల్లోనే సిద్ధం చేయాలన్నారు. బియ్యం, కందిపప్పు ఇతర నిత్యావసర సరకులు నిల్వ కేంద్రాలకు ఇప్పటికీ తరలించక పోవడంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. బాధితులకు కొవ్వొత్తులు అందించాలని చెప్పారు. విద్యుత్తు సరఫరా ఉండేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. వరదల్లో బాధితులకు వైద్యం అందించేందుకు ప్రత్యేక వైద్య బృందాలు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. ఈ నాలుగు మండలాల్లో రాకపోకలు సాగించేందుకు అనువుగా ఉన్న అత్యవసర రహదారుల అభివృద్ధికి చర్యలు చేపట్టాలని, అవసరమైన పనులపై వారంలోగా నివేదిక సమర్పించాలని గిరిజన సంక్షేమ, ఆర్‌అండ్‌బీ ఇంజినీర్లను ఆదేశించారు. ఎమ్మెల్యే శిరీషాదేవి, జేసీ ధాత్రిరెడ్డి, రంపచోడవరం, చింతూరు ఐటీడీఏ పీవోలు సూరజ్‌ గనోరే, కావూరి చైతన్య, ఓఎస్డీ మహేశ్వరరెడ్డి పాల్గొన్నారు. చింతూరు ఏరియా ఆసుపత్రిని కలెక్టర్‌ సందర్శించారు. రక్తనాళాలకు సంబంధించి ఉచిత వైద్య శిబిరం ప్రారంభించారు. సూపరింటెండెంట్‌ కోటిరెడ్డి, జిల్లా ఉప వైద్యాధికారి డాక్టర్‌ పుల్లయ్య పాల్గొన్నారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని