logo

నచ్చినోళ్లకు.. నిధులు కుమ్మరింత!

వైకాపా ప్రభుత్వ హయాంలో విశాఖ మహాప్రాంత అభివృద్ధి సంస్థ (వీఎంఆర్‌డీఏ) నిధులు ఇష్టారాజ్యంగా ఖర్చు చేశారు.

Published : 04 Jul 2024 01:21 IST

ఐదేళ్లలో రూ.680 కోట్లు ఖర్చు చేసిన వీఎంఆర్‌డీఏ
‘ఒక సెంటు’ లేఅవుట్లలో ఇష్టానుసారంగా పనులు  
కొందరికే టెండర్లు దక్కేలా చక్రం తిప్పిన వైకాపా నేతలు
ఈనాడు, విశాఖపట్నం

వైకాపా ప్రభుత్వ హయాంలో విశాఖ మహాప్రాంత అభివృద్ధి సంస్థ (వీఎంఆర్‌డీఏ) నిధులు ఇష్టారాజ్యంగా ఖర్చు చేశారు. ఒక సెంటు లేఅవుట్లలో అభివృద్ధి పనులు చేపట్టగా... 
భారీగా నిధులు పక్కదారి పట్టినట్లు సమాచారం.


ఐదేళ్లలో ఈ పనులకు వీఎంఆర్‌డీఏ దాదాపు రూ.680 కోట్లు వ్యయం చేయగా... గుత్తేదారులకు టెండర్లు కట్టబెట్టడం నుంచి బిల్లుల చెల్లింపులు వరకు అన్నీ కొందరు వైకాపా నేతల కనుసన్నల్లోనే జరిగాయి. బిల్లుల చెల్లింపు ప్రక్రియలో కొందరి పట్ల చాలా ఉదారంగా వ్యవహరించారు. పనుల్లో నాణ్యతా లోపాలు, టెండర్‌ విధానాలు, ఆడిట్‌ అంశాలపై కూటమి ప్రభుత్వం పూర్తిస్థాయి తనిఖీలు నిర్వహిస్తే మరిన్ని అక్రమాలు బయటపడే అవకాశం ఉంది.

వైకాపా ప్రభుత్వం విశాఖలో ‘ఒక సెంటు ప్లాట్ల’కు 4,828 ఎకరాలు సమీకరించింది. రూ.175 కోట్ల ఖర్చుతో 83 లేఅవుట్లలో 1,41,654 ‘ఒక సెంటు ప్లాట్ల’ను అభివృద్ధి చేశారు. విశాఖ, అనకాపల్లి జిల్లాల్లో ఆనందపురం, భీమిలి, పద్మనాభం, పెందుర్తి, సబ్బవరం, పరవాడ, పెదగంట్యాడ, అనకాపల్లి మండలాల్లో ఈ లేఅవుట్లు ఉన్నాయి. తాత్కాలిక వసతుల కోసం మొదట బోర్లు తవ్వకం, సిమెంటు గోదాంల నిర్మాణం, అప్రోచ్‌ రోడ్లు, విద్యుత్తు సౌకర్యాలు, సీసీ కాలువలు, కల్వర్టులు, బీటీ రోడ్లుకు ప్రణాళిక చేశారు. అనంతరం పరిహారంగా ఇచ్చిన ప్లాట్లలో పనులకు నిధులు భారీగా ఖర్చు చేశారు. మొదటి దశలో రూ.200 కోట్లు, రెండో దశలో రూ.305 కోట్లతో పనులు ప్రారంభించారు. చాలా చోట్ల ఈ పనులు తూతూమంత్రంగా చేశారు. అనకాపల్లి, ఆనందపురం, పద్మనాభం, సబ్బవరం, పరవాడ మండలాల్లో చేపట్టిన పనులు అప్పుడే దెబ్బతిన్నాయి. ఒక సెంటు లేఅవుట్ల అభివృద్ధి పనుల్లో కొందరు గుత్తేదారులు ఒక్కటై పనులు దక్కించుకున్నారన్న ఆరోపణలు వచ్చాయి. ముఖ్యంగా రివర్స్‌ టెండరింగు పేరుతో వారికి లబ్ధి కలిగేలా చేశారు. గతంలో వీఎంఆర్‌డీఏ టెండర్లు పిలిస్తే కనీసం 5 శాతం నుంచి 15 శాతం తక్కువకు కోట్‌ చేసేవారు. పాల్గొనే వారి సంఖ్య ఎక్కువగా ఉండేది. వైకాపా ప్రభుత్వంలో దీనికి భిన్నంగా జరిగింది.

  • పలు లేఅవుట్లలో కాలువలు, కల్వర్టు పనులను 0.30 శాతం నుంచి 0.78 శాతం తక్కువకే గుత్తేదారులు దక్కించుకున్నారు. అనకాపల్లి, ఆనందపురం మండలాల్లో పనులకు ఓ గుత్తేదారు అర శాతం కన్నా తక్కువకు పాడినా రద్దు చేయకుండా కట్టబెట్టారు. పెందుర్తి మండలం ముదపాకలో ఓ పనికి 0.10 శాతం తక్కువకు అప్పగించారు. ఇవన్నీ అప్పటి ఉన్నతాధికారుల కనుసన్నల్లోనే జరిగాయి. 
  • చాలా పనులకు టెండర్లు పిలిస్తే పోటీ లేకపోయినా అప్పగించేశారు. ఆనందపురం మండలంలోని పది చోట్ల రోడ్ల నిర్మాణానికి రూ.2 కోట్లతో టెండరు పిలిస్తే ఓ గుత్తేదారు అర శాతం కన్నా తక్కువకే ఆ పనులు దక్కించుకున్నారు. ఇదే మండలంలోని తంగుడుబిల్లిలో, పద్మనాభం మండలం తునివలసలో అలానే జరిగింది. 
  • భీమిలిలోని నిడిగట్టు, జేవీఅగ్రహారం, కొత్తవలసల్లో భూసమీకరణ చేసిన చోట్ల రోడ్లు, కాలువల తవ్వకానికి టెండర్లు పిలిస్తే అన్నింటినీ ఒకే గుత్తేదారుకు కట్టబెట్టారు. 
Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని