logo

ప్రమాదకరం ఘాట్‌రోడ్డు ప్రయాణం

వాలమూరు నుంచి చింతూరు మండలం తులసిపాక వరకు 30 కిలోమీటర్ల మేర ఘాట్రోడ్డు  ప్రమాదకరంగా ఉంది. ఇరుకైన మలుపులు, పక్కనే లోతైన అగాధాలు, మరోపక్క ఎత్తయినకొండలతో ఉండే ఈ మార్గంలో వాహనాల రాకపోకలు కత్తిమీద సామే.

Published : 04 Jul 2024 01:09 IST

మారేడుమిల్లి- చింతూరు రహదారిలో తరచూ నిలిచిపోతున్న వాహనాలు
వాహనదారుల అవస్థలు
మారేడుమిల్లి, న్యూస్‌టుడే మారేడుమిల్లి మండలం

వాలమూరు నుంచి చింతూరు మండలం తులసిపాక వరకు 30 కిలోమీటర్ల మేర ఘాట్రోడ్డు  ప్రమాదకరంగా ఉంది. ఇరుకైన మలుపులు, పక్కనే లోతైన అగాధాలు, మరోపక్క ఎత్తయిన
కొండలతో ఉండే ఈ మార్గంలో వాహనాల రాకపోకలు కత్తిమీద సామే. దీనికితోడు ప్రభుత్వ శాఖల నిర్లక్ష్యం వాహనదారుల పాలిట శాపంగా మారింది. 

ప్రభుత్వ నిబంధలను ఏ మాత్రం పాటించకుండా, భారీ వాహనాల రాకపోకలపై ఎటువంటి నియంత్రణ పాటించక పోవడం వల్ల ప్రయాణం గాలిలో దీపంలా మారింది. ఈ మార్గంలో వాహనాలు అతికష్టంపై ప్రయాణాలు సాగిస్తుంటాయి. ఈ రహదారిని ప్రభుత్వం అంతర్రాష్ట్ర రహదారిగా గుర్తించడంతో జిల్లాలోని విలీన మండలాలతోపాటు, సరిహద్దుల్లోని తెలంగాణ, ఛత్తీస్‌గఢ్, ఒడిశా, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర వంటి ప్రాంతాలకు ఈ మార్గంలోనే ప్రయాణించాల్సి ఉంది. ఈ క్రమంలో రాత్రింబవళ్లు భారీ వాహనాలు తిరుగుతూనే ఉంటున్నాయి. అయితే పరిమితికి మించి పొడవు, బరువైన లోడులతో లారీలు ఈ మార్గంలో ప్రయాణిస్తుండడంతో ఆయా వాహనాలు తరచూ మొరాయిస్తున్నాయి. ఎత్తయిన కొండలు ఎక్కాల్సి ఉండటం, పైగా ప్రమాదకరమైన మలుపులు ఉండడంతో ఆయా లారీలు తరచూ సాంకేతిక లోపాలకు గురై నిలిచిపోతున్నాయి. 

నిబంధనలు పాటించని వాహనదారులు

తరచూ భారీ వాహనాలు నిలిచిపోవడం, ఫలితంగా ఇతర వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడటం వంటి పరిస్థితులను గమనించిన ప్రభుత్వం ఈ మార్గంలో ప్రయాణించే వాహనాలపై ఆంక్షలు విధిస్తూ గతంలో కొన్ని నిబంధనలను విధించింది. మారేడుమిల్లి- చింతూరు ఘాట్రోడ్డులో ప్రయాణించే వాహనాలు పొడవు 15 మీటర్లకు మించి ఉండరాదని, బరువు 35 టన్నులు మించి ఉండరాదని, వీటిని పాటించని వాహనాలను అనుమతించకూడదని నిబంధనలు విధించారు. దీనికి సంబంధించిన హెచ్చరిక బోర్డును మారేడుమిల్లి శివారు కస్తూర్బాగాంధీ బాలికల పాఠశాల ఎదురుగా ఏర్పాటు చేశారు. ఈ నిబంధనలను పాటించాల్సిన ప్రభుత్వ శాఖలు ఏమాత్రం పట్టించుకోకపోవడంతో భారీ వాహనాలు ఎటువంటి నియంత్రణ లేకుండానే యథేచ్ఛగా రాకపోకలు సాగిస్తున్నాయి. ఇప్పటికీ భారీ ట్రాలీ లారీలు తిరుగుతూ మలుపుల్లో ఇరుక్కుపోతున్నా పట్టించుకున్న అధికారులే కరవయ్యారు. ఇటీవల పలు సందర్భాల్లో భారీ ట్రాలీ లారీలు ఘాట్రోడ్డులో ఇరుక్కుపోవడంతో రోజుల తరబడి మిగిలిన వాహనాల రాకపోకలు నిలిచిపోయిన దాఖలాలు ఉన్నాయి. ఇరువైపులా వందల సంఖ్యలో వాహనాలతోపాటు, ఆర్టీసీ ఎక్స్‌ప్రెస్‌ బస్సులు నిలిచిపోవడంతో ప్రయాణికులు అవస్థలు పడుతున్నారు. వీటిని తొలగించాలంటే భారీ క్రేనులు రావాల్సిన పరిస్థితులు నెలకొని ఉన్నాయి. ఈ తతంగం పూర్తయ్యేసరికి ఒక్కోసారి రెండు, మూడు రోజులు పడుతుంది. అప్పటి వరకు ‘ఎక్కడి వాహనాలు అక్కడే గప్‌చుప్‌...!’ అన్నచందంగా మారింది. 


ఎటువంటి ఇబ్బందులు లేకుండా చూస్తాం...!

- రుద్రరాజు భీమరాజు, సీఐ, మారేడుమిల్లి   

మారేడుమిల్లి - చింతూరు ఘాట్రోడ్డులో వాహనాల రాకపోకలకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా అవసరమైన చర్యలు చేపడతాం. ఆయా మలుపుల్లో తిరగడానికి ఇబ్బందులు పడే వాహనాలు గుర్తించి, వాటిపై నియంత్రణ విధిస్తాం. మిగిలిన వాహనాల రాకపోకలకు ఇబ్బందులు లేకుండా చూస్తాం.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని