logo

వాళ్లు ఏడిపించారు.. వీళ్లు ఏడువేలిచ్చారు!

కూటమి సర్కారు ఏర్పడి నెలరోజులు గడవకుండానే తొలి సంక్షేమ ఫలం పేదల ఇంటికి చేరింది. అవ్వాతాతలకు ఇచ్చే పింఛను రూ.3 వేల నుంచి రూ.4 వేలకు పెంచడమే కాదు గత మూడు నెలల బకాయిలు కలిపి ఒకేసారి రూ.7 వేలు అందించి ఎన్నికల హామీని ఆచరణలో చూపారు చంద్రబాబు.

Published : 02 Jul 2024 02:25 IST

కూటమి సర్కారుకు అవ్వాతాతల కృతజ్ఞతలు

కూటమి సర్కారు ఏర్పడి నెలరోజులు గడవకుండానే తొలి సంక్షేమ ఫలం పేదల ఇంటికి చేరింది. అవ్వాతాతలకు ఇచ్చే పింఛను రూ.3 వేల నుంచి రూ.4 వేలకు పెంచడమే కాదు గత మూడు నెలల బకాయిలు కలిపి ఒకేసారి రూ.7 వేలు అందించి ఎన్నికల హామీని ఆచరణలో చూపారు చంద్రబాబు. సోమవారం ఉదయం 6 గంటలకే పింఛన్ల పంపిణీ మొదలుపెట్టారు. సచివాలయ సిబ్బంది.. కూటమి నేతలు కలిసి లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి పింఛను సొమ్ములు చేతికి అందించారు. ఇచ్చిన మాటకు కట్టుబడి మొదటి నెలలోనే పెంచిన పింఛను సొమ్మును బకాయిలతో కలిపి ఇవ్వడంతో అవ్వాతాతల మోములో ఏడింతల ఆనందం కనిపించింది. అనకాపల్లి, అల్లూరి జిల్లాలో 3.91 లక్షల లబ్ధిదారులకు ఈ నెలలో రూ.262 కోట్లు పింఛను సొమ్మును పంచిపెడుతున్నారు. గత నెల కంటే రూ.156 కోట్లు అదనంగా ఈ నెల ఖర్చుచేస్తున్నారు.

అరకులోయ, న్యూస్‌టుడే: ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు పింఛన్‌ సొమ్మును పెంచి పేదలకు మేలు చేశారని మాజీ మంత్రి కిడారి శ్రావణ్‌కుమార్, తెదేపా నియోజకవర్గ ఇన్‌ఛార్జి దొన్నుదొర అన్నారు. పద్మాపురం పంచాయతీ ఎండపల్లివలసలో సోమవారం లబ్ధిదారులకు పింఛన్‌ సొమ్ము అందజేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్‌కల్యాణ్‌ల చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు. పెదలబుడు పంచాయతీ కార్యాలయంలో సర్పంచి పెట్టెలి దాసుబాబు, కొత్తభల్లుగుడలో తెదేపా మండల అధ్యక్షుడు శెట్టి బాబూరావు తదితరులు పింఛన్‌ను సొమ్ము అందజేశారు.


పాడేరు, న్యూస్‌టుడే: అల్లూరి సీతారామరాజు జిల్లావ్యాప్తంగా 1,27,894 మంది పింఛనుదారులకు సోమవారం పింఛన్లు పంపిణీ చేశారు. మాజీ ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి ఆధ్వర్యంలో పాడేరులోని సుండ్రుపుట్టు, కుమ్మరిపుట్టు, లోచలిపుట్టు చింతలవీధి, కొత్తపాడేరు ప్రాంతాల్లో లబ్ధిదారులకు ఎన్టీఆర్‌ భరోసా పింఛన్లు పంపిణీ చేశారు. లబ్ధిదారుల మోముల్లో ఆనందం వెల్లివిరిసింది. మాజీ ఎమ్మెల్యే ఈశ్వరి మాట్లాడుతూ.. తమ అధినేత చంద్రబాబు ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారన్నారు. మాట తప్పడం జగన్‌మోహన్‌రెడ్డి నైజమని విమర్శించారు. తెదేపా నాయకులు పొలుపర్తి గోవిందరాజు, బొర్రా నాగరాజు, సుబ్బారావు, కిల్లో రమేష్‌నాయుడు తదితరులు పాల్గొన్నారు.


ఆడంబరానికి దూరంగా.. అందరికీ అందేలా..

వైకాపా సర్కారు రూ.250 పెంచినప్పుడల్లా హడావుడి చేసేవారు. వారం రోజుల పాటు సభలు, సమావేశాలుపెట్టి లబ్ధిదారులను తరలించి జగన్‌ భజన చేయించేవారు. కూటమి సర్కారు మాత్రం రూ. వెయ్యి ఒకేసారి పెంచినా ఆడంబరానికి పోలేదు. స్థానిక నేతలే ఇంటింటికి వెళ్లి పింఛను సొమ్ము ఇచ్చి చంద్రబాబు లేఖను అందించారు. ఎన్నికల కోడ్‌ సమయంలో వైకాపా నేతల చర్యల వల్ల అవ్వాతాతలు పడరాని పాట్లు పడ్డారు. ఈ నెల నుంచి ఇంటికే అందజేస్తుండడంతో లబ్ధిదారులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. వాలంటీర్లు లేకపోయినా సచివాలయ సిబ్బందితో ఒకేరోజు అందరికీ అందేలా చేయడంలో సఫలమయ్యారు.


పేదల సంక్షేమం తెదేపాతోనే సాధ్యం

-శిరీషాదేవి

రాజవొమ్మంగి, గంగవరం, రంపచోడవరం, న్యూస్‌టుడే: పేదల సంక్షేమం తెదేపాతోనే సాధ్యమని రంపచోడవరం ఎమ్మెల్యే మిరియాల శిరీషాదేవి వ్యాఖ్యానించారు. రాజవొమ్మంగి, గంగవరం మండలాల్లోని పలు గ్రామాల్లో సోమవారం ఎన్టీఆర్‌ భరోసా పింఛన్లను, ముఖ్యమంత్రి లేఖను స్వయంగా లబ్ధిదారులకు ఎమ్మెల్యే శిరీషాదేవి, నియోజకవర్గ తెలుగు యువత అధ్యక్షుడు భాస్కర్‌ అందజేశారు. లబ్బర్తిలో ఇరువురు లబ్ధిదారులకు పాదాభివందనం చేసి పింఛన్లు అందజేశారు. లబ్బర్తి, దూసరపాము, రాజవొమ్మంగి, జడ్డంగి తదితర గ్రామాల్లో లబ్ధిదారులకు పింఛన్లు అందజేసి వారి యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. తెదేపా వ్యవస్థాపక అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్, ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్‌కల్యాణ్‌ చిత్రపటాలకు పూలమాలలు వేసి లబ్ధిదారులతో కలసి పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా శిరీషాదేవి మాట్లాడుతూ బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతికి కూటమి ప్రభుత్వం కృషి చేస్తోందని తెలిపారు. గత ప్రభుత్వ హయాంలో అయిదేళ్లు రూ. 250 చొప్పున పెంచుకుంటూ రూ 3 వేలు చేశారు. అదే ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు పెంచిన పింఛను రూ. 4 వేలతోపాటు ఏప్రిల్, మే, జూన్‌ నెలలకు రూ వెయ్యి చొప్పున మొత్తం రూ. ఏడు వేలు పింఛను అందజేసిన ఘనత చంద్రబాబుకే దక్కుతుందన్నారు. జడ్పీటీసీ సభ్యురాలు వి.జ్యోతి, ఎంపీడీఓ ఎల్‌.యాదగిరీశ్వరరావు, తెదేపా, జనసేన మండలాధ్యక్షులు జి.పెద్దిరాజు, బి.త్రిమూర్తులు, తెదేపా మండల మహిళా అధ్యక్షురాలు ఎం.సావిత్రి, ప్రధాన కార్యదర్శి ఎం.కేశవ్, సొసైటీ మాజీ అధ్యక్షుడు జి.తాతారావు, సచివాలయ సిబ్బంది, అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. రంపచోడవరం ఎర్రంరెడ్డినగరంలో ఎంపీడీఓ హరికృష్ణ ఆధ్వర్యంలో ఎమ్మెల్యే శిరీషాదేవి లబ్ధిదారులకు పింఛను సొమ్మును పంపిణీ చేశారు. తెదేపా నాయకులు అడబాల బాపిరాజు, సలాది బాపిరాజు, జనసేన నాయకులు పాపోలు శ్రీనివాసరావు, రమణి, నియోజకవర్గ తెలుగు యువత అధ్యక్షుడు మఠం విజయభాస్కర్‌ పాల్గొన్నారు. 


జిల్లాలో 92.02 శాతం పింఛన్ల పంపిణీ 

పాడేరు, న్యూస్‌టుడే: అల్లూరి జిల్లాలో మొదటి రోజు 92.02 శాతం పింఛన్లు పంపిణీ చేసినట్లు కలెక్టర్‌ దినేష్‌కుమార్‌ తెలిపారు. రంపచోడవరం మండలంలో 96.96, హుకుంపేట 96.71, కూనవరం 96.4, ఎటపాక 95.36, అరకులోయ 94.26, అడ్డతీగల 92.66, ముంచంగిపుట్టు 92.57, గంగవరం 91.62, డుంబ్రిగుడ 91.2, చింతపల్లి 91, చింతూరు 90.83, కొయ్యూరు 90.64, జి.మాడుగుల 90.51, అనంతగిరి 90.08, వీఆర్‌పురం 88.68, పాడేరు 87.85, మారేడుమిల్లి 87.59, పెదబయలు 86.45, రాజవొమ్మంగి 83.9, దేవీపట్నం 83.31, వై.రామవరం 82.41, జీకేవీధి మండలంలో 80.63 శాతం పింఛన్లు పంపిణీ చేసినట్లు వివరించారు.


మాట నిలుపుకొన్న బాబు..

కూటమి ప్రభుత్వం నేతృత్వంలో పింఛన్ల పంపిణీ ఊరూరా.. ఇంటింటా పండగలా నిర్వహించారు. రూ.3 వేల నుంచి ఒకేసారి రూ.4 వేలకు పెంచి ఇవ్వడంతో పాటు గత మూడు నెలల బకాయిలు కలిపి రూ. 7 వేల చొప్పున అందించారు. దీంతో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్‌కల్యాణ్‌ చిత్రపటాలకు పాలాభిషేకాలు చేసి ఆనందం పంచుకున్నారు. ఇచ్చిన మాటను నిలబెట్టుకున్న మా బాబు బంగారం అంటూ కొనియాడారు.


పింఛన్ల పెంపు అభినందనీయం

రంపచోడవరం, న్యూస్‌టుడే: సీఎం చంద్రబాబునాయుడు ఎన్నికల్లో ఇచ్చిన హామీ ప్రకారం వృద్ధాప్య, వితంతువులకు పింఛనుదారులకు రూ. 4 వేలు, దివ్యాంగులకు రూ.6వేలు పెంచడం అభినందనీయమని మాజీ ఎమ్మెల్యేలు వంతల రాజేశ్వరి, శీతంశెట్టి వెంకటేశ్వరరావు కొనియాడారు. సోమవారం రంపచోడవరం మండలంలో బి.వెలమలకోట, భీరంపల్లి గ్రామాల్లో లబ్ధిదారులకు పింఛను పంపిణీ చేశారు. వెలమలకోటలో ఎన్టీఆర్‌ విగ్రహానికి, చంద్రబాబు, పవన్‌కల్యాణ్‌ చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు. సర్పంచులు వంతల అచ్చియమ్మ, నూకరాజు, మాజీ ఎంపీటీసీ సభ్యురాలు కారం శేషాయమ్మ, తెదేపా నాయకులు బుడ్డిగ రాజేంద్రవరప్రసాద్, కారం వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు. రంపచోడవరంలో మసీదు కాంప్లెక్స్‌ వెనుకవీధిలో తెలుగు మహిళ రాష్ట్ర ఉపాధ్యక్షురాలు గొర్లె సునీత ఆధ్వర్యంలో పెంచిన పింఛన్లను లబ్ధిదారులకు అందజేశారు. 


ఎంతో ఆనందంగా ఉంది

- ఎం. సరస్వతి, పాడేరు ఐటీడీఏ రేకులకాలనీ  

వృద్ధులు, దివ్యాంగులు, వితంతువులకు పింఛన్లు పెంచుతూ కూటమి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం హర్షించదగినది. వృద్ధాప్యంలో ఉన్న తల్లిదండ్రులను పిల్లలు చూడని ప్రస్తుత రోజుల్లో ప్రభుత్వం అందిస్తున్న పింఛను డబ్బులు ఎంతగానో ఉపయోగపడతాయి. సీఎం చంద్రబాబునాయుడు పింఛను పెంపుపై సంతకం చేయడమే కాకుండా మూడు నెలల బకాయిలతో కలిపి రూ.7 వేలు ఇవ్వడంతో మాకు ఎంతో ఆనందంగా ఉంది. 


ఇతరులపై ఆధారపడకుండా జీవనం

- కాకరి కన్నమ్మ, బిసాయిపుట్టు, హుకుంపేట మండలం 

వృద్ధులకు పింఛను పెంచడంతో ఇతరులపై ఆధాపడే పరిస్థితి ఉండదు. పేదవర్గాలకు ఇది ఎంతగానో ఉపయోగపడుతుంది. గతంలో చంద్రబాబు హయాంలో పింఛను రూ.2 వేలు ఇచ్చారు. ఇది రూ.4 వేలకు పెంచడం సంతోషకరం.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని