logo

ఆదివాసీల మోముల్లో ఆనందోత్సాహాలు

ఎన్టీఆర్‌ భరోసా సామాజిక పింఛన్ల పంపిణీ మన్యంవ్యాప్తంగా పండగలా జరిగింది. సోమవారం ఉదయం 6 గంటల నుంచే సచివాలయ సిబ్బంది, కూటమి నాయకులు ఇంటింటికీ వెళ్లిపింఛన్లు పంపిణీ చేశారు.

Updated : 02 Jul 2024 05:05 IST

పండగలా పింఛను పంపిణీ
చింతపల్లి, కొయ్యూరు, జి.మాడుగుల, అనంతగిరి గ్రామీణం, న్యూస్‌టుడే

ఎన్టీఆర్‌ భరోసా సామాజిక పింఛన్ల పంపిణీ మన్యంవ్యాప్తంగా పండగలా జరిగింది. సోమవారం ఉదయం 6 గంటల నుంచే సచివాలయ సిబ్బంది, కూటమి నాయకులు ఇంటింటికీ వెళ్లిపింఛన్లు పంపిణీ చేశారు. రూ.7 వేల చొప్పున లబ్ధిదారులకు అందించారు. అవ్వాతాతలు, దివ్యాంగులు సంతోషం వ్యక్తంచేశారు. సీఎం చంద్రబాబుకు  ధన్యవాదాలు తెలిపారు. 

ముంచంగిపుట్టు, డుంబ్రిగుడ, న్యూస్‌టుడే: ముంచంగిపుట్టు మండలం దారెలలో సర్పంచి పాండురంగస్వామి, తెదేపా మండల అధ్యక్షులు కించాయిపుట్టులో అవ్వతాతాలతో కలసి సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్‌ చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు. డుంబ్రిగుడ మండలవ్యాప్తంగా 6521 మంది పింఛన్‌దారులు ఉండగా 91.2 శాతం పంపిణీ జరిగిందని ఎంపీడీవో జయఉమ తెలిపారు. సీతగుంట పంచాయతీ చిట్రాయిపుట్టులో సర్పంచి మాధవరావు, ఎంపీటీసీ సభ్యులు బొంజుబాబు, సచివాలయ సిబ్బంది ఇంటింటీ వెళ్లి పింఛన్లు అందించారు. 


అనంతగిరి/గ్రామీణం, న్యూస్‌టుడే: అనంతగిరిలో జడ్పీటీసీ సభ్యుడు గంగరాజు, తెదేపా జిల్లా కార్యవర్గ సభ్యుడు జోగులు, సర్పంచి రూతుల చేతులమీదుగా పింఛన్లు పంపిణీ చేశారు. జీనబాడు పంచాయతీలో గత ప్రభుత్వంలో వాలంటీర్‌గా పనిచేసిన వ్యక్తిని పక్కన కూర్చోబెట్టుకుని సచివాలయ సిబ్బంది పింఛన్‌ పంపిణీ చేశారని తెదేపా నాయకులు విమర్శించారు. దీనిపై ఎంపీడీఓను వివరణ కోరగా.. ఆ సమయానికి ఆయనకు అక్కడకు వచ్చి కూర్చొని ఉండవచ్చని చెప్పారు. కాశీపట్నంలో సర్పంచి జనపరెడ్డి లక్ష్మి, కొత్తూరులో వైస్‌ సర్పంచ్‌ నరేంద్ర ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది.  


కొయ్యూరు, చింతపల్లి న్యూస్‌టుడే: కొయ్యూరులో జీసీసీ మాజీ ఛైర్మన్‌ ఎంవీవీ ప్రసాద్, సర్పంచి బాలరాజు, రాజేంద్రపాలెంలో సర్పంచి పీటా సింహాచలం, తెదేపా మండల కార్యదర్శి దొరబాబు, మర్రివాడలో మాజీ ఎంపీపీ జి.సత్యనారాయణ, కంఠారంలో జడ్పీటీసీ మాజీ సభ్యుడు జి.శ్రీరామ్మూర్తి తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. చింతపల్లిలో ఎంపీడీవో వీరసాయిబాబా, తెదేపా నాయకులు జ్ఞానేశ్వరి, పూర్ణచంద్రరావు, రీమల ఆనంద్‌ ఆధ్వర్యంలో పింఛన్లు పంపిణీ చేశారు.  


జి.మాడుగుల, గూడెంకొత్తవీధి, సీలేరు, న్యూస్‌టుడే: ఎన్నికల్లో ఇచ్చిన హామీ గెలిచిన వెంటనే నెరవేర్చిన ఘనత చంద్రబాబుకే దక్కుతుందని మాజీ ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి అన్నారు. జి.మాడుగుల మండలంలోని పలు గ్రామాల్లో పింఛన్ల పంపిణీలో పాల్గొన్నారు. ఎంపీడీవో లోహిత్‌ జయ సాగర్, నాయకులు కొండలరావు, కళ్యాణం పాల్గొన్నారు. గూడెంకొత్తవీధి మండలంలో 80.63 శాతం పింఛన్ల పంపిణీ పూర్తయ్యిందని ఎంపీడీవో ఉమామహేశ్వరరావు తెలిపారు. ఉదయం 5:30 గంటల నుంచే పూజారిపాకలు గ్రామంలో పింఛన్ల పంపిణీని ఎంపీడీవో ప్రారంభించారు. సీలేరులో దుర్గమ్మ మండపం వద్ద ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్‌కల్యాణ్‌ చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు. శ్రీనివాసు, పాంగి లూషీ, బొర్రాకృష్ణ, రాము, తిరుమలరావు, నాదరరావు పాల్గొన్నారు. 


అడ్డతీగల, న్యూస్‌టుడే: రంపచోడవరం ఎమ్మెల్యే శిరీషాదేవి అడ్డతీగల సీతారామరాజు కాలనీ, సినిమా హాల్‌ కాలనీలో సోమవారం లబ్ధిదారులకు పింఛను పంపిణీ చేశారు. తెదేపా మండలాధ్యక్షుడు వెంకటరమణరెడ్డి పాల్గొన్నారు.


రంపచోడవరం, దేవీపట్నం, రాజవొమ్మంగి, మారేడుమిల్లి, న్యూస్‌టుడే: రంపచోడవరం రెడ్డిపేట, వాల్మీకిపేట, ఎస్టీఆర్‌ కాలనీ, మార్కెట్‌ వీధి తదితర ప్రాంతాల్లో ఎంపీడీఓ హరికృష్ణ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. దేవీపట్నం మండలంలోని ఇందుకూరుపేట ప్రధాన సెంటర్‌లో పార్టీ మండలాధ్యక్షులు మరిశెట్ల వెంకటేశ్వరరావు, ప్రధాన కార్యదర్శి మట్టా మెహర్‌బాబాగౌడ్‌ ఆధ్వర్యంలో పార్టీ శ్రేణులు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్‌కల్యాణ్‌ చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు. పోలవరం ప్రాజెక్టు ముంపు గ్రామాల్లోని లబ్ధిదారులకు పింఛన్లు అందజేశారు. రాజవొమ్మంగి మండలంలో పలు గ్రామాల్లో తెదేపా, జనసేన మండలాధ్యక్షులు జి.పెద్దిరాజు, బి.త్రిమూర్తులు, తెదేపా మండల మహిళా అధ్యక్షురాలు ఎం.సావిత్రి, జడ్పీటీసీ సభ్యురాలు వి.జ్యోతి ఆధ్వర్యంలో పింఛన్ల పంపిణీ పండగలా సాగింది. మారేడుమిల్లి మండలం దేవరపల్లిలో ఎంపీడీఓ వీరకిశోర్, తహసీల్దారు ఏవీ రమణారావు, మారేడుమిల్లిలో తెదేపా మండలాధ్యక్షుడు శేషుకుమార్, టీఎన్‌ఎస్‌ఎఫ్‌ ఉపాధ్యక్షుడు పల్లాల రాజ్‌కుమార్‌రెడ్డి పింఛన్ల పంపిణీ చేపట్టారు. 


చింతూరు, మోతుగూడెం, కూనవరం, వరరామచంద్రాపురం, ఎటపాక, న్యూస్‌టుడే: చింతూరు మండలంలో తెదేపా, జనసేన, భాజపా మండలాధ్యక్షులు ఇల్లా చిన్నారెడ్డి, మడివి రాజు, డీవీఎస్‌ రమణారెడ్డి, మండల కార్యదర్శి మల్లెల వెంకటేశ్వరరావు తదితరులు పింఛన్ల పంపిణీలో పాల్గొన్నారు. మోతుగూడెం, బొడ్డగండి పంచాయతీల్లో ఎన్టీఆర్‌ భరోసా పింఛన్ల పంపిణీ అట్టహాసంగా జరిగింది. ఎంపీటీసీ సభ్యులు వేగి నాగేశ్వరరావు, కరకా వెంకటరమణ తదితరులు పాల్గొన్నారు. కూనవరం కార్యక్రమంలో మాజీ ఎంపీ సోడే రామయ్య, జడ్పీటీసీ మాజీ సభ్యురాలు కన్యకాపరమేశ్వరి, జనసేన మండలాధ్యక్షుడు నరేంద్ర, సాంబశివరావు పాల్గొన్నారు. జడ్పీటీసీ సభ్యుడు వాళ్ల రంగారెడ్డి, తెదేపా మండల అధ్యక్ష, కార్యదర్శులు ఆచంట శ్రీను, బురక కన్నారావు, జనసేన మండల అధ్యక్షుడు ములకాల సాయికృష్ణ, చంద్రబాబు, పవన్‌కల్యాణ్‌ చిత్రపటాలకు పాలాభిషేకాలు చేశారు. ఎటపాక మండలంలో ఎంపీడీఓ మురళీకృష్ణ, తహసీల్దార్‌ శేఖర్, ఏపీఎం స్వామి, కూటమి నాయకుల ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. 


మాట నిలబెట్టుకున్న సీఎం చంద్రబాబు

డుంబ్రిగుడ, న్యూస్‌టుడే: ఎన్నికల్లో ఇచ్చిన మాటను ముఖ్యమంత్రి చంద్రబాబు నిలబెట్టుకున్నారని మాజీ మంత్రి కిడారి శ్రావణ్‌కుమార్‌ అన్నారు. కించుమండలో ఎన్టీఆర్‌ భరోసా సామాజిక పింఛన్ల పంపిణీ చేపట్టారు. ఇందులో శ్రావణ్‌కుమార్‌ పాల్గొన్నారు. డుంబ్రిగుడలో ఎంపీటీసీ సభ్యురాలు గీత పింఛన్లు పంపిణీ చేశారు. తెదేపా, భాజపా, జనసేన మండల అధ్యక్షులు తుడుము సుబ్బారావు, రమేష్, దన్నేశ్వరరావు, నేతలు దన్నెరావు, స్వామి, సుబ్బారావు పాల్గొన్నారు. 

చింతపల్లి, న్యూస్‌టుడే: పింఛనుదారుల కళ్లల్లో ఒకేసారి రూ. ఏడు వేలు అందుకుంటున్నామన్న ఆనందం ఒకవైపు.. ఐదేళ్ల అరాచక వైకాపా పాలన తరువాత తొలిసారిగా తమ ప్రభుత్వ హయాంలో నేరుగా సంక్షేమ కార్యక్రమంలో పాలుపంచుకున్నామన్న కూటమి నేతల ఆనందం మరోవైపు.. వెరసి మండలంలో పింఛన్ల పంపిణీ పండగ వాతావరణంలో కొనసాగింది. పింఛను అందుకున్న వృద్ధులు, వితంతువుల ఆనందానికి అవధులు లేవు.  తెదేపా నాయకులు శరమండ శ్రీధర్, బేరా సత్యనారాయణపడాల్‌ పార్వతీపడాల్, లక్ష్మణ్‌ పాల్గొన్నారు.


అండగా నిలిచారు..

- మడుగూరి పేరమ్మ, లంబసింగి

భర్త చనిపోవడంతో కుటుంబ ఆర్థిక పరిస్థితి దయనీయంగా మారింది. కూలికెళితే గానీ పూటగడవని పరిస్థితి. ఈ పరిస్థితుల్లో వితంతు పింఛను రూ నాలుగు వేలకు పెంచి ముఖ్యమంత్రి చంద్రబాబు మాలాంటివారికి అండగా నిలిచారు. ఎవరిపైనా ఆధారపడకుండా ప్రభుత్వం ఇచ్చే పింఛనుతో ధైర్యంగా జీవనం సాగించేందుకు ఆస్కారం ఏర్పడింది.


కొత్త దుస్తులు కొనుక్కుంటా..

 - లోతా బాలమ్మ, గంగవరం, మంప పంచాయతీ

ఎప్పుడూ ఇంత డబ్బులు పింఛను రాలేదు. ఒక్కసారిగా రూ.ఏడు వేలు అందుకోవడం చాలా ఆనందంగా ఉంది. ఈ డబ్బులతో కొత్త దుస్తులు కొనుక్కొంటాను. మనవలు ఏం అడిగినా కొనలేకపోతున్నాన్న బాధ ఉండేది. ఇప్పుడు వారికి కావాల్సిన చిన్న చిన్న సామగ్రి కొంటాను.


పెద్ద కొడుకులా ఆదుకున్నారు

- పోలవరపు లక్ష్మి, తాజంగి

వృద్ధాప్య సమస్యలతో బాధపడుతున్నా. కళ్లు కనిపించక, కాళ్లు సహకరించక దీనస్థితిలో ఉన్న మాలాంటి వారిని ముఖ్యమంత్రి చంద్రబాబు పెద్దకొడుకులా ఆదుకున్నారు. కొడుకులు, కోడళ్లు ఉన్నా గతంలో పట్టించుకునేవారు కాదు. ఇప్పుడు నాకు వచ్చే పింఛను డబ్బుల కారణంగా కుటుంబంలోనూ గౌరవం, ఆదరణ దక్కుతోంది. 


వైద్యం చేయించుకుంటా..

- గొల్లోరి పండుబాబు, జి.మాడుగుల

రోజూ తాపీ పని చేస్తూ జీవనం సాగిస్తున్నాను. ఇటీవలే ఇంట్లోనే విద్యుత్తు షాక్‌కు గురయ్యాను. ఎడమ చేయికి తీవ్రమైన గాయమైంది. నా దగ్గర ఉన్న కొంత డబ్బులతో వైద్యం చేయించుకున్నాను. అయినా పూర్తిగా నయం కాలేదు. పింఛను సొమ్ముతో వైద్యం చేయించుకుంటాను. 


వ్యాపార అభివృద్ధికి..

- సాగేరి సోమలింగం, ఎంఆర్‌వో కాలనీ, జి.మాడుగుల

ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఇచ్చిన పింఛను మొత్తం దుకాణం అభివృద్ధి చేసుకోవడానికి ఉపయోగపడుతుంది. సొంత డబ్బుతో గ్రామంలో చిన్న దుకాణాన్ని ఏర్పాటు చేసుకున్నాను. రూ.7 వేల పింఛను సొమ్ముతో దుకాణానికి అవసరమైన మరిన్ని సామగ్రి కొనుగోలు చేసి వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకుంటాను. 


భరోసా కలిగింది

- జె.లక్ష్మి, రాజేంద్రపాలెం

గతంలో ఎన్నడూ లేని విధంగా పింఛను రూ. నాలుగు వేలకు పెంచడంతోపాటు ఇచ్చిన మాటకు కట్టుబడి గత మూడు నెలలకు సంబంధించిన రూ.మూడు వేలను కలిపి రూ. ఏడు వేలు అందించారు. చంద్రబాబుకు పింఛనుదారులంతా రుణపడి ఉంటాం. భర్త చనిపోవడంతో కుటుంబ పోషణకు చాలా ఇబ్బందిగా ఉండేది. పింఛను పెంపుతో భరోసా కలిగింది. 


చాలా సంతోషంగా ఉంది

- పంచాది పోతమ్మ, కాశీపట్నం

ఇచ్చిన మాట ప్రకారం సీఎం చంద్రబాబు రూ.7 వేలు పింఛను అందించడం ఆనందంగా ఉంది. గతంలో ఎన్టీఆర్‌ కిలో బియ్యం రూ.2కే అందించి అండగా నిలిచారు. నాలాంటి ఎంతో మందికి ఈ పింఛను సొమ్ము ఆధారమవుతుంది.


చంద్రబాబుకు రుణపడి ఉంటాం

- గెమ్మెల నరసింహులు, బంగారంపేట 

పింఛను రూ.7 వేలు అందించడం వల్ల ఇంట్లో రెండు నెలలకు నిత్యావసర సరుకులకు ఇబ్బందులు ఉండవు. సీఎం చంద్రబాబు ఇచ్చిన మాట ప్రకారం పింఛను పెంచి, మూడు నెలల బకాయిలతో కలిపి రూ.7 వేలు అందించారు. ఆయనకు రుణపడి ఉంటాం

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని