logo

గర్భవతిని చేసి పెళ్లికి నిరాకరించిన నిందితుడికి జైలు

యువతిని గర్భవతిని చేసి పెళ్లికి నిరాకరించిన కేసులో నిందితుడికి పదేళ్ల కారాగార శిక్షతోపాటు రూ.7వేల జరిమానా విధిస్తూ పదకొండో అదనపు జిల్లా న్యాయస్థానం కమ్‌ ఎస్సీ, ఎస్టీ (అత్యాచారాల నిరోధక) న్యాయస్థానం న్యాయమూర్తి పి.శ్రీసత్యదేవి తీర్పునిచ్చారు.

Published : 02 Jul 2024 01:46 IST

విశాఖ లీగల్, కొయ్యూరు, న్యూస్‌టుడే: యువతిని గర్భవతిని చేసి పెళ్లికి నిరాకరించిన కేసులో నిందితుడికి పదేళ్ల కారాగార శిక్షతోపాటు రూ.7వేల జరిమానా విధిస్తూ పదకొండో అదనపు జిల్లా న్యాయస్థానం కమ్‌ ఎస్సీ, ఎస్టీ (అత్యాచారాల నిరోధక) న్యాయస్థానం న్యాయమూర్తి పి.శ్రీసత్యదేవి తీర్పునిచ్చారు. నిందితుడికి సహకరించిన బంధువులకు జరిమానా విధించారు. న్యాయస్థానం అదనపు పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌ బి.వి.ఆర్‌.మూర్తి కథనం ప్రకారం.. అల్లూరి సీతారామరాజు జిల్లా కొయ్యూరు మండలం, వై.ఎన్‌.పాకలు గ్రామానికి చెందిన సర్కారపు గిరీష్‌ అలియాస్‌ సుర్ల గిరీష్‌కు భార్యా, ఇద్దరు పిల్లలు ఉన్నారు. అదే మండలం నడింపల్లి గ్రామానికి చెందిన గిరిజన యువతి (25)ని ప్రేమించి, పెళ్లి చేసుకుంటానని నమ్మబలికాడు. ఈ నేపథ్యంలో ఆమెను పలుమార్లు లోబర్చుకుని గర్భవతిని చేశాడు. అనంతరం యువతి వివాహం చేసుకోమని కోరితే తనకు ఇంతకు ముందే పెళ్లయిందని, ఇద్దరు పిల్లలున్నారని చెప్పి తప్పించుకుని తిరిగాడు. బాధితురాలు కులపెద్దలకు ఫిర్యాదు చేయడంతో వారు పంచాయితీ పెట్టారు. పంచాయితీలో గిరీష్, అతని భార్య సుర్ల విజయజ్యోతి, గిరీష్‌ తల్లి సుర్ల కొండమ్మ, పినతల్లి రేగ తలుపులమ్మ, సోదరుడు సుర్ల కృష్ణ బాధితురాలిని తమ కుటుంబంలోకి తీసుకోవడానికి ఒప్పుకొన్నారు. గిరీష్‌ కూడా అంగీకరించడంతో వివాదం సద్దుమణిగింది. తర్వాత వారు మాట తప్పి ఎదురుతిరిగారు. ఈ క్రమంలో 2021 ఆగస్టు 25న బస్టాప్‌లో ఉన్న యువతిపై దౌర్జన్యం చేశారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు నర్సీపట్నం పోలీసులు కేసు నమోదు చేసి నిందితులను కోర్టుకు హాజరుపరిచారు. సాక్ష్యాధారాలను పరిశీలించిన న్యాయమూర్తి ప్రధాన నిందితుడికి పదేళ్ల జైలు, జరిమానా, మిగతా నిందితులు ఒక్కొక్కరికీ రూ.6వేల చొప్పున జరిమానా విధించారు.   

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని