logo

కూటమి హయాం.. ఐటీడీఏలకు జీవం!

గిరిజనులకు అండగా నిలుస్తూ.. గిరిజనాభివృద్దిని దిశా నిర్దేశం చేసిన ఐటీడీఏలు వైకాపా పాలనలో భ్రష్టుపట్టాయి. గతంలో చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఓ వెలుగు వెలిగిన గిరిజనాభివృద్ధి సంస్థలు 2019-2024 మధ్య నిర్వీర్యమయ్యాయి.

Published : 01 Jul 2024 02:31 IST

వైకాపా పాలనలో కునారిల్లిన గిరిజనాభివృద్ధి సంస్థలు
పాడేరు, రంపచోడవరం, న్యూస్‌టుడే

గిరిజనులకు అండగా నిలుస్తూ.. గిరిజనాభివృద్దిని దిశా నిర్దేశం చేసిన ఐటీడీఏలు వైకాపా పాలనలో భ్రష్టుపట్టాయి. గతంలో చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఓ వెలుగు వెలిగిన గిరిజనాభివృద్ధి సంస్థలు 2019-2024 మధ్య నిర్వీర్యమయ్యాయి. దీంతో కష్టకాలంలో మన్యం ప్రజలకు అండగా నిలిచేవారే కరవయ్యారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రజల కష్టాలను గుర్తించిన సాలూరు ఎమ్మెల్యే గుమ్మడి సంధ్యారాణి మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఐటీడీఏలపై దృష్టి సారిస్తామని హామీ ఇచ్చారు. ఐటీడీఏలకు కొత్త రూపు తీసుకొస్తామని పేర్కొన్నారు. దీంతో ఇన్నాళ్లుగా విస్మరణకు గురైన గిరిజనాభివృద్ధి సంస్థలకు మళ్లీ పూర్వవైభవం వస్తుందని గిరిజన గ్రామాల ప్రజలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

వైకాపా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి గిరిజనులకు సబంధించిన పథకాలకు ఒక్కొక్కటిగా కోత విధించింది. నిబంధనల ప్రకారం ప్రతి మూడు నెలలకు ఒకసారి గిరిజనాభివృద్ధి సంస్థ పాలకవర్గ సమావేశాలు నిర్వహించాలి. ఈ సమావేశాల్లో గిరిజన ప్రాంతంలో చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల అమలు తీరుపై సమీక్షించాలి. అక్రమార్కులపై చర్యలకు సిఫార్సులు చేయాలి. కానీ వైకాపా అయిదేళ్ల పాలనలో ఒకటి, రెండు మాత్రమే సమావేశాలు నిర్వహించారు. సాంకేతిక ఇబ్బందుల పేరు చెప్పి చాలాసార్లు ఈ సమావేశాలకు ఎగనామం పెట్టారు. గ్రామాల్లో ఎలాంటి అభివృద్ధి పనులు జరగకపోవడం, నిధుల మంజూరు మాట లేకపోవడంతో ప్రతి శుక్రవారం జరిగే స్పందనకు వచ్చేవారి సంఖ్య కూడా తగ్గిపోయింది. తెదేపా అధికారంలో ఉన్న 2014-2019 సంవత్సర కాలంలో రంపచోడవరంలో కలెక్టర్‌ అధ్యక్షతన పలుసార్లు పాలకవర్గ సమావేశాలు జరిగాయి. ఈ సమావేశాల్లో మంత్రులు, ఎమ్మెల్యేలతోపాటు జిల్లా ఉన్నతాధికారులు హాజరయ్యారు. వైకాపా అధికారం చేపట్టిన ఈ ఐదేళ్లలో ఆ మాటే మరిచారు.

రాయితీలకు మంగళం

అయిదేళ్లలో రాయితీ యూనిట్లు, పథకాలకు మంగళం పాడేశారు. వాటిని పునరుద్ధరిస్తారని గిరిజనులు ఆశగా ఎదురు చూస్తున్నారు. గిరిజనులకు సేవలు అందించే గిరిజన సహకార సంస్థ (జీసీసీ) సిబ్బంది కొరత, ఇతర సమస్యతో సతమతం అవుతోంది. దీంతో గిరిజన ఉత్పత్తులకు మద్దతు ధర లేకుండా పోయింది. దళారీ వ్యవస్థ పెరిగింది. గిరిజన ఆశ్రమ పాఠశాలలు, పోస్టు మెట్రిక్‌ వసతి గృహాల్లో ఆరోగ్య కార్యకర్తల వ్యవస్థ కానరాకుండా చేశారు.

పథకాల కోత..

గతంలో గిరిజనుల సంక్షేమం కోసం ఐటీడీఏలకు వచ్చే ట్రైకార్, ఎన్‌ఎస్టీ ఎఫ్‌డీసీ, ఓబీఏఎస్‌ఎస్‌ వంటి పథకాలు అమలయ్యేవి. ఏటా ఈ పద్దుల కింద రూ. 10 కోట్ల వరకు అందుబాటులో ఉండేవి. వీటితో వివిధ రకాల అభివృద్ధి పనులు చేసేవారు. వీటికి వైకాపా హయాంలో గ్రాంటు నిలిపేశారు. ఈ నిధులు ఆపేయడంతో గిరిజన ప్రాంతాల్లోని వ్యవసాయ, ఉద్యాన శాఖల్లో  పనులు లేకుండా పోయాయి. రోడ్లు, తాగునీరు, ఇతర మౌలిక సదుపాయాల కల్పనకు చర్యలు చేపట్టాలని వేడుకున్నా మోక్షం కలగలేదు. కేంద్రం నుంచి వచ్చే నిధులను సైతం సక్రమంగా వినియోగించలేదనే విమర్శలూ ఉన్నాయి.

ఊసేలేని ఉద్యోగ, ఉపాధి శిక్షణ

ఏజెన్సీ ప్రాంతంలో గిరిజనులతోపాటు గిరిజనేతర నిరుద్యోగులకు వివిధ ఉద్యోగాలతోపాటు స్వయం ఉపాధి కల్పించాలనే లక్ష్యంతో అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు యువజన శిక్షణ కేంద్రాలు (వైటీసీ) ఏర్పాటు చేశారు. వీటిద్వారా నిరుద్యోగ యువతకు వివిధ విభాగాల్లో శిక్షణ తరగతులతోపాటు ఉద్యోగావకాశాలు కల్పించేవారు. ప్రభుత్వ ఉద్యోగాలు పొందేందుకు నైపుణ్యం కలిగిన బోధకులతో కోచింగ్‌ ఇచ్చేవారు. ముఖ్యంగా మెగా ఉద్యోగ మేళాలు నిర్వహించి ప్రముఖమైన కంపెనీలలో ఉద్యోగాలను కల్పించి ఆర్థిక భరోసాను కల్పించేవారు. వైకాపా అధికారంలోకి వచ్చిన తర్వాత వైటీసీలను నిర్వీర్యం చేశారు.

మార్గదర్శకాలకు అనుగుణంగా: ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగా ముందుకు వెళ్తాం. ప్రభుత్వం సహకారంతో గిరిజనాభివృద్ధి చర్యలు చేపడతాం. ఐటీడీఏ పాలకవర్గ సమావేశాలకు సబంధించి ఉత్తర్వులు వస్తే నిర్వహణపై దృష్టి పెడతాం.

వి.అభిషేక్, పాడేరు ఐటీడీఏ పీఓ

పూర్వ వైభవం తెస్తాం... గత ఐదేళ్ల వైకాపా పాలనలో గిరిజనాభివృద్ధి పూర్తిగా కుంటుపడింది. అభివృద్ధి పనులు, సమస్యలపై చర్చించేందుకు ఐటీడీఏ పాలకవర్గ సమావేశాలు నిర్వహించలేదు. గత ఐదేళ్లలో ఒక్కసారి మాత్రమే పాలకవర్గ సమావేశాన్ని నిర్వహించడం దారుణం. కూటమి పాలనలో ఐటీడీఏలకు పూర్వవైభవం తీసుకొస్తాం. ప్రతి ఆరు నెలలకు ఒకసారి పాలకవర్గ సమావేశాన్ని నిర్వహించేందుకు చర్యలు చేపడతాం. నియోజకవర్గంలో విద్య, వైద్యం, తాగునీరు సదుపాయాల మెరుగుకు కృషి చేస్తాను.

మిరియాల శిరీషాదేవి, ఎమ్మెల్యే, రంపచోడవరం 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు