logo

మేమున్నామని.. మీకేం కాదని!

వైద్యో నారాయణ హరి అన్నది పెద్దలు చెప్పినమాట. ఆపద సమయంలో ప్రాణంపోసే వైద్యుడిని దేవుడితో సమానంగా చూస్తాం. రాత్రి, పగలు తేడాలేకుండా నిరంతరం విధినిర్వహణలో ఉంటూ సేవలందించే వారిలో వైద్యులే ముందువరుసలో ఉంటారు.

Updated : 01 Jul 2024 05:40 IST

రోగుల్లో భరోసా నింపేలా వైద్యుల సేవలు

వైద్యో నారాయణ హరి అన్నది పెద్దలు చెప్పినమాట. ఆపద సమయంలో ప్రాణంపోసే వైద్యుడిని దేవుడితో సమానంగా చూస్తాం. రాత్రి, పగలు తేడాలేకుండా నిరంతరం విధినిర్వహణలో ఉంటూ సేవలందించే వారిలో వైద్యులే ముందువరుసలో ఉంటారు. విభిన్న భౌగోళిక పరిస్థితులున్న ఉమ్మడి విశాఖ జిల్లాలో ఎంతో ఇబ్బందులు పడుతూనే సేవాదృక్పథంతో పనిచేస్తున్న వైద్యులెందరో ఉన్నారు. సోమవారం వైద్యుల దినోత్సవం సందర్భంగా తమ సేవలతో పదుగురి ప్రశంసలు అందుకున్నవారిపై కథనం.

కరోనా సమయంలో వైద్యసేవలందిస్తున్న కనకదుర్గ

అనకాపల్లి పట్టణం, న్యూస్‌టుడే: సాధారణ సమయంలో వైద్యం చేసి ప్రాణాలను నిలపడం ఒక ఎత్తయితే కరోనా లాంటి మహమ్మారి ప్రజల ప్రాణాలను తీసేస్తున్న సమయంలో తమ ప్రాణాలను పణంగా పెట్టి వైద్యం చేయడం నిజంగా సాహసమే. ప్రైవేటు క్లినిక్‌లు మూతపడి వైద్యం చేయలేమని కొంతమంది వైద్యులు చేతులు ఎత్తేయగా ప్రభుత్వ ఆసుపత్రుల్లో పనిచేసే వైద్యులు మాత్రం మేమున్నామంటూ ధైర్యంగా ముందుకొచ్చి రోగులకు సేవలు అందించారు. అనకాపల్లి ఎన్టీఆర్‌ జిల్లా ఆసుపత్రిలో కొవిడ్‌ సమయంలో కీలకంగా నిలిచి.. నిరంతరం సేవలందించి ప్రాణాలు నిలిపిన వైద్యులు పలువురికి ఆదర్శంగా నిలిచారు.

సేవల్లో ప్రతిభ చూపడంతో ప్రశంస అందుకుంటున్న వైద్యుడు లక్ష్మణరావు


ఎప్పటికీ గుర్తుంటాయి!

కొవిడ్‌ మొదటిదశలో వైద్యం ఎలా అందించాలి అనేది చాలా సందిగ్ధంగా ఉండేది. రోగి ఆసుపత్రికి వచ్చిన కొంతసేపటికే ఆక్సిజన్‌ స్థాయి పడిపోయేది. ఆక్సిజన్‌ అందించేలోగానే కంటి ముందు చనిపోయేవారు. ఇలాంటి సమయంలో ఆక్సిజన్‌ మాస్కులను అమర్చి చాలామందికి వైద్యం అందించాం. రోగి బంధువులే దగ్గరకు రాడానికి భయపడేవాళ్లు. మేం పీపీటీ కిట్లు వేసుకుని వైద్యం అందించేవాళ్లం. నాకు రెండుసార్లు కొవిడ్‌ సోకింది. కొద్దిరోజులు సెలవు పెట్టి తేరుకుని తిరిగి వైద్యసేవలు అందించా. కొవిడ్‌ సమయంలో రోగులకు అందించిన సేవలు మాకు ఎప్పటికీ గుర్తుండిపోతాయి. కరోనా సోకితే చనిపోతామని తెలిసినా చాలా మంది వైద్యులు వారి ప్రాణాలకు పణంగా పెట్టి సేవలు అందించి ఎంతో మంది ప్రాణాలను కాపాడారు. వైద్యురాలిగా కరోనా సమయంలో ఆక్సిజన్‌ మాస్కులతోపాటు చాలామందికి ఆహారం అందడం కష్టంగా ఉండేది. ఇలాంటి వారికి సాయం అందించడానికి అమెరికాలో ఉన్న నా స్నేహితుల సాయం కోరగా వారు రూ. 3 లక్షల వరకు పంపారు. వాటితో హెచ్‌ఐవీ రోగులకు ఆహారంతోపాటు రోగులకు అవసరమైన మాస్కులను అందించాం.

డాక్టర్‌ కనకదుర్గ, పెథాలజిస్టు, ఎన్టీఆర్‌ జిల్లా ఆసుపత్రి, అనకాపల్లి


గైనిక్‌ వార్డులో సేవలు

డాక్టర్‌ విష్ణుప్రియ, గైనకాలజిస్టు, అనకాపల్లి

కరోనా సమయంలో ప్రసవాలు చేయడం నిజంగా చాలా సాహసమే. జాగ్రత్తలు పాటిస్తూ తల్లి, బిడ్డలను కాపాడేలా అందించిన వైద్యం మాకు ఎప్పటికీ గుర్తుండి పోతుంది. కరోనా మొదటి, రెండు దశల్లో ప్రైవేటు ఆసుపత్రులు చాలావరకు దాదాపుగా మూసేశారు. ఉదయం, రాత్రి ఆసుపత్రిలోనే ఉండి తోటి సిబ్బంది నర్సుల సాయంతో ప్రసవాలు చేశాం. నాకు ఇద్దరు చిన్నపిల్లలు. వాళ్లవద్దకు జాగ్రత్తలు పాటించి వెళ్తూ ఆసుపత్రిలో ప్రసవాలు చేసేదాన్ని. కొవిడ్‌ సమయంలో అనకాపల్లి ఆసుపత్రిలో అధిక ప్రసవాలు చేశాం.


బహుముఖ ప్రజ్ఞాశాలి

గూడెంకొత్తవీధి, న్యూస్‌టుడే:  సామాన్య గిరిజన కుటుంబంలో పుట్టి వైద్యుడిగా, బోధకుడిగా, క్రీడాకారుడిగా, కళాకారుడిగా రాణిస్తూ బహుముఖ ప్రజ్ఞాశాలిగా గుర్తింపు తెచ్చుకుంటున్నారు గూడెంకొత్తవీధి మండలానికి చెందిన పసుపులేటి లక్ష్మణరావు. గూడెంకాలనీ గ్రామానికి చెందిన లక్ష్మణరావు ఇంటర్‌ నుంచి ఎంబీబీఎస్‌ వరకు కిరోసిన్‌ దీపంలోనే చదువుకున్నారు. తొలిసారి విజయనగరం జిల్లా గరుగుబిల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో వైద్యుడిగా ఎనిమిదేళ్లు పనిచేశారు. కేరళ, తెలంగాణ రాష్ట్రాల్లోనూ పనిచేసినా సొంత ప్రాంతంలో గిరిజనులకు వైద్యసేవలు అందించాలని చింతపల్లి వచ్చారు. ఇక్కడ ఆరుగురు వైద్యులు ఉండాల్సి ఉన్నా.. ఎవరూ రావడానికి ఇష్టపడకపోతే ఆయన ఒక్కరే డిప్యూటీ సివిల్‌ సర్జన్‌గా మూడేళ్లు పనిచేసి ఆసుపత్రి అభివృద్ధికి కృషి చేశారు. అక్కడి నుంచి విశాఖ కేజీహెచ్‌ ఎస్టీసెల్‌ వైద్యుడిగా బాధ్యతలు స్వీకరించి మన్యం ప్రాంతం నుంచి వచ్చే గిరిజనులకు విశేష సేవలందించారు. కరోనా సమయంలోనూ ప్రత్యేక అధికారిగా సేవలు అందించారు. విశాఖలోని ఆంధ్రా మెడికల్‌ కళాశాల, శ్రీకాకుళం, విజయనగరం ప్రభుత్వ వైద్య కళాశాలల్లో అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌గా పనిచేశారు. ప్రస్తుతం విశాఖపట్నంలోని ఆంధ్రా వైద్య కళాశాలలో అసోసియేట్‌ ప్రొఫెసర్‌గా పనిచేస్తూ వైద్య విద్యార్థులకు బోధిస్తున్నారు.


గిరిజనుల కంటి సమస్యలపై ‘దృష్టి’

చింతపల్లిలో రోగులను పరీక్షిస్తున్న జగన్‌

చింతపల్లి, న్యూస్‌టుడే: గిరిజన ప్రాంతాల్లో అంధత్వ నివారణ దిశగా పాడేరు ఐటీడీఏ చింతపల్లి సామాజిక ఆరోగ్య కేంద్రంలో దృష్టి ఐకేర్‌ యూనిట్‌ను ఏర్పాటు చేసింది. ఈ కేంద్రం నిర్వహిస్తున్న దృష్టి ఐకేర్‌ ఎండీ కన్సల్టెంట్‌ ఆప్టోమెట్రిస్ట్‌ గాలి జగన్‌ ఆసుపత్రిలో రోగులకు అందుబాటులో ఉంటూ మెరుగైన సేవలందిస్తున్నారు. ఈ కేంద్రానికి ప్రతిరోజూ కనీసం 30 మంది వరకూ వస్తున్నారు. నెలకు సుమారు 900 మందికి పైగా గిరిజనులు వైద్యం పొందుతున్నారు.  ‘అవసరమైన వారికి శస్త్రచికిత్సలనూ పూర్తి ఉచితంగా చేయిస్తున్నాం. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు ప్రత్యేకంగా కంటి పరీక్షలు నిర్వహిస్తున్నామ’ని జగన్‌ తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని