logo

తుక్కు బస్సులతో.. అవస్థలు

ఆర్టీసీ బస్సు ఛార్జీలను మూడుసార్లు పెంచేసిన వైకాపా ప్రభుత్వం బస్సుల నిర్వహణను మాత్రం గాలికొదిలేసింది. తుక్కు కింద మార్చాల్సిన వాటిని రోడ్డెక్కించేసి ప్రజల ప్రాణాలతో చెలగాటమాడింది. వాటిని సక్రమంగా నిర్వహించకపోవడంతో కొన్ని బస్సుల్లో సమస్యలు ఉత్పన్నమవుతున్నాయి.

Published : 01 Jul 2024 02:25 IST

వైకాపా అయిదేళ్ల పాలనలో నరకం
అధ్వానంగా ద్వారకా బస్‌స్టాండ్‌ పరిసరాలు
పట్టించుకోని యంత్రాంగం

ఆర్టీసీ బస్సు ఛార్జీలను మూడుసార్లు పెంచేసిన వైకాపా ప్రభుత్వం బస్సుల నిర్వహణను మాత్రం గాలికొదిలేసింది. తుక్కు కింద మార్చాల్సిన వాటిని రోడ్డెక్కించేసి ప్రజల ప్రాణాలతో చెలగాటమాడింది. వాటిని సక్రమంగా నిర్వహించకపోవడంతో కొన్ని బస్సుల్లో సమస్యలు ఉత్పన్నమవుతున్నాయి. కొన్ని కాంప్లెక్సు వద్ద బయలుదేరిన కొద్ది సమయానికే ఆగిపోతున్నాయి. స్టీరింగులు పట్టేసి, బ్రేకులు ఫెయిలవుతున్నాయి.

జిల్లా వ్యాప్తంగా లక్షల మంది ప్రయాణించే ఆర్టీసీ బస్సులు ఎక్కడ, ఎలా ప్రమాదానికి గురవుతున్నాయో తెలియని పరిస్థితి నెలకొంది. మరో వైపు ద్వారకా బస్‌స్టాండ్‌తో పాటు మిగిలిన డిపోల నిర్వహణ తీసికట్టుగా ఉండడంతో ప్రజలు అసహనం వ్యక్తం చేస్తున్నారు. కూటమి ప్రభుత్వ పాలనలోనైనా సురక్షిత ప్రయాణం అందిస్తారని ప్రజలంతా ఆశగా ఎదురు చూస్తున్నారు. సోమవారం రవాణా శాఖ మంత్రి రామ్‌ప్రసాద్‌ రెడ్డి ద్వారకా బస్‌స్టాండ్‌ను తనిఖీ చేయనున్నారు. ఈ నేపథ్యంలో సమస్యల పరిష్కారంపై దృష్టి సారించాలని అంతా కోరుతున్నారు.

సురక్షిత ప్రయాణంపై ఆశలు: జిల్లాలోని మొత్తం బస్సుల్లో సగానికిపైగా పరిమితికి మించి తిరిగినవే ఉన్నాయి. ఏసీ బస్సుల్లో 70 శాతం బస్సులు 15 లక్షల కి.మీ. దాటిపోయాయి. దూర ప్రాంతాలకు తిరిగే వీటిల్లో బ్రేక్‌డౌన్స్‌ పెరిగిపోయాయి. సీట్లు ఊడిపోవడం, అద్దాలు విరిగిపోయినా అలానే నడిపించేస్తున్నారు. లోపల ఫ్లోరింగ్‌ సరిగా లేనివి అనేకం ఉన్నాయి. సిటీ బస్సుల పరిస్థితి మరీ దారుణంగా ఉంది. కొన్నింటిలో ప్రయాణించడానికి సాహసించాల్సిందే అన్నట్లు ఉంటున్నాయి.

కాంప్లెక్సులో పనిచేయని కెమెరాలు

అధ్వానంగా బస్‌స్టాండ్‌..: నగరంలోని కీలకమైన ద్వారకా బస్‌స్టాండ్‌ సమస్యలతో స్వాగతం పలుకుతోంది. వేల మంది ప్రయాణికులతో కిటకిటలాడే బస్‌స్టాండ్‌లో సరిపడా సీసీ కెమెరాలు లేకపోగా ఉన్నవి సరిగా పనిచేయడం లేదు. గతంలో అనేకమార్లు దొంగతనాలు చోటుచేసుకున్నాయి. అయినా పూర్తిస్థాయిలో యంత్రాంగం ఏర్పాటు చేయలేదు. ప్రయాణికుల రద్దీ నియంత్రణ ఎప్పుడూ గందరగోళమే. మూత్రశాలల వద్ద ప్రయాణికుల నుంచి అధిక డబ్బులు వసూలు చేస్తున్నారన్న విమర్శలు ఉన్నాయి. కార్గో సేవల పేరుతో వేకువజాము నడిపే బస్సుల్లో పార్శిళ్లను తరలించడంపై ప్రయాణికులు మండిపడుతున్నారు. నగర పరిధిలో మద్దిలపాలెం, గాజువాక, పెదవాల్తేరు, ఎంవీపీ కాలనీ బస్‌స్టాండు ప్రాంగణాల్లో కార్గో సేవల పేరుతో అక్రమాలకు పాల్పడుతున్నారన్న ఆరోపణలు ఉన్నాయి.  పార్కింగు అస్తవ్యస్తంగా ఉంటోంది.

  • ముఖ్యంగా ప్రైవేటు బస్సులను ఇష్టానుసారంగా తిప్పుతున్నా అధికారులు కళ్లప్పగించి చూస్తున్నారు. వాటన్నింటినీ కాంప్లెక్సు పరిసర ప్రాంతాల్లోనే ఉంచి ప్రయాణికులను ఎక్కిస్తున్నా పట్టించుకోవడం లేదు. గతంలో కాంప్లెక్సు పరిసరాల్లో ఏ ప్రైవేటు బస్సును ఆపనిచ్చేవారు కాదు. ఇప్పుడు కాంప్లెక్సులోకి వచ్చి మరీ ప్రయాణికులను తీసుకువెళ్తున్నా ఎవరూ పట్టించుకోవడం లేదు. ఆర్టీసీ అధికారులు ప్రైవేటు నిర్వాహకులతో కుమ్మక్కవ్వడంతో పట్టించుకోవడం లేదన్న ఆరోపణలు ముందు నుంచీ ఉన్నాయి.   
  • గ్యారేజీ సిబ్బంది పూర్తిస్థాయిలో లేకపోవడంతో నిర్వహణ కష్టంగా మారుతోంది. బస్సులకు సంబంధించిన విడి భాగాలు, ఇతర పరికరాలు కొత్తవి అందుబాటులో ఉండకపోవడం, వాడిన వాటినే మళ్లీమళ్లీ వినియోగించడంతో తరచూ సమస్యలు ఉత్పన్నమవుతున్నాయి. వీటన్నింటినీ పరిష్కరించాల్సి ఉంది.  
  • పాడైన వాటిని వర్క్‌షాపులకు పంపితే రూ.లక్షల్లో ఖర్చవుతుందని స్థానిక వ్యక్తులతో తక్కువ ఖర్చుతో చేయిస్తున్నారన్న విమర్శలున్నాయి. అత్యవసర పనులకు మాత్రమే గ్యారేజీకు పంపేలా కాకుండా తరచూ వాటి సామర్థ్యాలు తనిఖీ చేసేలా పంపితే బాగుంటుంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని