logo

సందర్శకుల భద్రతే ముఖ్యం

పర్యటకం అభివృద్ధి చెందడం ఎంత ముఖ్యమో, ఆ కేంద్రాలను చూడటానికి వచ్చే సందర్శకుల భద్రత అంతకన్నా ముఖ్యమని రాష్ట్ర పర్యటక శాఖ మంత్రి కందుల దుర్గేష్‌ అన్నారు. దేవీపట్నం మండలం పోశమ్మగండి ప్రాంతంలో ఆదివారం సాయంత్రం ఆయన పర్యటించారు.

Published : 01 Jul 2024 02:19 IST

పర్యటక శాఖ మంత్రి దుర్గేష్‌

బోటుపై వెళ్తున్న మంత్రి కందుల దుర్గేష్, సబ్‌ కలెక్టర్‌ ప్రశాంత్‌కుమార్‌

దేవీపట్నం, న్యూస్‌టుడే: పర్యటకం అభివృద్ధి చెందడం ఎంత ముఖ్యమో, ఆ కేంద్రాలను చూడటానికి వచ్చే సందర్శకుల భద్రత అంతకన్నా ముఖ్యమని రాష్ట్ర పర్యటక శాఖ మంత్రి కందుల దుర్గేష్‌ అన్నారు. దేవీపట్నం మండలం పోశమ్మగండి ప్రాంతంలో ఆదివారం సాయంత్రం ఆయన పర్యటించారు. కంట్రోల్‌ రూంను పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ పేరంటాలపల్లి వద్ద వర్షాకాలంలో ఆలయానికి వెళ్లి వచ్చే సందర్శకులు ఇబ్బందులు పడకుండా (మొబైల్‌ స్టెప్స్‌) ఏర్పాటు చేస్తామన్నారు. కొరుటూరు వద్ద బస ఉండటానికి వసతులు సమకూర్చనున్నట్లు పేర్కొన్నారు. బోట్ల భద్రత విషయంలో మరిన్ని జాగ్రత్తలు తీసుకుంటామని చెప్పారు. వీటిలో గ్యాస్‌ బండలు తీసుకు వెళ్లొద్దన్నారు. పోలవరం ప్రాజెక్టు  నీటిమట్టం స్థాయిని బట్టి శాశ్వత కట్టడాలు అభివృద్ధి చేయడానికి చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. మారేడుమిల్లి మండలంలోని గుడిసె ప్రాంతం సందర్శకులను అద్భుతంగా ఆకట్టుకుంటోందన్నారు. ఈ ప్రాంతాన్ని మరింత అభివృద్ధిచేసి సౌకర్యాలు కల్పించాలని అధికారులకు సూచించారు. ‘పుష్ప’ సినిమా చిత్రీకరించిన ప్రాంతాలు సందర్శకులు చూసేందుకు అనువుగా ఏవిధంగా తయారు చేయాలనే దానిపై నివేదికలు తెప్పించి చర్యలు తీసుకుంటామని చెప్పారు. గడిచిన అయిదేళ్లలో పర్యటక రంగానికి ఒక్క రూపాయి కూడా ఖర్చు చేయలేదని మంత్రి స్పష్టం చేశారు. పోశమ్మగండి నుంచి బోటుపై పూడిపల్లి వరకు మంత్రి వెళ్లారు. దేవీపట్నంలో జనసైనికులు మంత్రితో ఫొటోలు తీసుకున్నారు.

విహార యాత్రికులతో ముఖాముఖి.. పాపికొండల విహారయాత్రను ముగించుకుని పోశమ్మగండి చేరుకున్న సందర్శకులతో మంత్రి దుర్గేష్‌ ముచ్చటించారు. పాపికొండల విహారయాత్ర ఎలా జరిగింది, ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా.. అడిగి తెలుసుకున్నారు. ఇంకా ఏం చేయాలో సూచనలు చేస్తే మరింత అభివృద్ధి చేస్తామన్నారు. బోటు పాయింట్‌ వద్ద వెయిటింగ్‌ రూం ఏర్పాటుతోపాటు మరుగుదొడ్ల సౌకర్యం కల్పించాలని సందర్శకులు కోరారు. రాజమహేంద్రవరం నుంచి పోశమ్మగండికి వచ్చే మార్గంలో కొంతమేర రహదారి అధ్వానంగా ఉందని పర్యటకులు చెప్పారు. అనంతరం మంత్రి బోటు నిర్వాహకులతో మాట్లాడారు.గండిపోశమ్మ దర్శనం చేసుకుని తిరిగి వెళ్లి పోయారు. మంత్రి పర్యటనలో సబ్‌ కలెక్టర్‌ ప్రశాంతకుమార్, గోకవరం రేంజ్‌ అధికారి దుర్గాకుమార్‌ తదితరులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని