logo

మన్యం బాలలకు కార్పొరేట్‌ విద్య!

ప్రతిభావంతులైన ఎస్సీ, ఎస్టీ విద్యార్థులు  కార్పొరేట్, ప్రైవేటు పాఠశాలల్లో చదువుకునేలా బెస్ట్‌ అవైలబుల్‌ స్కూల్స్‌ (ఉత్తమ పాఠశాలలు) పథకాన్ని పునరుద్ధరించనున్నట్లు గిరిజన  సంక్షేమ శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి ప్రకటించారు.

Published : 30 Jun 2024 01:48 IST

మళ్లీ తెరపైకి ఉత్తమ పాఠశాలలు

ప్రతిభావంతులైన ఎస్సీ, ఎస్టీ విద్యార్థులు  కార్పొరేట్, ప్రైవేటు పాఠశాలల్లో చదువుకునేలా బెస్ట్‌ అవైలబుల్‌ స్కూల్స్‌ (ఉత్తమ పాఠశాలలు) పథకాన్ని పునరుద్ధరించనున్నట్లు గిరిజన  సంక్షేమ శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి ప్రకటించారు. దీంతో మన్యంవ్యాప్తంగా హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. 2014-2019 మధ్య తెదేపా హయాంలో అమలైన ఈ బీఏఎస్‌ను వైకాపా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నిలిపివేసింది. ఈ పథకాన్ని కొనసాగించాలని ఇక్కడి ప్రజలు డిమాండ్‌ చేసినా ఆ ప్రభుత్వం పట్టించుకోలేదు. కొత్తగా ఏర్పాటైన కూటమి సర్కారు బీఏఎస్‌ను పునఃప్రారంభించే చర్యలకు ఉపక్రమించింది.

పాడేరు పట్టణం, న్యూస్‌టుడే

నిరుపేద గిరి విద్యార్థులకు కార్పొరేట్‌ స్థాయిలో విద్యను అందించి వారి ఉన్నతికి తోడ్పడే లక్ష్యంగా తెదేపా ప్రభుత్వం ఈ పథకాన్ని ప్రారంభించింది. జిల్లాలో ఈ పథకం ద్వారా వేలాది మంది విద్యార్థులకు ప్రయోజనం కలుగుతుండేది. గతంలో ఈ పథకం ద్వారా కార్పొరేట్‌ విద్యను పొందినవారు ఐఏఎస్, ఐఎఫ్‌ఎస్, ఐఆర్‌ఎస్, గ్రూప్‌-1 వంటి ఉన్నత      ఉద్యోగాల్లో స్థిరపడ్డారు. ఈ పథకం ద్వారా చదువుకున్న విద్యార్థులు నూటికి 80 శాతం మంది వివిధ హోదాల్లో స్థిరపడ్డారు. ఇంత మంచి పథకాన్ని అప్పట్లో వైకాపా ప్రభుత్వం సంస్కరణల పేరిట రద్దు చేసిన సంగతి తెలిసిందే.

బకాయిల మాటేమిటి? 

బీఏఎస్‌ ద్వారా విద్యార్థులు ఎంపిక చేసుకున్న పాఠశాలల్లో చదువుకునే వెసులుబాటు అప్పటి ప్రభుత్వం కల్పించింది. ప్రతి విద్యార్థికి ఏడాదికి రూ.30 వేల చొప్పున కేటాయించింది. పాడేరు ఐటీడీఏ పరిధిలో ఈ పథకం ద్వారా ఏడాదికి ఎనిమిది వేల మంది నిరుపేద విద్యార్థులు లబ్ధి పొందేవారు. వైకాపా ప్రభుత్వం ఈ పథకాన్ని రద్దు చేయడంతో విద్యార్థులంతా సమీపంలోని గిరిజన సంక్షేమ వసతిగృహల్లో చేరాల్సి వచ్చింది. అప్పటివరకూ ఈ పథకాన్ని నిర్వహించిన పాఠశాలలకు చెల్లించాల్సిన సొమ్మును అప్పటి ప్రభుత్వం విడుదల చేయలేదు. బకాయి సొమ్ము తక్షణమే విడుదల చేయాలని నిర్వాహకులంతా హైకోర్టును ఆశ్రయించారు. తక్షణమే బకాయిలు విడుదల చేయాలని న్యాయస్థానం ప్రభుత్వానికి ఆదేశాలిచ్చింది. అయితే ప్రభుత్వం కొంతమేర చెల్లించి చేతులు దులుపుకొంది. పలుమార్లు విద్యాసంస్థల యాజమాన్యాలు గిరిజన సంక్షేమ విద్యాశాఖ అధికారులను కలిసి తమకు బకాయిలు విడుదల చేయాలని అభ్యర్థించినా ఫలితం లేకపోయింది. సుమారు రూ.తొమ్మిది కోట్ల మేర బకాయిలు అలాగే ఉండిపోయాయి. ఎన్నికల తర్వాత ప్రభుత్వం మారింది. విద్యాశాఖ మంత్రిగా పదవీ బాధ్యతలు స్వీకరించిన నారా లోకేశ్‌ ఇటీవల నిర్వహించిన సమీక్షలో వసతి దీవెన బకాయిలపై ఆరా తీశారు. దీంతో విద్యా సంస్థల నిర్వాహకుల్లో ఆశలు రేకెత్తాయి. తమ బకాయిలు విడుదల చేయాలని కోరుతున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని