logo

ఆంగ్లం చదవలేరు.. తెలుగు రాయలేరు!

ఉమ్మడి విశాఖ జిల్లాలోని పాఠశాలల్లో విద్యా ప్రమాణాలు దిగజారడంపై జడ్పీటీసీ సభ్యులు ఆందోళన వ్యక్తం చేశారు.

Updated : 30 Jun 2024 03:49 IST

ఉమ్మడి జిల్లాలో దిగజారిన విద్యా ప్రమాణాలు
స్థాయీ సంఘ సమావేశంలో జడ్పీటీసీ సభ్యుల ఆవేదన

సమావేశంలో మాట్లాడుతున్న జడ్పీ ఛైర్‌పర్సన్‌ సుభద్ర, చిత్రంలో సీఈఓ పోలినాయుడు

విశాఖపట్నం, న్యూస్‌టుడే: ఉమ్మడి విశాఖ జిల్లాలోని పాఠశాలల్లో విద్యా ప్రమాణాలు దిగజారడంపై జడ్పీటీసీ సభ్యులు ఆందోళన వ్యక్తం చేశారు. ముఖ్యంగా గిరిజన ప్రాంతాల్లో విద్యా ప్రమాణాలు అత్యంత నాసిరకంగా ఉన్నాయని, పదో తరగతి ఫలితాల్లో అనేక మంది విద్యార్థులు తప్పుతున్నారని, విద్యా వ్యవస్థను గాడిలో పెట్టాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. శనివారం జడ్పీ సమావేశ మందిరంలో ఛైర్‌పర్సన్‌ జల్లిపల్లి సుభద్ర అధ్యక్షతన స్థాయీ సంఘ సమావేశం జరిగింది.

 అనంతగిరి జడ్పీటీసీ సభ్యుడు గంగరాజు మాట్లాడుతూ ఇటీవల రెసిడెన్షియల్‌ పాఠశాలల్లో ప్రవేశాల కోసం తేలిక పాటి పరీక్ష నిర్వహిస్తే హాజరైన విద్యార్థుల్లో ఒకరిద్దరు మినహా మిగిలినవారు ఫెయిలయ్యారన్నారు. పదోతరగతిలో 528 మార్కులు వచ్చిన విద్యార్థి ఆంగ్ల పదాలు చదవలేకపోవడం, తెలుగులో సైతం రాయలేకపోవడం ఆశ్చర్యం కలిగిస్తోందన్నారు. ఎమ్మెల్యేగా ఎన్నికైన హుకుంపేట జడ్పీటీసీ సభ్యుడు మత్స్యలింగం మాట్లాడుతూ ఉపాధ్యాయులు పాఠాలు సరిగా చెప్పడం లేదని, సమయపాలన పాటించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. పాఠశాలలను కూడా తరచూ తనిఖీ చేయడం లేదన్నారు. డీఈఓ బ్రహ్మాజీ స్పందిస్తూ గిరిజన ప్రాంతాల్లో 16 ఎంఈఓ పోస్టులు ఖాళీగా ఉండడంతో పర్యవేక్షణ తగ్గిందని, ఇక మీదట పనితీరు మెరుగుపర్చుతామన్నారు.

ఎమ్మెల్యేగా ఎన్నికైన మత్స్యలింగంను సత్కరిస్తున్న జడ్పీ ఛైర్‌పర్సన్‌ సుభద్ర, జడ్పీటీసీ సభ్యులు

జడ్పీ ఛైర్‌పర్సన్‌ సుభద్ర మాట్లాడుతూ రాష్ట్రంలో కొలువుదీరిన కూటమి ప్రభుత్వానికి, సీఎంగా బాధ్యతలు చేపట్టిన చంద్రబాబునాయుడికి అభినందనలు తెలిపారు. సామాజిక పింఛన్ల మొత్తం పెంపుపై సభ్యులు హర్షం వ్యక్తం చేశారు.

 దేవరాపల్లి జడ్పీటీసీ సభ్యుడు కర్రి సత్యం మాట్లాడుతూ ఉద్యాన తోటల పెంపకంలో భాగంగా రైతులకు నాసిరకం మొక్కలను అందజేస్తున్నారని తెలిపారు. పాయకరావుపేట జడ్పీటీసీ సభ్యురాలు కాకర దేవి మాట్లాడుతూ వాహన కొనుగోలు పథకంలో రాయితీ నిధులు విడుదల చేసేందుకు పరిశ్రమల కేంద్రం అధికారులు ముప్పుతిప్పలు పెడుతున్నారని ఆరోపించారు. జడ్పీటీసీ సభ్యులు లేవనెత్తిన అంశాలపై అధికారులు చర్యలు తీసుకోవాలని ఛైర్‌పర్సన్‌ ఆదేశించారు. జడ్పీ సీఈఓ పోలినాయుడు, పలువురు జడ్పీటీసీ సభ్యులు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా అరకు ఎమ్మెల్యేగా ఎన్నికైన అనంతగిరి జడ్పీటీసీ సభ్యుడు మత్స్యలింగంను ఛైర్‌పర్సన్‌ సుభద్ర, జడ్పీటీసీలు సత్కరించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని