logo

పేదల ఆరోగ్యానికి సర్కారు భరోసా

పేదల ఆరోగ్య భద్రతపై కూటమి ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. గత ప్రభుత్వ హయాంలో జరిగిన తప్పులను గుర్తించి వాటిని ప్రక్షాళన చేసే దిశగా చర్యలు చేపట్టింది.

Updated : 30 Jun 2024 03:49 IST

ఆసుపత్రిలోనే అన్ని పరీక్షలు..
పూర్తిస్థాయిలో మందులు

 చికిత్సకు వచ్చిన గర్భిణులు

పేదల ఆరోగ్య భద్రతపై కూటమి ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. గత ప్రభుత్వ హయాంలో జరిగిన తప్పులను గుర్తించి వాటిని ప్రక్షాళన చేసే దిశగా చర్యలు చేపట్టింది. ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చే రోగికి ఒక్క రూపాయి ఖర్చు కాకుండా ఆసుపత్రిలోనే అన్ని రకాల పరీక్షలు, మందులను ఇవ్వాలని ఉన్నతాధికారులు ఆదేశాలు జారీచేశారు. అనకాపల్లి జిల్లా ఆసుపత్రికి వచ్చే రోగులకు అవసరమైన పరీక్షలు, మందులను ఇక నుంచి ఆసుపత్రిలోనే అందించనున్నారు. ప్రైవేటుగా పరీక్షలు రాస్తే సిబ్బందిపై చర్యలు తీసుకోనున్నారు.

అనకాపల్లి పట్టణం, న్యూస్‌టుడే

వైకాపా ప్రభుత్వ హయాంలో ఆసుపత్రిలో సేవలపై నిర్లక్ష్యం అలముకుంది. మందులు, ల్యాబ్‌లకు అందించే బడ్జెట్లో కోత విధించడంతో చాలా వరకు పరీక్షలు బయట చేయించుకుని మందులు కొనుక్కోవాల్సి  వచ్చేది. దీన్ని ఆసరాగా తీసుకుని కొంతమంది వైద్యులు ప్రైవేటు క్లినిక్‌లతో ఒప్పందాలు కుదుర్చుకుని పరీక్షలు రాసేవారు. ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చినా ప్రైవేటు ఆసుపత్రి మాదిరిగానే మందులు, పరీక్షలకు డబ్బులు అయ్యేవని రోగులు ఆవేదన వ్యక్తంచేసేవారు. దీంతో ప్రభుత్వాసుపత్రిలో పేదలకు సేవలు అంతంతమాత్రంగానే అందుతున్నాయని విమర్శలు వ్యక్తమయ్యేవి.

మందుల విభాగం వద్ద రోగులు

సర్కారీ సేవల్లో లోపం ఎక్కడ ఉందో తెలుసుకోవడానికి రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి సత్యకుమార్‌ యాదవ్‌ ఉన్నతాధికారులలో సమావేశాలు నిర్వహించారు. ఆసుపత్రుల్లో పేదలకు ఉచిత వైద్య సేవలు అందించేలా ప్రత్యేక చొరవ చూపాలని ఆదేశించారు. అనకాపల్లి ల్యాబ్‌లో 103 రకాలు పరీక్షలు చేయానికి అవసరమైన పరికరాలు ఉన్నాయి. సిబ్బంది అందుబాటులో ఉన్నారు. గత ప్రభుత్వం బడ్జెట్‌ను తగ్గించింది. దీంతో పరీక్షలకు కావాల్సిన కిట్లు రాకపోవడంతో కొన్ని రకాల పరీక్షలు ప్రైవేటు ల్యాబ్‌ల్లో చేయించుకోవడం రోగులకు భారంగా మారేది. బడ్జెట్ నిధులను ఏడాదికేడాదికి పెంచాల్సి ఉండగా తగ్గించారు. 2014 నుంచి 2019 వరకు ప్రభుత్వ ఆసుపత్రి అభివృద్ధి నిధులు, జేఎస్‌ఎస్‌కే నుంచి నిధులు ఖర్చుచేసి ప్రభుత్వ ఆసుపత్రి వచ్చే రోగికి అవసరమైన మందులు, స్కానింగ్‌ చేసేవారు. మెడాల్‌ ల్యాబ్‌తో ఒప్పందం కుదుర్చుకుని అన్ని రకాలు పరీక్షలను ఉచితంగా చేసేవారు. ఇది రోగులకు ఎంతో ప్రయోజనం చేకూర్చేది. వైకాపా అధికారంలోకి వచ్చాక వీటిని తొలగించారు. 

టిఫా స్కాన్‌కు ఒప్పందం

గర్భిణులకు తీసే టిఫా స్కాన్‌ను ఒప్పందం కుదుర్చుకుని రూ.800లకు చేసేలా చర్యలు తీసుకోవాలని వైద్యాలయం ఉన్నతాధికారులు ఆదేశాలు జారీచేశారు. ఆసుపత్రికి వచ్చే గర్భిణులు ఈ స్కాన్‌ను బయట తీసుకోవడం భారంగా మారుతోంది. ఈ సమస్యను అధిగమించేలా ప్రైవేటు క్లినిక్‌లతో ఒప్పందం కుదుర్చుకుని దానికి అయ్యే భారం ప్రభుత్వ ఆసుపత్రి నిధుల నుంచి ఖర్చుచేసేలా కూటమి ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది.

టిఫా స్కాన్‌పై నిర్ణయం బాగు .. నాకు ఐదు నెలల క్రితం అనకాపల్లి ఆసుపత్రిలో ప్రసవమైంది. టిఫా స్కాన్‌ బయట చేయించుకున్నాను. ఎక్కువ మొత్తంలో చెల్లించాల్సి వచ్చేది. ఇప్పుడు ఆసుపత్రి నుంచే ఈ స్కాన్‌ను ఉచితంగా చేస్తామని చెప్పడం బాగుంది. అన్ని మందులు, స్కాన్, పరీక్షలు ఆసుపత్రిలోనే చేసేలా చొరవ చూపితే మేలు.

జి.గౌరి, జమ్మాదులపాలెం, కశింకోట మండలం

ప్రైవేటు క్లినిక్‌లకు రాస్తే చర్యలు... అనకాపల్లి ఆసుపత్రిలో అన్ని రకాల రక్త, మూత్ర పరీక్షలు చేస్తున్నాం. అల్ట్రాసౌండ్‌ స్కానింగ్‌ ఉంది. గర్భిణులకు టిఫా స్కాన్‌పై ఎంవోయూ చేసుకోవాలని ఆదేశాలు వచ్చాయి. అన్ని రకాలు మందులు అందుబాటులో ఉన్నాయి. రోగికి ఏ వైద్యుడైనా ప్రైవేటుగా పరీక్షలు, మందులు రాస్తే చర్యలు తీసుకుంటాం. ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చే రోగి ఒక్క రూపాయి ఖర్చుకాకుండా మెరుగైన వైద్యం అందించి ఆరోగ్య భద్రత కల్పించేలా చర్యలు తీసుకుంటున్నాం.

డాక్టర్‌ శ్రీనివాసరావు, ఎన్టీఆర్‌ జిల్లా ఆసుపత్రి సూపరింటెండెంట్, అనకాపల్లి

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని