logo

వనరుల దోపిడీకి వత్తాసు

వైకాపా పాలనలో పోలీసులే కాదు రెవెన్యూ, ఇంజినీరింగ్, అటవీ అధికారుల్లో చాలామంది అప్పటి నేతలతో అంటకాగి తిరిగారు.

Updated : 28 Jun 2024 02:38 IST

వైకాపా నేతల సేవలో తరించిన అధికారులు

ఈనాడు, రంపచోడవరం, అనకాపల్లి : వైకాపా పాలనలో పోలీసులే కాదు రెవెన్యూ, ఇంజినీరింగ్, అటవీ అధికారుల్లో చాలామంది అప్పటి నేతలతో అంటకాగి తిరిగారు. తమ పరిధిలో భూములు, సంపదను చేతనైనంతగా దోచిపెట్టారు. అక్రమ సంపాదనకు మార్గాలను చూపారు. గ్రామ పంచాయతీ కార్యదర్శి నుంచి ఇంజినీరింగ్‌ విభాగంలో ఈఎన్సీ వరకు అంతా వైకాపా నేతలు చెప్పినట్టే తలూపారు. నియమాలు, నిబంధనలను తుంగలోకి తొక్కి నాటి నేతలకు మేలు చేయడానికే ప్రాధాన్యమిచ్చారు. పనిలో పనిగా తామూ కొంత వెనుకేసుకున్నారు. 

అనకాపల్లి, అల్లూరి జిల్లాల్లోని కొంతమంది అధికారులు దోచుకో.. దాచుకో అన్నతీరున వ్యవహరించడం విమర్శలకు తావిస్తోంది. కండువా వేసుకోని వైకాపా కార్యకర్తల్లా అధికారులే పనిచేయడంతో నాటి విపక్షాలు ఎన్ని ఆందోళనలు చేసినా పట్టించుకున్న పాపాన పోలేదు. ఇప్పుడు కూటమి ప్రభుత్వం కొలువు తీరడంతో కొత్త నేతలను ప్రసన్నం చేసుకోవడానికి ప్రదక్షిణలు చేస్తున్నారు..


కోడ్‌ వచ్చినా లెక్కేలేదీ తహసీల్దారుకు..

అనకాపల్లి తహసీల్దారుగా పనిచేసిన గంగాధర్‌కు వైకాపా నేతలు చెప్పిందే వేదం. వారు చెప్పిన వారికే మ్యుటేషన్‌ చేసేవారు.. లేకుంటే నెలల తరబడి తిప్పేవారు. జగనన్న కాలనీలను ఆనుకుని వైకాపా నేతలు ఆక్రమించిన స్థలాలకు ల్యాండ్‌ పొజిషన్‌ సర్టిఫికెట్లు (ఎల్‌పీసీ) జారీచేసి ప్రభుత్వ భూములను పరులపరం చేసేశారు. ఎన్నికల కోడ్‌ వచ్చిన తర్వాత కూడా ఈయన రాత్రికి రాత్రి సుమారు 500 పైగా ఎల్‌పీసీలపై సంతకాలు చేసి ఇచ్చినట్లు తెదేపా నేతలు ఆందోళనలు చేశారు. ఇందుకుగాను వైకాపా నేతల నుంచి భారీగా సొమ్ములు ముట్టినట్లు ఆరోపణలూ ఉన్నాయి. ఉద్యోగ విరమణకు దగ్గరగా ఉన్న ఈయన్ని ఎన్నికల వేళ వేరే విభాగానికి మార్చారు. 

చోడవరం నియోజకవర్గంలో ఏసీబీ వలలో చిక్కుకున్న అప్పటి తహసీల్దారు రవికుమార్‌ ఇష్టారాజ్యంగా వ్యవహరించారు. జగనన్న లేఅవుట్ల చదునులో, భూ రికార్డుల బదలాయింపులో లంచాలు భారీగా దండుకునేవారు. మీరిచ్చే నగదులో కొంత ఎమ్మెల్యేకి కూడా ఇవ్వాలని దర్జాగా చెప్పేవారు. మ్యుటేషన్‌ నిమిత్తం రూ.12 లక్షలు లంచం డిమాండ్‌ చేసి కొంత నగదు కార్యాలయంలోనే తీసుకుంటుండగా దొరికిపోయారు.. 


అనంత బాబుకు అడవినే అప్పగించేశారు..

రంపచోడవరం డీఎఫ్‌వో నరేంద్రియన్‌ ఎమ్మెల్సీ అనంత బాబుతో పాటు వైకాపాకు అనుకూలంగా వ్యవహరించేవారనే ఆరోపణలున్నాయి. ఏజెన్సీ నుంచి విలువైన కలప అక్రమ తరలిపోతున్నా ఎమ్మెల్సీ చెబితే అటుగా కన్నెత్తి చూసేవారు కాదు. అటవీ బీటు అధికారి నుంచి రేంజర్‌ వరకు అంతా ఆయన కనుసన్నల్లోనే పనిచేశారు. ఒకవిధంగా అడవి మొత్తం అనంత బాబుకు అడ్డగోలుగా అప్పగించేశారు. ఇదివరకు ఓసారి రోజ్‌వుడ్‌తో చేసిన ఫర్నిచర్‌ను పట్టుకుని స్టేషన్‌లో పెట్టి మరుసటి రోజునే వదిలేశారు. ‘ఇదేమిటి సార్‌?, నిన్న మేమే కదా సమాచారం ఇచ్చి పట్టుకోమన్నాం కదా?’ అని భాజపా నాయకురాలు ఒకరు అటవీ రేంజర్‌ని ప్రశ్నించారు. ‘బాబుగారు ఫోన్‌చేసి చెప్పారమ్మా.. అందుకే వదిలేశాం!’ అని చెబుతూ స్వామిభక్తిని చాటుకున్నారు.

బూడి మాటే వేదంగా..

మాడుగుల నియోజకవర్గంలో తాజా మాజీ మంత్రి బూడి ముత్యాలనాయుడు చెప్పిందే అక్కడి రెవెన్యూ అధికారులకు వేదం. ఆయన అనుమతి లేకుండా ఎలాంటి భూ లావాదేవీలు జరగడానికి వీల్లేదని ఆదేశించారు. వాటిని అధికారులు శిరసా వహించేవారు. మాడుగుల, చీడికాడ, కె.కోటపాడు, దేవరాపల్లి తహీసీల్దార్లుగా పనిచేసిన పీవీ రత్నం, రాణి, మర్రి లక్ష్మి, రమేష్‌బాబులు తమ పరిధిలోని బంజరు, ప్రభుత్వ, దేవాదాయ భూముల్ని మంత్రితో పాటు వారి అనుచర గణానికి కట్టబెట్టేశారు. ఇసుక మాఫియాకు తలుపులు బార్లా తీశారు. రేయింబవళ్లు ఇసుక తరలిపోతున్నా, ఏ మాత్రం పట్టించుకోకుండా తమ వాటా తమకు అందుతుందో లేదో చూసుకునే వారు. తెదేపాకు చెందిన వారెవరైనా పొలాల్లోకి మట్టి తీసుకెళ్లినా వారిపై అక్రమ కేసులు బనాయించి, వైకాపా మంత్రికి విధేయత చూపించేవారు. 


పని చేయకున్నా బిల్లులు ఇచ్చేశారు..

రంపచోడవరం ఐటీడీఏలో గిరిజన సంక్షేమశాఖలో ఎగ్జిక్యూటివ్‌ ఇంజినీరుగా పనిచేస్తున్న జి.డేవిడ్‌రాజు అనంత బాబుకు నమ్మినబంటులా వ్యవహరించేవారు. ఆయన చెప్పిన వారికి మాత్రమే రోడ్లు, భవనాలు, మంచినీటి ట్యాంకుల నిర్మాణాలను అప్పగించేవారు. గత ఏడాది పనులు మొదలుపెట్టకుండానే వైకాపా నేతలకు రూ.9.40 కోట్లు అడ్వాన్స్‌గా చెల్లించేశారు. దీనిపై ఆడిట్‌ అధికారులు గుర్తించి అభ్యంతరం తెలిపారు. ఐటీడీఏ పీవో సూరజ్‌ గనోరే గత ఏడాది సెప్టెంబరులో ఈఈ డేవిడ్‌రాజును గిరిజన సంక్షేమ శాఖకు సరెండర్‌ చేశారు. అయితే ఎమ్మెల్సీ అనంత బాబు అండదండలతో నెల రోజులు గడవకుండానే మరల ఈఈగా విధుల్లో చేరారు. 

  • చోడవరం పంచాయతీరాజ్‌ సబ్‌ డివిజన్‌ డీఈఈ ప్రసాదరావు పనిచేస్తున్నారు. ఈయన స్వగ్రామం రావికమతం మరుపాక. ప్రసాదు భార్య పంచాయతీ ఎన్నికల్లో సర్పంచిగా పోటీ చేసి ఓటమి చెందారు. అప్పటి నుంచి గ్రామంలో పనులను డీఈఈ అడ్డుకుంటున్నారని స్థానికులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ధర్మశ్రీ కలుగజేసుకుని సమస్య పోలీసుల వరకు వెళ్లకుండా అడ్డుకున్నారు. విప్‌ సిపార్సు చేసిన పనులకు బిల్లులు చేయడమే ఈయన విధి.  
  • అరకులోయ నియోజకవర్గంలో మిషన్‌ కనెక్ట్‌ పాడేరు రోడ్ల పనులన్నీ తాజా మాజీ ఎమ్మెల్యే చెట్టి ఫాల్గుణ చెప్పిన గుత్తేదారుకే అప్పగించారు. అక్కడ ఈఈగా పనిచేసి ప్రస్తుతం ఈఎన్సీగా చేస్తున్న శ్రీనివాసరావు తన బినామీలతో అరకొరగా పనులు చేయించి బిల్లులు పూర్తిగా మార్చుకునేవారు. వాటిలో కొంత మొత్తాన్ని ఎమ్మెల్యేకు కమీషన్‌గా చెల్లించేవారు.  
Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని