logo

రంగంలోకి బడా నేతలు

ఆదిలాబాద్‌ మున్సిపల్‌ వైస్‌ ఛైర్మన్‌ జహీర్‌ రంజానీపై అవిశ్వాస తీర్మాన నేపథ్యంలో ఆయా పార్టీల బడానేతలు రంగంలోకి దిగడంతో ఎన్నిక రసవత్తరంగా మారుతోంది.

Updated : 08 Jul 2024 06:16 IST

పుర అవిశ్వాసం రసవత్తరం
మిగతా భారాస కౌన్సిలర్లు శిబిరానికి తరలింపు
న్యూస్‌టుడే, ఆదిలాబాద్‌ పట్టణం

ఆదిలాబాద్‌ మున్సిపల్‌ వైస్‌ ఛైర్మన్‌ జహీర్‌ రంజానీపై అవిశ్వాస తీర్మాన నేపథ్యంలో ఆయా పార్టీల బడానేతలు రంగంలోకి దిగడంతో ఎన్నిక రసవత్తరంగా మారుతోంది. భారాసకు చెందిన మాజీ మంత్రి జోగు రామన్న, అటు భాజపాకు చెందిన ఎమ్మెల్యే పాయల్‌ శంకర్‌లు ఎప్పటికప్పుడు తమ కౌన్సిలర్లతో చర్చిస్తూ దిశా నిర్దేశం చేస్తున్నారు. భారాస, భాజపా కౌన్సిలర్లతోపాటు ఇద్దరు కాంగ్రెస్‌ పార్టీ కౌన్సిలర్లు అవిశ్వాస తీర్మానంపై సంతకం చేయడంతో అంతా కలిసికట్టుగా ఎత్తుగడలు వేస్తూ వస్తున్నారు. మరోపక్క కాంగ్రెస్‌ పార్టీకి చెందిన మంత్రి సీతక్క, ఇతర నేతలు దీనిపై ప్రత్యేక దృష్టి పెట్టడం రాజకీయం మరింత రాజుకుంటోంది. కాంగ్రెస్‌ దూకుడు పెంచడంతో భారాస నుంచి వలసలు పెరిగాయి. అవిశ్వాస తీర్మానం పెట్టిన రోజునే భారాస నుంచి ఇద్దరు కౌన్సిలర్లు కాంగ్రెస్‌ గూటికి చేరగా ఆ తరువాత మరో నలుగురు కౌన్సిలర్లు కాంగ్రెస్‌ తీర్థం పుచ్చుకున్నారు. మంత్రి సీతక్క సమక్షంలో ఇద్దరు, మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి సమక్షంలో మరో ఇద్దరు కౌన్సిలర్లు హైదరాబాద్‌లో కాంగ్రెస్‌ కండువా వేసుకున్నారంటే ఆ పార్టీ అవిశ్వాసాన్ని ఏమేరకు ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంటుందో అర్థం చేసుకోవచ్చు. రాజధాని నుంచే కాంగ్రెస్‌ ప్రణాళిక రచిస్తోందనే ప్రచారం జరుగుతోంది. అందుకనే స్థానికంగా తమ ప్రాబల్యం తగ్గకుండా ఇటు మాజీ మంత్రి జోగు రామన్న, అటు ఎమ్మెల్యే పాయల్‌ శంకర్‌లు వ్యూహరచన చేస్తుండటంతో రాజకీయాలు ఆసక్తికరంగా మారుతున్నాయి.

రెండు విడతలుగా..

కాంగ్రెస్‌ పార్టీ వల వేస్తుండటంతో  శుక్రవారం 8 మంది భారాస కౌన్సిలర్లను కుటుంబీకులతో కలిసి ప్రత్యేక శిబిరానికి తరలించారు. తాజాగా ఆదివారం మిగతా కౌన్సిలర్లు ప్రత్యేక వాహనాల్లో మధ్యాహ్నం ఒంటిగంట సమయంలో ఆదిలాబాద్‌ నుంచి బయలుదేరి వెళ్లారు. అంతకుముందు మాజీ మంత్రి జోగు రామన్నను శాంతినగర్‌లోని ఆయన నివాసంలో కలుసుకొని అవిశ్వాసంపై చర్చించారు. ఎలాగైనా అవిశ్వాసం నెగ్గుతుందని వారు పూర్తి భరోసాతో ఉన్నారు. ప్రత్యేక సమావేశం నిర్వహించే 18వ తేదీ ఉదయం వరకు వారు శిబిరంలోనే ఉండనున్నట్లు తెలిసింది. మరోపక్క భాజపా కౌన్సిలర్లతోనూ ఎమ్మెల్యే పాయల్‌ శంకర్‌ శనివారం సుదీర్ఘంగా చర్చించి సూచనలు చేశారు. అవిశ్వాసం నెగ్గేందుకు 33 మంది సభ్యుల బలం అవసరం. 32 మంది సభ్యుల సంఖ్యా బలం ఉండటంతో కాంగ్రెస్‌ కౌన్సిలర్లపై గురిపెట్టారు. దీంట్లో భాగంగానే గతంలో తమ పార్టీ నుంచి కాంగ్రెస్‌ పార్టీలో చేరిన ముగ్గురు కౌన్సిలర్లను ప్రత్యేక శిబిరానికి తరలించినట్లు భారాస వర్గాలు చెబుతుండటం ఉత్కంఠ భరితంగా మారింది. కాంగ్రెస్‌ వర్గాలు మాత్రం దీన్ని కొట్టిపారేస్తున్నాయి. సంఖ్యాబలం లేక అవిశ్వాసం వీగిపోతుండడంతోనే భారాస ఇలా దుష్ప్రచారం చేస్తోందని కాంగ్రెస్‌ నాయకులు ప్రచారం మొదలెట్టారు. కాంగ్రెస్‌ పార్టీ సైతం క్యాంపు ఏర్పాట్లకు కసరత్తు చేస్తోంది. ఒకటి రెండు రోజుల్లో వారు శిబిరానికి వెళ్లనున్నట్లు సమాచారం.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని