logo

ఇక ఉద్యోగుల బదిలీల సందడి

జిల్లా స్థాయి ఉద్యోగుల బదిలీ ప్రక్రియంతా కలెక్టరేట్ వేదికగా జరగనున్నాయి. పాలనాధికారి ఛైర్మన్‌గా, ఆయా శాఖల అధిపతులు కన్వీనర్లుగా వ్యవహరిస్తారు.

Published : 05 Jul 2024 04:26 IST

జిల్లా స్థాయి ఉద్యోగుల బదిలీ ప్రక్రియంతా కలెక్టరేట్ వేదికగా జరగనున్నాయి. పాలనాధికారి ఛైర్మన్‌గా, ఆయా శాఖల అధిపతులు కన్వీనర్లుగా వ్యవహరిస్తారు. శాఖాధిపతులు రూపొందించిన జాబితా ఆధారంగా ఉద్యోగులకు స్థానచలనం కల్పించనున్నారు.

న్యూస్‌టుడే, ఆదిలాబాద్‌ పాలనాప్రాంగణం, ఆసిఫాబాద్‌

దాదాపు నెల రోజుల పాటు జిల్లాలో అత్యధిక సంఖ్యలో ఉన్న ఉపాధ్యాయ బదిలీల అనంతరం ఇతర శాఖల ఉద్యోగుల బదిలీల సందడి ప్రారంభం కానుంది. అయిదేళ్ల తర్వాత సాధారణ బదిలీలపై ఉన్న నిషేధం ఎత్తివేస్తూ బుధవారం ఉత్తర్వులు జారీ చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో జిల్లాలో ఎవరెవరు బదిలీ అవుతారు? ఎక్కడికి వెళ్తారనే చర్చ సామాన్యుల్లో.. అధికార వర్గాల్లో జోరందుకుంది.

ఉమ్మడి జిల్లాలో అన్ని శాఖలు కలిపి 63 ఉండగా.. అందులో జిల్లాస్థాయి, జోనల్, మల్టీజోనల్, రాష్ట్రస్థాయి కేటగిరిల్లో దాదాపు 20 వేల మంది ఉద్యోగులు విధులు నిర్వహిస్తున్నారు. జిల్లాస్థాయి ఉద్యోగుల బదిలీ పాలనాధికారి సారథ్యంలో జరగనుండగా.. జోనల్‌ స్థాయి బదిలీలను నిజామాబాద్, మంచిర్యాల పాలనాధికారి, మల్టీజోనల్, రాష్ట్రస్థాయి బదిలీలను హైదరాబాద్‌ వేదికగా ఆయా విభాగాధిపతుల పర్యవేక్షణలో జరుగుతాయి. జిల్లాలో ఉపాధ్యాయులు, పోలీసులు మినహా ఇతర శాఖల్లో 2024 జూన్‌ 30వ తేదీ నాటికి ఒకేచోట నాలుగేళ్లు పని చేసిన వారంతా తప్పనిసరి బదిలీ కింద స్థానచలనం కలగనుండగా.. రెండేళ్ల సర్వీసు పూర్తి చేసుకున్న వారు సాధారణ బదిలీకి దరఖాస్తు చేసుకునేలా మార్గదర్శకాలు విడుదల చేశారు. ప్రభుత్వ ఆదేశాలతో ఆయా శాఖల జిల్లా అధిపతులు ఉద్యోగుల వివరాల సేకరణలో నిమగ్నమయ్యారు. కేడర్ల వారీగా ఎన్ని ఖాళీలు ఉన్నాయి, ఎంత మంది ఉన్నారు, ఎప్పటి నుంచి విధులు నిర్వహిస్తున్నారన్న.. వివరాలతో ఈ నెల 8వ తేదీలోపు జాబితాలను సిద్ధం చేయాలి. నాలుగేళ్లకు మించి ఒకేచోట పనిచేస్తున్న వారి జాబితాలను 5-8 వరకు విడుదల చేయాల్సి ఉంటుంది. ఉపాధ్యాయులు, పోలీసులు మినహాయించి తప్పనిసరి బదిలీ కింద 40 శాతం మందిని లెక్కిస్తే 5 వేల లోపు మంది ఉద్యోగులు బదిలీ అయ్యే అవకాశముందని అధికారవర్గాలు అంచనా వేస్తున్నాయి. ఈ నెల 19, 20 తేదీల్లో ఇచ్చే బదిలీ ఉత్తర్వులతో ఎంతమంది ఉద్యోగులకు స్థానచలనం కలిగిందనే సంఖ్యపై స్పష్టత రానుంది.

అవకాశం దక్కేనా.?

రాష్ట్రం ఆవిర్భవించాక 2016 అక్టోబర్‌ 11న కొత్త జిల్లాలు ఏర్పడ్డాయి. ఆ సమయంలో ఉమ్మడి జిల్లా నుంచి కొంత మంది ఉద్యోగులను జిల్లాకు సర్దుబాటు చేశారు. 2018లో బదిలీలకు అవకాశం కల్పించినా.. వచ్చిన వారిలో కొందరు బదిలీ కాలేదు. 317 జీవోలోనూ కొందరు ఇతర జిల్లాల నుంచి ఇక్కడికి వచ్చారు. సొంత జిల్లాలకు పంపించాలని అప్పట్లో ఆందోళనలు చేశారు. వీరు రెండేళ్ల సర్వీసు పూర్తి కావడంతో దరఖాస్తుకు అవకాశం కలిగింది. కానీ తమకన్నా సీనియర్లతో తాము బదిలీ కాలేమోనని బెంగపెట్టుకున్నారు. ఇప్పుడు కాకుంటే శాశ్వతంగా ఇదే జిల్లాలో ఉండాలా అని మదనపడుతున్నారు.

కొందరి పరిస్థితి విచిత్రం..

కొన్ని శాఖల్లో ఒకటీ, రెండు పోస్టులు ఉన్నాయి. ఇతర జిల్లాల నుంచి బదిలీపై వచ్చారు. వారు జిల్లా కేడర్‌ ఉద్యోగులు కావడం, జోన్లు మారి తిరిగి తమ సొంత జిల్లాలకు పోలేని పరిస్థితి. ఉదాహరణకు.. జిల్లా మార్కెటింగ్‌ కార్యాలయంలో జూనియర్‌ అసిస్టెంట్‌ పోస్టు మంజూరు చేశారు. జిల్లా ఏర్పడ్డాక ఆదిలాబాద్‌ జిల్లా నుంచి సదరు ఉద్యోగి ఆసిఫాబాద్‌కి వచ్చారు. అక్కడ జూనియర్‌ అసిస్టెంట్‌ పోస్టు రద్దు చేశారు. నిర్మల్, మంచిర్యాల జిల్లాల్లో ఈ పోస్టు లేదు. ఎనిమిదేళ్లుగా ఆ ఉద్యోగి జిల్లా కార్యాలయంలో పనిచేస్తున్నారు. బదిలీకి దరఖాస్తు చేసుకునే అవకాశం ఉన్నా.. మిగతా జిల్లాలో ఈ పోస్టు లేదు. పైగా ఆదిలాబాద్‌ జిల్లా బాసర జోన్‌లోకి, ఆసిఫాబాద్‌ జిల్లా కాళేశ్వరం జోన్‌లోకి వస్తుంది. సొంత జిల్లాకు వెళ్లాలనుకునే ఈ ఉద్యోగి పరిస్థితి ఏంటన్నది ప్రశ్నార్థకంగా మారింది. ఆ ఉద్యోగి పదోన్నతి పొందే వరకు బదిలీకి అవకాశం లేకుండా ఉంది.

నాలుగు స్థాయిల్లో..  

బదిలీల ప్రక్రియ నాలుగు స్థాయిల్లో ఉద్యోగ, అధికారులకు స్థానచలనం కల్పించనున్నారు. ఇందులో

జిల్లాస్థాయిలో : అటెండర్‌ మొదలుకొని రికార్డు అసిస్టెంటు, టైపిస్టు, జూనియర్‌ అసిస్టెంట్లు  జిల్లాలోని మండలాల పరిధిలో బదిలీ కానున్నారు.
జోన్‌ పరిధిలో : సీనియర్‌ అసిస్టెంటు మొదలుకొని సూపరింటెండెంట్, డిప్యూటీ తహసీల్దారు, గ్రేడ్‌ -1, 2, 3 పంచాయతీ కార్యదర్శులు, హెచ్‌డబ్ల్యూఓ, ఏఎన్‌ఎం, స్టాఫ్‌ నర్సు, ల్యాబ్‌ టెక్నిషియన్, వెటర్నరీ అసిస్టెంట్‌ వంటి హోదా కలిగిన ఉద్యోగులకు బాసర జోన్‌ పరిధిలోని ఆదిలాబాద్, నిర్మల్, జగిత్యాల, నిజామాబాద్‌ జిల్లాల పరిధిలో బదిలీ జరగనుంది. కాళేశ్వరం జోన్‌లో మంచిర్యాల, ఆసిఫాబాద్, పెద్దపల్లి, జయశంకర్‌ భూపాలపల్లి, ములుగు జిల్లాలుండగా.. మంచిర్యాల పాలనాధికారి సమక్షంలో బదిలీలు జరగనున్నాయి.
మల్టీజోన్‌-1 పరిధిలో : ఉమ్మడి ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్, వరంగల్, ఖమ్మంలతోపాటు మెదక్, సిద్దిపేట జిల్లాలు మల్టీజోన్‌-1 పరిధిలోకి రానుండగా.. ఎంపీడీవో, తహసీల్దార్, ఎంపీవో, వ్యవసాయాధికారి, ఏఈఈలు, ఏఎస్‌డబ్ల్యూఓ, ఏబీసీడబ్ల్యూఓ, ఏటీవో, మున్సిపల్‌ కమిషనర్, అసిస్టెంటు సివిల్‌ సర్జన్‌ వంటి క్యాడర్‌లో పని చేసే వారికి మల్టీజోన్‌ పరిధిలో బదిలీ కానుంది. ఎంపీడీవోలు, తహసీల్దార్లకు ఎన్నికల్లో బదిలీ జరిగింది. రెండేళ్ల సర్వీసు పూర్తి కాకపోవడంతో వారికి స్థానచలనం కల్పించనున్నారు. ఇందుకు త్వరలో ఉత్తర్వులు జారీచేసే అవకాశముందని తెలుస్తోంది.
రాష్ట్రస్థాయిలో : జిల్లా అధికారులతోపాటు సివిల్‌ సర్జన్లు, డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్‌లకు రాష్ట్రస్థాయిలో బదిలీలు జరగనున్నాయి. వీరంతా 33 జిల్లాల పరిధిలో మల్టీజోన్‌-1, జోన్‌-2 స్థాయిలో బదిలీ అవుతారు.

పారదర్శకంగా నిర్వహించాలి: సంద అశోక్, టీఎన్జీవో, జిల్లా అధ్యక్షుడు

బదిలీల ప్రక్రియ పూర్తి పారదర్శకంగా జరిగేలా అధికారులు చర్యలు తీసుకోవాలి. సీనియారిటీ జాబితా, ఖాళీల విషయంలో అవకతవకలు జరగకుండా పాలనాధికారి ప్రత్యేక దృష్టి సారించాలి. అన్యాయం జరిగినట్లు భావిస్తే అలాంటి వారు మా దృష్టికి తీసుకొస్తే.. అధికారులను కలిసి వారికి న్యాయం జరిగేలా సంఘం తరఫున కృషి చేస్తాం.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని