logo

అడుగుకో గుంత.. ప్రాణాలకు లేదు భరోసా!

రహదారులు బాగుంటేనే రవాణా సాఫీగా సాగుతుంది. ప్రమాదాలు జరగవు. జాతీయ రహదారి 44 పరిస్థితి ఇందుకు భిన్నంగా ఉంది. జాతీయ రహదారిపైకి వెళితే సురక్షితంగా తిరిగొస్తారనే నమ్మకం లేదు.

Published : 05 Jul 2024 04:24 IST

జాతీయ రహదారి దుస్థితి
పట్టించుకోని అధికారులు
న్యూస్‌టుడే, ఇచ్చోడ, గుడిహత్నూర్‌

రోడ్లు సరిగ్గా నిర్వహించలేనప్పుడు టోల్‌ వసూలు చేయొద్దు. గుంతలతో కూడిన రహదారులు, టోల్‌ ప్లాజా వద్ద వాహనాల రద్దీ.. ఏ మాత్రం ఆమోదయోగ్యం కాదు.

- ఇటీవల కేంద్ర రహదారి, రవాణా, జాతీయ రహదారుల శాఖ మంత్రి గడ్కరీ నేషనల్‌ హైవే అధికారులు టోల్‌ ఏజెన్సీలతో అన్న మాటలివి..


నిత్యం ప్రమాదాలు..

ఇది  సీతాగోంది సమీపంలోని పెట్రోల్‌ బంకు వద్ద పరిస్థితి. అడుగుకో గుంత ఏర్పడటంతో వాహనదారులు ఎటువైపు వెళ్లాలో అంతుచిక్కని పరిస్థితి నెలకొంది. గుంతలను తప్పించే క్రమంలో వెనుక వైపు నుంచి వేగంగా వచ్చే వాహనాలు ఢీకొని ప్రాణాలు కోల్పోతున్నారు.  

రహదారులు బాగుంటేనే రవాణా సాఫీగా సాగుతుంది. ప్రమాదాలు జరగవు. జాతీయ రహదారి 44 పరిస్థితి ఇందుకు భిన్నంగా ఉంది. జాతీయ రహదారిపైకి వెళితే సురక్షితంగా తిరిగొస్తారనే నమ్మకం లేదు. నిత్యం దేశం నలుమూలల నుంచి వాహనాల రాకపోకలతో రద్దీగా ఉండే ఈ రహదారిపై  గుంతలు ఏర్పడి ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి నెలకొంది. సంబంధిత అధికారులు మాత్రం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించడం పరిపాటిగా మారింది. టోల్‌ వసూలుపై ఉన్న శ్రద్ధ సౌకర్యాల కల్పనపై లేకపోవడం గమనార్హం.

జిల్లాలో దేవాపూర్‌ చెక్‌పోస్టు నుంచి ఇచ్చోడ వరకు దాదాపు 24 కిలోమీటర్ల వరకు రోడ్డు గుంతలమయంగా మారింది. ఆదిలాబాద్‌ నుంచి నిర్మల్‌ వెళ్లే రహదారి పూర్తిగా అధ్వానంగా తయారైంది. గతంలో మరమ్మతులు చేసినప్పటికీ చిన్నపాటి వర్షం కురిసినా బీటీ తొలగిపోయి గుంతలు విస్తరిస్తున్నాయి. అతి వేగంగా భారీ వాహనాలు వెళ్లే ఈ రహదారిపై కార్లు, ఇతర వాహనాలతోపాటు ద్విచక్రవాహన దారులు నరకం అనుభవిస్తున్నారు. గుంతలను తప్పించే క్రమంలో వెనుక నుంచి వాహనాలు ఢీకొని ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. కొంచెం అదుపుతప్పినా, ఏమరపాటుగా ఉన్నా ప్రాణాలు పోయే దుస్థితి దాపురించింది.

ఎలా వెళ్లాలి

ఇది గుడిహత్నూర్‌ సమీపంలో గుంతలమయంగా మారిన రహదారి. భారీ గుంతలు  ఏర్పడటంతో వాహన చోదకుల పరిస్థితి ప్రశ్నార్థకంగా మారింది. రాత్రి వేళల్లో ప్రయాణం మరింత దారుణంగా తయారైంది. ఎటువైపు వెళ్లాలో అర్థం కాని దుస్థితి దాపురించింది...

అధికారుల నిర్లక్ష్య వైఖరి..

జిల్లాలో అత్యంత ప్రమాదకరమైన, ఎక్కువగా ప్రమాదాలు చోటు చేసుకునే సీతాగోంది ప్రాంతం మరింత అధ్వానంగా తయారైంది. అయినా అధికారులకు చీమ కుట్టినట్లు కూడా లేదు. వారి నిర్లక్ష్య వైఖరికి నిదర్శనంగా మారింది. ప్రధానంగా గుడిహత్నూర్‌నుంచి సీతాగోంది వరకు వెళ్లే వాహన చోదకులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. ఇప్పటికే టోల్‌ ఛార్జీలు పెంచి వాహన చోదకుల నడ్డి విరిస్తున్న జాతీయ రహదారుల సంస్థ అధికారులు ఇటువైపు దృష్టి సారించడం లేదు. మరోవైపు కనీస వసతులు కల్పించడంలో నిర్లక్ష్యం వహించగా, రోడ్డు మరమ్మతుల్లోనూ అదే దుస్థితి దాపురించింది.  

తీవ్ర గాయాలతో..

ఇచ్చోడ సమీపంలోని టింబర్‌ డిపో వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో జున్ని పంచాయతీ గాంధీనగర్‌కు చెందిన గుట్టె శేషారావు తీవ్ర గాయాలతో బయటపడ్డాడు. గ్రామం నుంచి ఇచ్చోడకు ద్విచక్రవాహనంపై వెళుతున్నాడు. ఈ క్రమంలో జాతీయ రహదారిపై గుంతలు ఉండటంతో ముందు వెళుతున్న లారీ చోదకుడు ఒక్కసారిగా వేగాన్ని తగ్గించాడు. వెనుక వస్తున్న శేషారావు సైతం వాహన వేగం తగ్గించాడు. వెనుక వస్తున్న బస్సు అతడిని ఢీకొట్టింది. బస్సు కిందకు వెళ్లిన అతడికి తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు రిమ్స్‌ ఆసుపత్రికి తరలించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని