logo

ప్రొటోకాల్‌ రగడ.. నేతల గడబిడ

‘ మంత్రి పాల్గొనే కార్యక్రమాల్లో ప్రొటోకాల్‌ పాటించడం లేదని, ప్రభుత్వ కార్యక్రమాల్లో కాంగ్రెస్‌ పార్టీ జెండాలను పెడుతున్నారని,  పదవులు లేకున్నా.. ఆ పార్టీ నాయకులు విశ్వప్రసాద్‌ (డీసీసీ అధ్యక్షుడు), అజ్మీరా శ్యాంనాయక్‌ (నియోజకవర్గ ఇన్‌ఛార్జి) మంత్రి పర్యటన షెడ్యూల్‌ను పాలనాధికారి సమక్షంలో తయారు చేస్తున్నారని’.. ఎమ్మెల్యే కోవ లక్ష్మి తీవ్ర పదజాలంతో మండిపడ్డారు.

Published : 05 Jul 2024 04:20 IST

‘ మంత్రి పాల్గొనే కార్యక్రమాల్లో ప్రొటోకాల్‌ పాటించడం లేదని, ప్రభుత్వ కార్యక్రమాల్లో కాంగ్రెస్‌ పార్టీ జెండాలను పెడుతున్నారని,  పదవులు లేకున్నా.. ఆ పార్టీ నాయకులు విశ్వప్రసాద్‌ (డీసీసీ అధ్యక్షుడు), అజ్మీరా శ్యాంనాయక్‌ (నియోజకవర్గ ఇన్‌ఛార్జి) మంత్రి పర్యటన షెడ్యూల్‌ను పాలనాధికారి సమక్షంలో తయారు చేస్తున్నారని’.. ఎమ్మెల్యే కోవ లక్ష్మి తీవ్ర పదజాలంతో మండిపడ్డారు. ఆదివాసీ ఎమ్మెల్యేను చులకనగా చూస్తే సహించేది లేదని హెచ్చరించారు. తన కార్యకర్తను విశ్వప్రసాద్‌ తీవ్రంగా దూషించడంతోనే ఈ మాదిరిగా విమర్శించానని ఆమె పేర్కొన్నారు.

ఈనాడు, ఆసిఫాబాద్‌

రాష్ట్ర మంత్రి సీతక్క పర్యటనలో భాగంగా.. ప్రారంభించే ఆరోగ్య ఉపకేంద్రం భవనం సమీపంలో కాంగ్రెస్‌ పార్టీ జెండాలు, ప్లెక్సీలు ఉండడంతో రాజుకున్న వివాదం క్రమంగా పెనుదుమారంగా మారుతోంది. భారాస, కాంగ్రెస్‌ నేతల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. సామాజిక మాధ్యమాల్లో ఆయా పార్టీలకు అనుకూలంగా, వ్యతిరేకంగా పోస్టులు వెల్లువెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో ఒకే పార్టీలో ఉన్న కొందరు నాయకులు ఇతర పార్టీ నేతలకు మద్దతు పలుకుతున్న తీరుపై సీనియర్లు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. ఇదే తరుణంలో పార్టీల్లో ఉన్న గ్రూపు రాజకీయాలు సైతం బయటపడుతున్నాయి.

పరస్పరం ఫిర్యాదులు..

ఎమ్మెల్యే కోవ లక్ష్మి వ్యాఖ్యలకు దీటుగా కాంగ్రెస్‌ నేతలు స్పందించారు. కాంగ్రెస్‌ పార్టీ పార్లమెంటరీ నాయకురాలు ఆత్రం సుగుణ.. ఆదివాసీ మహిళలతో కలిసి ఆసిఫాబాద్‌లో మాట్లాడారు. తమ నాయకుడిపై ఎమ్మెల్యే చేసిన అనుచిత వ్యాఖ్యలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్‌ చేశారు. స్థానిక పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా, కేసు నమోదైంది. ఇందుకు ప్రతిగా ఆదివాసీ మహిళ అని చూడకుండా అవమానించారని, మంత్రి పర్యటనలో ప్రొటోకాల్‌ పాటించలేదని, బూతులు తిట్టారని ఎమ్మెల్యే కాంగ్రెస్‌ నాయకులపై రెబ్బెన పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. గురువారం డీసీసీ అధ్యక్షుడు విశ్వప్రసాద్‌.. ఎమ్మెల్యే మాటలపై స్పందించారు. తనకు ఊహ తెలిసిన క్షణం నుంచి ఎవరినీ, ఎనాడూ దూషించలేదని, అలా నిరూపిస్తే, ముక్కు నేలకు రాసి, రాజకీయాల శాశ్వతంగా తప్పుకొంటానని సవాల్‌ విసిరారు.  

కార్యకర్తల ఆందోళన...

రెండు ప్రధాన పార్టీల నాయకులు తీవ్రంగా తిట్టుకోవడంతో.. ఇది  ఎటువైపు దారితీస్తుందోనని ఆయా పార్టీల నేతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం, ప్రతిపక్షం ఎవరున్నా కలిసికట్టుగా జిల్లా, నియోజకవర్గ అభివృద్ధికి నాయకులు పాటుపడాలనే అభిప్రాయాలు సైతం వ్యక్తమవుతున్నాయి.

రెండుగా విడిపోయారు..

కాంగ్రెస్‌ పార్టీ నేతపై ఎమ్మెల్యే వ్యాఖ్యల నేపథ్యంలో అజ్మీరా శ్యాంనాయక్, విశ్వప్రసాద్‌ మద్దతుదారులు రెండుగా విడిపోయారు. ఎమ్మెల్యే వ్యాఖ్యలను ఆ పార్టీ నియోజకవర్గ ఇన్‌ఛార్జి శ్యాంనాయక్‌ ఎందుకు ఖండించడం లేదని సామాజిక మాధ్యమాల్లో పోస్టులు వచ్చాయి. స్పందించాల్సిన సమయంలో శ్యాంనాయక్‌ హైదరాబాద్‌ పర్యటనపై విమర్శలు వ్యక్తం చేశారు. అందుకు ప్రతిగా శ్యాం వర్గీయులు సైతం విశ్వప్రసాద్‌కు వ్యతిరేకంగా పోస్టులు పెట్టారు. నియోజకవర్గ సమస్యల పరిష్కారం కోసమే హైదరాబాద్‌ శ్యాంనాయక్‌ వెళ్లారని, అగ్రవర్ణ సామాజిక పెత్తనం ఎన్నాళ్లని ప్రశ్నించారు.  

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని