logo

గుట్కాపై ఉక్కుపాదం!

నిషేధిత గుట్కా, తంబాకు రవాణా, విక్రయాలపై జిల్లా పోలీసు యంత్రాంగం ఉక్కుపాదం మోపింది. 

Updated : 05 Jul 2024 06:25 IST

నియంత్రణకు పోలీసుల విస్తృత తనిఖీలు..

జిల్లా కేంద్రంలో పట్టుకున్న గుట్కా పొట్లాలను చూపుతున్న ఎస్పీ డి.వి. శ్రీనివాస్‌రావు

లింగాపూర్, కాగజ్‌నగర్‌ గ్రామీణం, న్యూస్‌టుడే: నిషేధిత గుట్కా, తంబాకు రవాణా, విక్రయాలపై జిల్లా పోలీసు యంత్రాంగం ఉక్కుపాదం మోపింది.  వీటిని సమూలంగా నిర్మూలించాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేయడంతో.. పోలీస్‌శాఖ అప్రమత్తమైంది. జిల్లా ఎస్పీ డి.వి.శ్రీనివాస్‌రావు ప్రత్యేక కార్యాచరణ రూపొందించి.. గుట్కా రవాణా కట్టడిపై నిత్యం తనిఖీలు చేస్తూ, సంబంధీకులపై కేసులు నమోదు చేస్తున్నారు.

రాష్ట్రంలో గుట్కా, పాన్‌ మసాలాలపై నిషేధం ఉన్నప్పటికీ.. వాటి విక్రయాలపై మూడింతలు ఆదాయం ఉండటంతో వ్యాపారులు ఈ దందాను వీడటం లేదు. కుమురంభీం జిల్లాకు ఆనుకుని మహారాష్ట్ర సరిహద్దు ప్రాంతాలు ఉన్నాయి. ఆ ప్రాంతంలో గుట్కాపై నిషేధం లేకపోవడంతో.. అక్కడి నుంచి జిల్లాలోని వివిధ ప్రాంతాలకు అక్రమంగా సరఫరా చేస్తున్నారు. తక్కువ ధరతో కొనుగోలు చేసి అడ్డగోలు ధరలతో విక్రయిస్తున్నారు. దీంతో అక్రమార్జన యథేచ్ఛగా కొనసాగుతోంది. ప్రస్తుతం గుట్కా నియంత్రణపై పోలీసులు సమరం సాగిస్తుండటంతో.. నిత్యం ఏదో ఒకచోట గుట్కా లభ్యమవుతోంది. గుట్కా నిల్వ స్థావరాలపై దాడులు చేసి, పొట్లాలు స్వాధీనం చేసుకుని, నిర్వాహకులు, రవాణాదారులపై కేసులు నమోదు చేస్తున్నారు. కట్టుదిట్టమైన చర్యలు చేపడుతూ దందాపై ఉక్కుపాదం మోపుతున్నారు.

గుట్కా నిల్వలపై సోదాలు నిర్వహిస్తున్న పోలీసులు

వారం రోజుల్లో నమోదైన కేసులు..

  • ఈ నెల 2న సిర్పూర్‌(టి) మండలంలోని గోవింద్‌పూర్‌వాడలో టాస్క్‌ఫోర్స్, పోలీసులు సంయుక్తంగా తనిఖీలు నిర్వహించి రూ.10 వేల విలువైన గుట్కా పట్టుకున్నారు. నిందితులు మహారాష్ట్రలోని కోటశ్రీ గ్రామం నుంచి రవాణా చేస్తున్నట్లు గుర్తించారు.
  • ఈ నెల 1న కాగజ్‌నగర్‌లోని కాపువాడకు చెందిన షేక్‌ ఇంతియాజ్‌కు సంబంధించిన గోదాంలో అక్రమంగా నిల్వ ఉంచిన రూ.6,88,400 విలువైన గుట్కాను పోలీసులు దాడులు చేసి స్వాధీనం చేసుకున్నారు. నిందితుడిపై కేసు నమోదు చేశారు.
  • గత నెల 27న కాగజ్‌నగర్‌లోని ఇందిరా మార్కెట్లో ఉన్న ఓ గోదాంలో నిల్వ ఉంచిన రూ.37 వేల విలువైన నిషేధిత తంబాకు పోలీసులు పట్టుకున్నారు. తంబాకును స్వాధీనం చేసుకుని నిందితుడిపై కేసు నమోదు చేశారు.
  •  ఇదే రోజు పెంచికల్‌పేట్ మండలంలోని బొంబాయిగూడ, మొట్లగూడ గ్రామాల్లో ఉన్న పలు కిరాణ దుకాణాల్లో పోలీసులు సోదాలు నిర్వహించారు. గుట్కా పొట్లాలను పట్టుకుని దుకాణ యజమానులపై కేసు నమోదు చేశారు.
  • గత నెల 25న జిల్లా కేంద్రంలోని అటవీశాఖ చెక్‌పోస్టు వెనుక ఉన్న ఓ గోదాంలో నిషేధిత గుట్కా సంచులను టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు పట్టుకున్నారు. సుమారు రూ.8 లక్షల విలువైన గుట్కాను నిల్వ ఉంచినట్లు గుర్తించారు.
  • గత నెల 26న చింతలమానెపల్లి మండలంలోని రవీంద్రనగర్‌లో గుట్కా నిల్వలు ఉన్నాయనే సమాచారం మేరకు ఇళ్లలో సోదాలు చేపట్టారు. రూ.4,210 విలువైన గుట్కాను స్వాధీనం చేసుకున్నారు.
  • ఇదే రోజు వాంకిడి మండల కేంద్రంలోని ఓ కిరాణా గోదాంలో తనిఖీ చేయగా.. రూ.12,573 విలువైన గుట్కాను పట్టుకున్నారు.

రవాణా అరికట్టేలా చర్యలు: డి.వి.శ్రీనివాస్‌రావు, ఎస్పీ

గుట్కా రవాణా, అక్రమ విక్రయాలపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నాం. ప్రభుత్వం నిషేధించిన గుట్కా పొట్లాలను ఎవరైనా విక్రయిస్తే కేసులు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకుంటాం.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని