logo

సరిహద్దు వివాదం.. ప్రగతికి ఆటంకం

రెవెన్యూ, అటవీ శాఖల మధ్య సరిహద్దు భూముల వివాదాలతో జిల్లా ప్రగతికి ఆటంకంగా మారింది. బెల్లంపల్లి, చెన్నూరు నియోజకవర్గాల నుంచి వివిధ గ్రామాలకు వెళ్లడానికి గతంలో అటవీ ప్రాంతం నుంచి రహదారులు నిర్మించారు.

Published : 05 Jul 2024 04:12 IST

మంచిర్యాల పట్టణం, న్యూస్‌టుడే: రెవెన్యూ, అటవీ శాఖల మధ్య సరిహద్దు భూముల వివాదాలతో జిల్లా ప్రగతికి ఆటంకంగా మారింది. బెల్లంపల్లి, చెన్నూరు నియోజకవర్గాల నుంచి వివిధ గ్రామాలకు వెళ్లడానికి గతంలో అటవీ ప్రాంతం నుంచి రహదారులు నిర్మించారు. ఆ రహదారులు శిథిలావస్థకు చేరడంతో వాటిని మరమ్మతులు చేయడానికి వివిధ ప్రభుత్వ శాఖల నుంచి రూ.లక్షల నిధులు మంజూరు చేశారు. అటవీ శాఖ అధికారులు నిబంధనల పేరుతో ఆ శాఖ పరిధిలో ఉన్న రహదారులకు మరమ్మతులు చేయనివ్వడం లేదు.

అధ్వానంగా దారులు  

అటవీ ప్రాంతం నుంచి వివిధ గ్రామాలకు 10 ఏళ్ల కిందట రహదారులు నిర్మించారు. ఇప్పుడు గుంతలు పడి, కంకర తేలి రాకపోకలకు ఇబ్బందిగా మారాయి. ఆ రహదారుల మరమ్మతులకు ఆర్‌అండ్‌బీ అధికారులు, పంచాయతీరాజ్‌ అధికారులు నిధులు మంజూరు చేశారు. అటవీ శాఖ అధికారులు తమ శాఖ పరిధిలో ఉన్న భూముల్లో ఎలాంటి నిర్మాణాలు చేయవద్దని అడ్డుకుంటున్నారు. దీంతో చెన్నూరు నుంచి బుద్దారం రోడ్డు, చెన్నూరు నుంచి పంగిడిసోమారం, మల్లంపేట నుంచి నక్కలపల్లి, రేచర్ల బీటీ రోడ్డు, ఏదులబంధం, చెన్నూరు నుంచి కోటపల్లి, వేమనపల్లి నుంచి నాగారం, మల్లంపల్లిపేట నుంచి నీల్వాయి రహదారులపై ఏర్పడిన గుంతలకు అటవీ శాఖ అధికారులు మరమ్మతులు చేయనివ్వడం లేదు.

తీరని పోడు భూముల సమస్య..:  

నెన్నెల మండలంలోని సర్వే నెం.671, 672లో దాదాపు రెండు వేల ఎకరాల భూమి గత కొన్ని ఏళ్లుగా రెవెన్యూ, అటవీ శాఖ వివాదంలో ఉంది. అందులో 1500 ఎకరాలు కబ్జాకు గురైనట్లు ఆరోపణలున్నాయి. 1985-2004 మధ్య కాలంలో కొంతమంది రైతులకు రెవెన్యూ అధికారులు పోడు పట్టాలు అందజేశారు. మరికొంతమంది ఆక్రమించుకుని సాగు చేసుకుంటున్నారని తెలిసింది. పోడు రైతులు భూములను సాగు చేసుకుంటే అటవీ శాఖ అధికారులు అడ్డుకుంటున్నారని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. మరోపక్క కబ్జాకు గురైన ప్రభుత్వ భూమిని అధికారులు స్వాధీనం చేసుకుని అర్హులైన నిరుపేదలకు పంపిణీ చేయాలని గొల్లపల్లి గ్రామానికి చెందిన ఇందూరి రాంమోహన్‌ కోర్టులో కేసు వేసినట్లు తెలిసింది.

బెల్లంపల్లి, మందమర్రి మండలాల్లో వివిధ గ్రామాల పరిధిలో రెవెన్యూ, అటవీ శాఖ మధ్య భూముల వివాదం కొనసాగుతోంది. బెల్లంపల్లి అటవీ రేంజి పరిధిలో  కాంపార్ట్‌మెంట్‌ నెం.350, 351, 304, 348 నంబర్లతో దాదాపు 5,570 హెక్టార్ల భూములు ఉన్నట్లు అధికారులు తెలిపారు. అందులో కొంత భూమిని రైతులు అక్కడక్కడ పోడు  పేరుతో చెట్లను నరికి సాగు చేసుకుంటున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. ఆకెనపల్లి శివారులో అటవీ భూములు 86 ఎకరాలు మాత్రమే ధరణిలో నమోదైనట్లు తెలిసింది. రెవెన్యూ, అటవీ శాఖ అధికారులు మధ్య సమన్వయం లేకపోవడంతోనే రెండు శాఖల మధ్య భూదస్త్రాల రికార్డులకు పొంతన లేకుండా పోయిందని ఆరోపణలు వ్యక్తం అవుతున్నాయి.  

ఫిర్యాదు వచ్చిన వెంటనే సర్వే చేయిస్తున్నాం

 - మోతీలాల్, అదనపు పాలనాధికారి

రెవెన్యూ, అటవీ శాఖ భూముల సరిహద్దు వివాదాలకు సంబంధించిన ఫిర్యాదులు వచ్చిన వెంటనే ఆయా డివిజన్ల ఆర్డీఓలు, జిల్లా అధికార అధికారితో జాయింట్‌ సర్వే చేయిస్తున్నాం. ఇప్పటికీ అనేక చోట్ల సమస్యలు పరిష్కరించాం. అటవీ శాఖ పరిధిలో రహదారుల నిర్మాణం, మరమ్మతులు చేయడానికి చీఫ్‌ కన్జర్వేటర్‌ నుంచి అనుమతులు తీసుకోవాలి. గతంలో ఈ సమస్యను వారి దృష్టికి తీసుకెళ్లాం. రెవెన్యూ శాఖ నుంచి పోడు పట్టాలు పొందిన భూములను మాత్రమే ధరణిలో నమోదు చేస్తాం. మిగతా అటవీ భూములు అన్ని వారి పరిధిలోనే ఉంటాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని