logo

అతిక్రమిస్తే.. తప్పదు మూల్యం

మైనర్లు(18 సంవత్సరాల్లోపు బాలబాలికలు) వాహనం నడపడం ప్రస్తుతం పరిపాటిగా మారింది. తమ పిల్లలు వాహనం నడిపేస్తున్నారన్న ఆనందమో, ఏదైనా సందర్భంలో పనులు సులభంగా చేసుకొచ్చేస్తారన్న ధీమానో.. తల్లిదండ్రులు, ఇతర కుటుంబ సభ్యులు సైతం వీరిని ప్రోత్సహిస్తున్నారు.

Published : 05 Jul 2024 04:07 IST

మైనర్లు వాహనం నడిపితే న్యాయస్థానానికి..

నిర్మల్‌ : తనిఖీ చేస్తున్న పోలీసులు

నిర్మల్‌ పట్టణం, న్యూస్‌టుడే:  మైనర్లు(18 సంవత్సరాల్లోపు బాలబాలికలు) వాహనం నడపడం ప్రస్తుతం పరిపాటిగా మారింది. తమ పిల్లలు వాహనం నడిపేస్తున్నారన్న ఆనందమో, ఏదైనా సందర్భంలో పనులు సులభంగా చేసుకొచ్చేస్తారన్న ధీమానో.. తల్లిదండ్రులు, ఇతర కుటుంబ సభ్యులు సైతం వీరిని ప్రోత్సహిస్తున్నారు. యథేచ్ఛగా వాహనాలను అప్పగిస్తున్నారు. నిబంధనల ప్రకారం ఇది చట్టవిరుద్ధం. కానీ క్షేత్రస్థాయిలో ఎవరూ పెద్దగా దృష్టి సారించకపోవడంతో పరిస్థితిలో మార్పు రావడం లేదు. ఇకమీదట ఈ విషయంలో కఠినంగా వ్యవహరించేందుకు జిల్లా పోలీసుశాఖ సన్నద్ధమైంది. మైనర్లు వాహనం నడుపుతూ పట్టుబడితే గతంలో మాదిరి కౌన్సెలింగ్‌ ఇచ్చో, చిన్న చిన్న జరిమానాలు విధించి పంపించడం కాకుండా నేరుగా న్యాయస్థానంలో హాజరుపరిచేందుకు చర్యలు తీసుకుంటున్నారు.

యజమాని హాజరవ్వాల్సిందే..

జిల్లాలో ఆరు నెలల వ్యవధిలో మైనర్లు వాహనం నడుపుతూ పట్టుబడ్డ ఘటనలు 49 చోటు చేసుకున్నాయి. ఇది కేవలం అధికారిక లెక్కల ప్రకారం మాత్రమే. నమోదు అవకుండా తప్పించుకుని తిరిగే వాటి సంఖ్య ఎక్కువగానే ఉంటుంది. పరిస్థితి ఇలాగే కొనసాగితే తీవ్ర ప్రభావం ఉంటుందన్న భావనతో పోలీసులు కఠినంగా వ్యవహరించేందుకు సిద్ధమయ్యారు. పట్టుబడ్డ మైనర్‌ నడుపుతున్న వాహనం జప్తు చేయడంతోపాటు కేసును న్యాయస్థానానికి అప్పగించనున్నారు. ఆ వాహనం ఎవరి పేరిట ఉంటుందో సదరు యజమాని న్యాయస్థానంలో హాజరు కావాల్సి ఉంటుంది. విచారణ, సందర్భం బట్టి బాధ్యులకు జైలుశిక్ష, జరిమానా విధించే ఆస్కారం ఉంటుంది. ముందు జాగ్రత్తగా పాఠశాలలు, కళాశాలల్లో అవగాహన సదస్సులు ఏర్పాటు చేయనున్నారు.

నిబంధనలు బేఖాతరు

ప్రమాదాల నివారణకు రహదారి నిబంధనలు ఏర్పాటు చేశారు. వాహనదారులు విధిగా వీటిని పాటించాల్సిందే. కానీ చాలామంది నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. చూసేవారు లేరు, అడిగేవారు లేరు అనే ధీమాతో బేఖాతరు చేస్తూ వాహనాలు నడుపుతున్నారు. అపసవ్య దిశలో వాహనం నడపటం, శిరస్త్రాణం ధరించకుండా, మద్యం మత్తులో, అతివేగం, ట్రిపుల్‌ రైడింగ్‌.. ఇలా వివిధ అంశాల్లో నమోదవుతున్న కేసుల సంఖ్య ప్రస్తుత పరిస్థితికి అద్దం పడుతోంది. జిల్లా కేంద్రంలో ట్రాఫిక్‌ పోలీసులు ఎవరూ ఉండటం లేదని, తనిఖీలు జరగడం లేదన్న కారణంతో చాలా మంది వాహనదారులు నిబంధనలను తోసిరాజని వ్యవహరిస్తున్నారు.

కేసులు నమోదు చేస్తాం

డా.జి.జానకి షర్మిల, జిల్లా పోలీసు అధికారి

ప్రమాదాల నివారణకు ఉద్దేశించిన నిబంధనలు మన మంచి కోసమే ఉన్నాయి. మన కోసం, మన కుటుంబం కోసం పాటించాలి. ప్రమాదాలకు దూరంగా ఉండాలి. నంబరు ప్లేట్లు చెరిపేసి, తప్పుడు నంబర్లు రాసి, సైలెన్సర్లు తొలగించి వాహనాలు నడపటం చట్టరీత్యా నేరం. మైనర్లు ఎట్టి పరిస్థితుల్లోనూ వాహనాలను నడపొద్దు. ఇక నుంచి సంబంధిత యజమానులపైనా కేసు నమోదు చేసి న్యాయస్థానంలో హాజరుపరుస్తాం.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని