logo

ఏడు సవాళ్లు.. అధిగమిస్తేనే అవకాశాలు

క్రీడలను కెరీర్‌గా మల్చుకోవాలనుకుంటున్న విద్యార్థులను తెలంగాణలోని ఆదిలాబాద్, కరీంనగర్, హకీంపేట  క్రీడా పాఠశాలలు ఆహ్వానిస్తున్నాయి.

Updated : 05 Jul 2024 06:28 IST

ఈ నెల 8 నుంచి క్రీడా పాఠశాల రాష్ట్రస్థాయి ఎంపిక పోటీలు

వ్యాయామ సాధనలో ఆదిలాబాద్‌ క్రీడా పాఠశాల విద్యార్థులు

క్రీడలను కెరీర్‌గా మల్చుకోవాలనుకుంటున్న విద్యార్థులను తెలంగాణలోని ఆదిలాబాద్, కరీంనగర్, హకీంపేట  క్రీడా పాఠశాలలు ఆహ్వానిస్తున్నాయి. ఈ నెల 8 నుంచి 12 వరకు హకీంపేట క్రీడా పాఠశాలలో నాలుగో తరగతి ప్రవేశాల కోసం రాష్ట్రస్థాయి ఎంపిక పోటీలు నిర్వహించనున్నారు. ఏడు ఎంపిక పోటీల్లో నెగ్గితేనే అవకాశాలు మెరుగవుతాయని, 16 పాయింట్లు దాటితే సీటు వస్తుందని శిక్షకులు పేర్కొంటున్నారు. ఒక్కసారి ఎంపికైతే చాలు దేశానికి ప్రాతినిధ్యం వహించేలా తీర్చిదిద్దుతారు. ఆటలతో పాటు నాణ్యమైన చదువును అందిస్తారు. శిక్షణ, చదువు, వసతి అన్ని ఉచితంగా కల్పిస్తారు. ఎంపిక పోటీల్లో విద్యార్థులకు అవగాహన కల్పిస్తూ ‘న్యూస్‌టుడే’ కథనం.

న్యూస్‌టుడే, ఆదిలాబాద్‌ క్రీడావిభాగం

సాధనతోనే నెగ్గొచ్చు..

వ్యాయామ ఉపాధ్యాయులు, శిక్షకుల పర్యవేక్షణలో కింద తెలిపిన ఎంపిక పోటీల్లో రోజూ గంటకు పైగా సాధన చేస్తేనే నెగ్గవచ్చు. ఎక్కువ పాయింట్లు సాధించవచ్చు.

  • 30మీ.ల ఫ్లయింగ్‌ స్టార్ట్‌.. ఒక్కసారి వేగంగా 30 మీ.ల దూరంగా పరుగెత్తాలి.
  • స్టాండింగ్‌ బ్రాడ్‌జంప్‌.. ఉన్న చోట నుంచి పైకి ఎగిరి గోడకు ఉన్న కొలతలను ముట్టుకోవాలి.
  • మెడిసిన్‌బాల్‌ త్రో.. రెండు కాళ్లు నెలకు తాకేలా కూర్చుని చేతితో బంతిని దూరంగా వేయాలి.
  • స్టాండింగ్‌ వర్టికల్‌ జంప్‌.. ఉన్న చోటునుంచే దూరంగా దూకి ముందుకు వెళ్లిపోవాలి.
  • ఫ్లెక్సిబిలిటీ టెస్ట్‌.. మోకాలు వంగకుండా రెండు చేతులు పాదాలు కింది వరకు తీసుకువెళ్లాలి.
  • 6X10మీ.ల షటిల్‌ రన్‌.. పదేసి మీటర్లు ఆరు సార్లు అటు ఇటు వేగంగా పరుగెత్తాలి.
  • 800మీ.ల పరుగు.. మొదటి 400 మీ.లు మెల్లగా పరుగెత్తాలి. ఆ తర్వాత పరుగు వేగాన్ని కొద్దిగా పెంచుకుంటూ పోవాలి.

పోటీలు ఇవే..

ఎత్తు, బరువు, 30 మీ.ల ఫ్లయింగ్‌ స్టార్ట్, స్టాండింగ్‌ బ్రాడ్‌జంప్, 800 మీ. పరుగు, మెడిసిన్‌బాల్‌ త్రో, వర్టికల్‌ జంప్, ఫ్లెక్సిబిలిటీ టెస్ట్, 6శ్రీ10 మీ.ల షటిల్‌ రన్‌. ఇందులో ఎత్తు, బరువు మినహాయించి మిగిలిన వాటికి పాయింట్లు ఉంటాయి.(ఒక్కో ఎంపిక పోటీకి 3 పాయింట్లు.)

  • ఎంపిక పోటీల్లో బాల, బాలికలకు పాయింట్ల విషయంలో వేర్వేరు కొలతలు ఉంటాయి.
  • ఆదిలాబాద్, నిర్మల్, కుమురం భీం, మంచిర్యాల జిల్లాల విద్యార్థులు ఈ నెల 7న హకీంపేట క్రీడా పాఠశాలకు చేరుకోవాలి. మధ్యాహ్నం 2 గంటలకు సంబంధిత క్రీడా అధికారులకు రిపోర్టు చేయాల్సి ఉంటుంది. మరుసటి రోజు అంటే 8వ తేదీ ఉదయం నుంచి హకీంపేట క్రీడా పాఠశాల మైదానంలో ఎంపిక పోటీలు నిర్వహిస్తారు.

అంతర్జాతీయ పోటీలే లక్ష్యం

తరుణ్, 10వ తరగతి, ఆదిలాబాద్‌ క్రీడా పాఠశాల

ఎస్‌జీఎఫ్‌ అండర్‌-14 ఏళ్ల విభాగంలో జమ్మూ కశ్మీర్‌లో జరిగిన జాతీయస్థాయి జూడో పోటీల్లో పాల్గొని పసిడి పతకం సాధించా. దేశంలోనే అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన క్రీడాకారులను భోపాల్‌ నేషనల్‌ సెంటర్‌ ఆఫ్‌ ఎక్స్‌లెన్సికి ఎంపిక చేస్తారు. అందులో నేను ఎంపికయ్యా. అంతర్జాతీయ పోటీలే లక్ష్యంగా సాధన చేస్తున్నా.


జాతీయస్థాయిలో పతకం సాధిస్తా

- ఆఫియా, 8వ తరగతి, ఆదిలాబాద్‌ క్రీడా పాఠశాల

గతేడాది బెంగళూరులో జరిగిన దక్షిణభారత స్థాయి బాక్సింగ్‌ ఛాంపియన్‌షిప్‌ పోటీల్లో పసిడి పతకం గెలిచా. ఇంటర్‌జోన్‌ పోటీల్లో కాంస్యం, హైదరాబాద్‌లో జరిగిన సబ్‌ జూనియర్‌ రాష్ట్రస్థాయి బాక్సింగ్‌ పోటీల్లో 2 పసిడి, 3 రజత పతకాలు సాధించా. జాతీయస్థాయి పోటీల్లో పసిడి పతకం సాధించడమే లక్ష్యంగా పెట్టుకున్నా.


దేశానికి ప్రాతినిధ్యం వహిస్తాం

- ఎన్‌.అనంది, ఎం.అమూల్య, ఎన్‌.వర్షిని, ఎస్‌.స్ఫూర్తి, ఎం.శివాని, డి.యువరాజ్,  ఆదిలాబాద్‌ క్రీడా పాఠశాల

రెండుసార్లు జాతీయస్థాయి అథ్లెటిక్స్‌ ఛాంపియన్‌షిప్‌ పోటీల్లో పాల్గొని 6 పతకాలు సాధించాం. 12 రాష్ట్రస్థాయి ఎస్‌జీఎఫ్, అసోసియేషన్‌ మీట్‌లో పాల్గొని పతకాలు గెలిచాం. దేశానికి ప్రాతినిధ్యం వహించేందుకు తీవ్రంగా మైదానంలో శ్రమిస్తున్నాం.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని