logo

‘భోజనం’.. జర పైలం!

ఇంట్లో ఒకరిద్దరికి వంట చేయడం సులువే. వంట గదిని శుభ్రంగా ఉంచడం ఇబ్బందేమీ కాదు. కానీ వందల మందికి వంట చేయాలంటే కాస్త కష్టంగానే ఉంటుంది.

Published : 05 Jul 2024 04:00 IST

శుభ్రత, నాణ్యతపై కన్నేయండి

 అన్నంలో వచ్చిన పురుగు

న్యూస్‌టుడే, మామడ : ఇంట్లో ఒకరిద్దరికి వంట చేయడం సులువే. వంట గదిని శుభ్రంగా ఉంచడం ఇబ్బందేమీ కాదు. కానీ వందల మందికి వంట చేయాలంటే కాస్త కష్టంగానే ఉంటుంది. ఏ మాత్రం నిర్లక్ష్యంగా ఉన్నా ఆహారం కలుషితమై వికటించే ప్రమాదం ఉంది. వార్షాకాలంలో ఈ సమస్య అధికంగా ఉంటుంది. పాఠశాలలు, వసతిగృహాలు, గురుకులాలు, ఇతర విద్యాలయాల్లో భోజనం విషయంలో అప్రమత్తంగా లేకుంటే అనర్థాలు తప్పవు. అశ్రద్ధకు, పొరపాట్లకు తావివ్వొద్దు. ఇప్పటికే నూతన విద్యా సంవత్సరం ఆరంభమైంది. ఈ నేపథ్యంలో వంట వ్యవస్థ నిర్వహణ చక్కగా ఉండాలి. అప్పుడప్పుడూ ఉన్నతాధికారుల ఆకస్మిక తనిఖీలు ఉండాలి.  

గతేడాది చూశాం కదా..

నర్సాపూర్‌(జి) కేజీబీవీకి చక్కని గుర్తింపు ఉంది. బాలికలు నాణ్యమైన విద్యను పొంది రాష్ట్రస్థాయిలో ర్యాంకులు సాధించారు. అక్కడ ప్రవేశాలకు తీవ్రమైన పోటీ ఉంటుంది. అలాంటి విద్యాలయానికి గత విద్యా సంవత్సరం చివర్లో భోజనం వికటించి విద్యార్థులు అస్వస్థతకు గురైన సంఘటన మచ్చను తీసుకొచ్చింది. సిబ్బందిపై వేటు పడింది. వంట, శుభ్రత, నాణ్యత విషయంలో శ్రద్ధ పెడితే ఎక్కడా ఇలాంటివి పునరావృతం కావు.

నిర్లక్ష్యం పనికి రాదు..

మామడలో నూతనంగా ఏర్పాటు చేసిన మహాత్మా జ్యోతిబాఫులే విద్యాలయంలో అన్నంలో పురుగులొచ్చాయి. విద్యార్థులు తినలేక ఇబ్బంది పడ్డారు. ఈ విషయాన్ని తల్లిదండ్రులకు చెప్పడంతో వారు నిర్వాహకుల దృష్టికి తీసుకెళ్లారు. నిర్మల్‌ పట్టణంలోని సోఫీనగర్‌ నుంచి వారం క్రితమే ఆ విద్యాలయాన్ని మామడకు తరలించారు. అక్కడ నిల్వ ఉన్న బియ్యాన్ని తీసుకొచ్చి శుభ్రపరచకుండానే అన్నం వండటంతో పురుగులొచ్చాయని గుర్తించారు. ప్రిన్సిపల్‌ స్పందించి ఆ బియ్యాన్ని పక్కన పెట్టి అప్పటికప్పుడు దుకాణం నుంచి వేరేవి తెప్పించి వండించారు.

మధ్యాహ్న భోజనం సమయంలో ఉపాధ్యాయులు ఇలా పర్యవేక్షించాలి

పొన్కల్‌లో శ్రద్ధగా..

మామడ మండలం పొన్కల్‌ జడ్పీ ఉన్నత పాఠశాలలో 500 మంది వరకు విద్యార్థులున్నారు. అక్కడ మధ్యాహ్న భోజనం విషయంలో గ్రామ విద్యాభివృద్ధి కమిటీ సభ్యులు ప్రత్యేక శ్రద్ధ కనబరుస్తారు. కూరగాయలు, సరకుల కొనుగోలును దగ్గరుండి చూసుకుంటారు. నిర్వాహకులకు అవసరమైన సాయం చేస్తారు. వంటనూ పర్యవేక్షిస్తారు. నాణ్యంగా లేకుంటే అభ్యంతరం చెబుతారు. ఇటు ఉపాధ్యాయులూ రోజూ వంటను దగ్గరుండి చూస్తారు. అలా చేయకుంటే అంత పెద్ద సంఖ్యలో ఉన్న విద్యార్థులకు చక్కని భోజనం అందకపోగా.. ఏదో ఒక ఆటంకం ఎదురవుతూనే ఉంటుంది.

ఆకస్మికంగా వచ్చి అధికారులు   రుచి చూడాలిలా..

ప్రమాదాలకు అవకాశం..

గత సంవత్సరం మామడ మండలం కొరటికల్‌ ప్రాథమిక పాఠశాలలో వండిన రాగిజావలో ఓ చిన్నారి పడి గాయాలతో మరణించింది. వందల మంది విద్యార్థులున్న చోట ఎవరెటు పోతున్నారో తెలియదు. భోజనం పెట్టే సమయంలో, వండిన గిన్నెల వద్ద నిర్వాహకులతోపాటు ఉపాధ్యాయుల పర్యవేక్షణ ఉండాలి.

భోజన నిర్వాహకులకు డబ్బుల చెల్లింపులో జాప్యం చేయొద్దు. పెరిగిన ధరలకు అనువుగా డబ్బులు ఇవ్వాలి. అప్పులు తీసుకొచ్చి వంట వ్యవస్థను నిర్వహించాలంటే వారికీ ఇబ్బందిగానే ఉంటుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని