logo

జడ్పీలో ఇక ప్రత్యేక పాలన

జిల్లా పరిషత్‌ పాలకవర్గ పదవీకాలం గురువారం ముగియనుండటంతో శుక్రవారం ప్రత్యేకాధికారి పాలన మొదలు కానుంది. ఇప్పట్లో ఎన్నికలు లేకపోవడంతో ప్రభుత్వం ప్రత్యేక పాలనవైపు మొగ్గుచూపినట్లు తెలుస్తోంది.

Published : 04 Jul 2024 03:13 IST

నేటితో పాలకవర్గ పదవీకాలం ముగింపు  
న్యూస్‌టుడే, ఆదిలాబాద్‌ పట్టణం

జిల్లా పరిషత్‌ పాలకవర్గ పదవీకాలం గురువారం ముగియనుండటంతో శుక్రవారం ప్రత్యేకాధికారి పాలన మొదలు కానుంది. ఇప్పట్లో ఎన్నికలు లేకపోవడంతో ప్రభుత్వం ప్రత్యేక పాలనవైపు మొగ్గుచూపినట్లు తెలుస్తోంది. జిల్లా పరిషత్‌లు ఏర్పడినప్పటి నుంచి ప్రత్యేకాధికారి ఆధ్వర్యంలో పాలన సాగడం ఇది ఆరోసారి. మరోపక్క మండల పరిషత్‌లలో పాలకవర్గ పదవీకాలం బుధవారం ముగియడంతో అక్కడ మండల ప్రత్యేక అధికారుల పాలన గురువారం నుంచి ప్రారంభం కానుంది. 

పాలకవర్గం పదవీ కాలం ముగియనుండడంతో జిల్లా కలెక్టర్‌ను ప్రత్యేక అధికారిగా నియమించనున్నారు. ఆది నుంచి ఇదే ఆనవాయితీగా వస్తోంది. పాలకవర్గానికి ఉండే అధికారాలన్నీ ప్రత్యేక అధికారికి ఉంటాయి. వచ్చిన నిధుల కేటాయింపు, పనుల ఎంపిక తదితర వ్యవహారాలన్నీ ఆయనే చూడాల్సి ఉంటుంది. జడ్పీ కార్యాలయంతోపాటు జడ్పీ పరిధిలోకి వచ్చే మండల పరిషత్‌ కార్యాలయాలు, జడ్పీ పాఠశాల బీసీ గణన నేపథ్యంలో ప్రభుత్వం ఇప్పటికే సర్పంచి ఎన్నికలను వాయిదా వేసినట్లు ప్రచారం జరిగింది. ఇదే తరహాలో జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలను వాయిదా వేసినట్లు తెలుస్తోంది. 

1976లో మొదటిసారి.. 

1959 నవంబరు 29న జడ్పీలో పాలకవర్గం తొలిసారి కొలువు దీరింది. అప్పటి నుంచి జడ్పీ ఛైర్మన్‌ పాలన మొదలైంది. ఆ తర్వాత ఎన్నికల జాప్యం వల్ల ప్రత్యేక అధికారి పాలన అనివార్యమైంది. తొలిసారి 1976లో ప్రత్యేక అధికారి పాలన విధానాన్ని అమలుచేశారు. జిల్లా కలెక్టర్‌ను ప్రత్యేక అధికారిగా నియమించి పాలన సాగించారు. ఆ సమయంలో అయిదేళ్లు 1981 వరకు ప్రత్యేకాధికారి ఆధ్వర్యంలోనే పాలన జరిగింది. రెండోసారి 1986లో దాదాపు 11 నెలలపాటు కొనసాగింది. మూడోసారి 1992లోనూ ప్రత్యేక అధికారిని నియమించి సుమారు మూడు సంవత్సరాలపాటు పాలన అమలు చేశారు. నాలుగోసారి 2000 సంవత్సరంలో మళ్లీ ప్రత్యేక అధికారి పాలన వచ్చింది. దాదాపు 14 నెలల పాటు ఎన్నికలు నిర్వహించలేదు. అయిదోసారి 2011లో ప్రత్యేక అధికారి పాలన మూడేళ్లపాటు  సాగింది. అయిదోసారి తెలంగాణ ఉద్యమ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ఆ సమయంలో ఎన్నికలు నిర్వహిచేందుకు ఆసక్తి చూపలేదు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం సిద్ధించాకే 2014లో ఎన్నికలు నిర్వహించాల్సి వచ్చింది. జడ్పీ ఆవిర్భవించినప్పటినుంచి ఇప్పటి వరకు 13 సంవత్సరాల 3 నెలలపాటు ప్రత్యేక పాలన సాగింది. తాజాగా ఆరోసారి జిల్లా పరిషత్‌లో ప్రత్యేక అధికారి పాలన ప్రారంభం కానుంది. తెలంగాణ రాష్ట్రం వచ్చాక జిల్లాల విభజన తర్వాత ఇదే మొదటిసారి ప్రత్యేక పాలన కానుంది.  

మండల ప్రత్యేక అధికారులకు అధికారాలు

మండల పరిషత్‌లలోని ఎంపీపీ, ఎంపీటీసీల పదవీకాలం ముగియడంతో జిల్లాస్థాయి హోదా కలిగిన అధికారులను ఆయా మండలాల్లో ప్రత్యేక అధికారులుగా నియమించారు. ఎంపీపీకి ఉన్న అధికారాలే వారికి కల్పించారు. ఎంపీడీఓతో సమన్వయం చేసుకుంటూ వీరు పని చేస్తారు. పనుల ఎంపిక, ప్రణాళిక తయారు, వివిధ మండల శాఖల సమీక్ష, పంచాయతీల పర్యవేక్షణ వంటి అన్ని అధికారాలు వీరికి ఉంటాయి. జిల్లాలోని 17 మండలాల్లో నియమించిన ప్రత్యేక అధికారులు గురువారం బాధ్యతలు స్వీకరించాలని కలెక్టర్‌ రాజర్షిషా ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.

ఇంతకు ముందే బాధ్యతల అప్పగింత 

ర్షాకాలం ఆరంభం కంటే ముందుగానే నెల కిందట జిల్లా కలెక్టర్‌ రాజర్షిషా ప్రతి మండలానికి జిల్లా స్థాయి అధికారిని ప్రత్యేకాధికారిగా నియమించారు. గ్రామాల్లో పారిశుద్ధ్యం, పాఠశాలల్లో విద్య అమలు, సీజనల్‌ వ్యాధులు ఇతర విషయాలపై పర్యవేక్షణ వంటి బాధ్యతలు అప్పగించారు. తాజాగా వారినే మండల పరిషత్‌ ప్రత్యేక అధికారులుగా నియమిస్తూ కలెక్టర్‌ బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు.  

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని