logo

ఎంపీ గోడం నగేష్‌కు చుక్కెదురు

ఆదిలాబాద్‌ ఎంపీ గోడం నగేష్‌కు చుక్కెదురైనట్లు తెలుస్తోంది. ఆదిలాబాద్‌ మున్సిపాల్టీ వైస్‌ ఛైర్మన్‌పై అవిశ్వాసం నేపథ్యంలో ఆయన బుధవారం ఎక్స్‌ అఫీషియో సభ్యుడి కింద దరఖాస్తు చేసుకోగా సమయం మించిపోయిందని అధికారులు పేర్కొంటూ అవిశ్వాసానికి ఓటు లేదని వివరణ ఇచ్చినట్లు తెలిసింది.

Updated : 04 Jul 2024 05:24 IST

‘మున్సిపల్‌ అవిశ్వాసం’లో ఓటు లేదట
ఆలస్యంగా దరఖాస్తు చేసుకోవడమే కారణం
ఆదిలాబాద్‌ పట్టణం, న్యూస్‌టుడే 

దిలాబాద్‌ ఎంపీ గోడం నగేష్‌కు చుక్కెదురైనట్లు తెలుస్తోంది. ఆదిలాబాద్‌ మున్సిపాల్టీ వైస్‌ ఛైర్మన్‌పై అవిశ్వాసం నేపథ్యంలో ఆయన బుధవారం ఎక్స్‌ అఫీషియో సభ్యుడి కింద దరఖాస్తు చేసుకోగా సమయం మించిపోయిందని అధికారులు పేర్కొంటూ అవిశ్వాసానికి ఓటు లేదని వివరణ ఇచ్చినట్లు తెలిసింది. ఒక్కో ఓటు కీలకమైన నేపథ్యంలో ఇందులో ఎంపీకి ఓటు లేకపోవడం సంతకం చేసిన కౌన్సిలర్లకు మింగుడు పడటం లేదు. ఆదిలాబాద్‌ ఎంపీగా గోడం నగేష్‌ జూన్‌ 4న గెలుపొందగా జూన్‌ 25న ప్రమాణ స్వీకారం చేశారు. అప్పటికే పుర కౌన్సిలర్లు జూన్‌ 19న వైస్‌ ఛైర్మన్‌ జహీర్‌ రంజానీపై అవిశ్వాస తీర్మాన నోటీసును కలెక్టర్‌కు అందజేశారు. భాజపా, భారాస, ఇద్దరు కాంగ్రెస్‌ కౌన్సిలర్లు కలిసి అవిశ్వాస తీర్మానంపై సంతకం చేశారు. ఓ పక్క భారాస నుంచి కాంగ్రెస్‌కు కౌన్సిలర్ల వలసలు పెరుగుతుండంతో అవిశ్వాస తీర్మానం నెగ్గడంపై ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. అవిశ్వాసానికి 33 మంది వరకు సభ్యుల బలం అవసరం ఉండగా తమకు 34 మంది ఉన్నట్లు ప్రచారం చేసుకుంటూ వచ్చారు. బుధవారం ఇద్దరు కౌన్సిలర్లు భారాస నుంచి కాంగ్రెస్‌ గూటికి చేరడంతో సంఖ్య 32కి పడిపోయింది. భాజపాకు చెందిన ఎంపీ గోడం నగేష్‌ సైతం ఎక్స్‌ అఫిషియో సభ్యుడిగా నమోదు కోసం ఆయన మద్దతుదారులు బుధవారం పుర కార్యాలయంలో లేఖ అందించారు. ఈ ఎన్నికల్లో ఆయనకు అవకాశం లేదని తెలుస్తోంది.

ఆలస్యమైనందునే.. : ఖమర్‌ అహ్మద్, పుర కమిషనర్‌

మున్సిపల్‌ వైస్‌ ఛైర్మన్‌పై అవిశ్వాస తీర్మానం కోసం ప్రత్యేక సమావేశ నిర్వహణకు జులై 1న జిల్లా కలెక్టర్‌ నోటిఫికేషన్‌ జారీ చేశారు. ఎంపీ 3న ఇచ్చిన లేఖను కలెక్టర్‌కు పంపాం. నోటిఫికేషన్‌ కంటే ముందుగా దరఖాస్తు చేసుకుంటేనే అవిశ్వాస తీర్మాన సమావేశంలో పాల్గొనేందుకు అవకాశం ఉంటుందని కలెక్టర్‌ వివరించారు. ఎంపీ ఎక్స్‌ అఫిషియో సభ్యుడి కింద నమోదయ్యారు. దరఖాస్తు ఆలస్యమైనందున అవిశ్వాస తీర్మాన సమావేశం రోజు మాత్రం ఆయన పాల్గొనేందుకు అవకాశం లేదని కలెక్టర్‌ తెలిపారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని