logo

మృత్యు పాశాలు

నిర్మల్‌ జిల్లా గొల్లపేటకు చెందిన ప్రమోద్‌ విద్యుత్తు తీగలు తగలడంతో విద్యుదాఘాతానికి గురై మృతి చెందాడు. ఆదిలాబాద్‌ మండలం యాపల్‌గూడకు చెందిన మోతీరాం విద్యుత్తు స్తంభం ఎక్కి పనులు చేస్తుండగా విద్యుదాఘాతంతో మరణించాడు.

Updated : 04 Jul 2024 05:26 IST

విద్యుత్తు ప్రమాదాల్లో అజాగ్రత్తే అసలు సమస్య
అవగాహన లేకుంటే ప్రాణాలకే ముప్పు 
న్యూస్‌టుడే, ఆదిలాబాద్‌ వ్యవసాయం

నిర్మల్‌ జిల్లా గొల్లపేటకు చెందిన ప్రమోద్‌ విద్యుత్తు తీగలు తగలడంతో విద్యుదాఘాతానికి గురై మృతి చెందాడు. ఆదిలాబాద్‌ మండలం యాపల్‌గూడకు చెందిన మోతీరాం విద్యుత్తు స్తంభం ఎక్కి పనులు చేస్తుండగా విద్యుదాఘాతంతో మరణించాడు. ఇలాంటి ఘటనలు ఉమ్మడి జిల్లాలో తరచూ జరుగుతూనే ఉంటాయి. అజాగ్రత్త, అవగాహన లోపంతో కొంత మంది ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. ఉమ్మడి జిల్లా మొత్తంలో ఈ ఏడాది ప్రారంభం నుంచి ఇప్పటి వరకు 20 మందికి పైగా విద్యుత్తు ప్రమాదాల కారణంగా మృతి చెందారు. ఇలాంటి ప్రమాదాలు జరగకుండా విద్యుత్తు శాఖ కొన్ని సూచనలు జారీ చేసింది. ఆ జాగ్రత్తలపై కథనం.  

మ్మడి జిల్లా మొత్తంలో 8.80 లక్షల విద్యుత్తు కనెక్షన్లు ఉన్నాయి. గృహావసరాలకు సరఫరా అయ్యే విద్యుత్తు తీగలతో పాటు వ్యవసాయ సంబంధిత ప్రమాదాలు ఎక్కువగా ఉంటున్నాయి. వేలాడే తీగలు, స్విచ్‌ బోర్డులు, అడవి పందుల నుంచి పంటను రక్షించుకునే ప్రయత్నంలో కంచెలు ఏర్పాటు చేసి వాటికి విద్యుత్తు సరఫరా చేయడం, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోకుండానే విద్యుత్తు స్తంభాలు ఎక్కి మరమ్మతులు చేయడం, విద్యుత్తు మోటార్ల సమీపంలో రైతులు తగు జాగ్రత్తలు తీసుకోకపోవడంతో ప్రమాదాలు జరుగుతున్నట్లుగా అధికారులు గుర్తించారు. నిబంధనలకు తగ్గట్టుగా విద్యుత్తు స్తంభాలు, తీగలు, నియంత్రికలు ఏర్పాటు చేయడం, విద్యుత్తు పట్ల అవగాహన కలిగించడం వల్ల ప్రమాదాల సంఖ్య తగ్గే వీలుంది.  

వ్యవసాయ రంగంలో..

వ్యవసాయ అవసరాలకు పంపుసెట్టును వాడుతున్నప్పుడు మోటారు, పైపులు, ఫుట్‌ వాల్వులను ఏమరుపాటుగా తాకకూడదు. వ్యవసాయ పంపుసెట్లను, స్టార్టర్లను తప్పనిసరిగా ఎర్త్‌ చేయాలి. జరిగే ప్రమాదాల్లో ఎక్కువ ఎర్త్‌ చేయబడని పరికరాల వల్ల జరుగుతాయి. ఫ్యూజులు, స్టార్టర్‌బోర్డులు నేలకు అయిదు అడుగుల ఎత్తులో ఉండేలా ఏర్పాట్లు చేయాలి. బలమైన కర్రగాని, సిమెంట్‌ స్తంభాలకు గాని పాతి అయిదు అడుగుల ఎత్తులో దాన్ని బిగించాలి. వీటి కింద బురద ఉండకుండా జాగ్రత్త తీసుకోవాలి. బోర్డు నుంచి మోటారు వరకు నేలపై నుంచి తీగలను కర్ర సాయంతో తీసుకెళ్లాలి. ఫ్యూజులు కాలిపోతే నేరుగా కనెక్షన్లు ఇవ్వకూడదు దీని వల్ల ప్రమాదం జరిగే వీలుంది. వెంటనే కొత్తగా ఫ్యూజు అమర్చుకోవాలి. వర్షాలు కురిసినపుడు విద్యుత్తు స్తంభాలను, తెగిపడిన తీగలను స్టార్టర్లను, మోటార్లను తాకరాదు. వేలాడుతున్న కరెంట్‌ తీగల గురించి అధికారులకు తెలియజేయాలి. డిస్ట్రిబ్యూషన్‌ నియంత్రికల వద్ద అనధికారికంగా ఫ్యూజులు మార్చడం, కాలిన తీగలను సరిచేయడం ప్రమాదకరం. 

సమస్యలున్నాయా..

వర్షాకాలంలో విద్యుత్తు ప్రమాదాలు ఎక్కువ చోటు చేసుకునే అవకాశాలు ఉండటంతో సమస్యలను పరిష్కరించేందుకు టోల్‌ఫ్రీ నెంబరును అందుబాటులోకి తెచ్చారు. 18004250028 లేదా 1912కు ఫోన్‌ చేసి సమస్యలను తెలియజేయవచ్చు. గ్రామీణ వినియోగదారులు తమ పరిధిలోని క్షేత్రస్థాయి విద్యుత్‌ సిబ్బంది ఫోన్‌ నెంబర్లు దగ్గర ఉంచుకుంటే మేలు. 

జాగ్రత్తలు తీసుకోవాలి

విద్యుత్తు పనులు లైసెన్స్‌ కాంట్రాక్టర్‌ ద్వారా మాత్రమే చేయించుకోవాలి. విద్యుత్తు సామగ్రి నాణ్యమైనవి వాడాలి. ఎర్త్‌ పిట్స్‌ను ప్రతి సంవత్సరం, ఇతర వైర్లు, కేబుల్స్‌ తదితర వాటిని అయిదేళ్లకొకసారి పరీక్షించాలి. 

సాకెట్‌ ఔట్‌లెట్, గీజర్, ఫ్రిడ్జ్‌ ఇతర విద్యుత్తు ఉపకరణాలకు లైటింగ్‌ సర్క్యూట్‌ 30 మిల్లీఆంప్స్‌ను ఉపయోగించాలి. విద్యుత్తు ఉపకరణాల పనులు చేసే సమయంలో రబ్బర్‌ చెప్పులు ధరించాలి. ఆరుబయట వాడే విద్యుత్తు వైర్లు, స్విచ్‌బోర్డు, ఉపకరణాలు వాటర్‌ఫ్రూఫ్‌కు సంబంధించినవి ఉండాలి.

వరికైనా విద్యుత్తు ప్రమాదం జరిగితే వెంటనే సరఫరా నిలిపివేయాలి. సరఫరా నిలిపివేయకుండా ప్రమాదం జరిగిన వ్యక్తిని తాకొద్దు. ప్రమాదం జరిగిన వ్యక్తికి సీపీఆర్‌ చేయాలి.

విద్యుత్తు తీగలు తెగి కారు, ట్రాక్టర్‌ తదితర వాహనాలపైన పడితే వాహనం పట్టుకొని కిందకు దిగొద్దు. సంబంధిత అధికారులకు ఫోన్‌ చేసి సరఫరా ఆపి వేసిన తర్వాతనే దిగాలి. అత్యవసర పరిస్థితుల్లో వాహనం పట్టుకోకుండా రెండు పాదాలు ఒకే దగ్గర ఉండేటట్లు దూకాలి. 

రఫరా నిలిపివేసిన తర్వాతనే కూలర్లలో నీళ్లు పోయాలి. మొబైల్‌ ఛార్జర్, ఇతర పరికరాలను సాకెట్‌ నుంచి తీసేముందు బటన్‌ ఆఫ్‌ చేసి తీయాలి.

విద్యుత్తు తీగలపై దుస్తులు ఆరవేయొద్దు. విలువైన విద్యుత్తు పరికరాలకు ప్రొటెక్టివ్‌ డివైజ్‌ను ఉపయోగించాలి. చిన్నపిల్లల ఆసుపత్రులు, విద్యా సంస్థల్లో షట్టర్‌ మాదిరి సాకెట్‌ ఔట్‌లెట్లను ఉపయోగించాలి.

గోదాంలలో వైరింగ్‌ను ఉపయోగించరాదు. తప్పనిసరి అయితే ఐఎస్‌ 3594: 1991 కోడ్‌ ప్రకారం చేయాలి. పెట్రోల్‌ బంక్, ఇతర మండే స్వభావం గల ద్రవ, వాయు ఇంధనాలు ఉన్న చోట ఫ్లేమ్‌ ఫ్రూఫ్‌ ఫిటింగ్స్, స్విచ్‌ బోర్డు పరికరాలను మాత్రమే ఉపయోగించాలి. సిమ్మింగ్‌ ఫూల్స్‌లో ఎలాంటి విద్యుత్తు పరికరాలను అమర్చరాదు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని