logo

మైనింగ్‌ మెరికలు

పదోతరగతి పూర్తికాగానే పాలిటెక్నిక్‌ చేసేందుకు విద్యార్థుల్లో పోటీ తీవ్రంగా నెలకొంది. కోర్సు పూర్తికాగానే ఏడాదికి రూ.లక్షల్లో ప్యాకేజీ అందుకొంటుండటమే దీనికి కారణం.

Published : 04 Jul 2024 02:56 IST

ఉద్యోగాలు సాధిస్తున్న బెల్లంపల్లి పాలిటెక్నిక్‌ విద్యార్థులు
బెల్లంపల్లి పట్టణం, న్యూస్‌టుడే

పదోతరగతి పూర్తికాగానే పాలిటెక్నిక్‌ చేసేందుకు విద్యార్థుల్లో పోటీ తీవ్రంగా నెలకొంది. కోర్సు పూర్తికాగానే ఏడాదికి రూ.లక్షల్లో ప్యాకేజీ అందుకొంటుండటమే దీనికి కారణం. బెల్లంపల్లి పాలిటెక్నిక్‌ కళాశాలలో మైనింగ్‌ డిప్లొమా కోర్సు పూర్తి చేసిన విద్యార్థులు ప్రస్తుతం ఏడాదికి రూ.15 లక్షల నుంచి రూ.16 లక్షల వరకు జీతం తీసుకుంటున్నారు. ప్రస్తుతం సింగరేణిలో మైనింగ్‌ అర్హతతో జూనియర్‌ మైనింగ్‌ అధికారి ఉద్యోగాలకు నోటిఫికేషన్‌ విడుదల అయింది. ఈ నేపథ్యంలో ఉద్యోగాలు సాధించిన విద్యార్థులతోపాటు పాలిటెక్నిక్‌ కోర్సుల్లో ఉద్యోగ అవకాశాలపై ‘న్యూస్‌టుడే’ కథనం.

పాలిసెట్‌తో ప్రవేశాలు

బెల్లంపల్లి ప్రభుత్వ పాలిటెక్నిక్‌ కళాశాలలో డిప్లొమాలో మైనింగ్, ఎలక్ట్రికల్‌ ఇంజినీరింగ్, ఎలక్ట్రానిక్స్‌ అండ్‌ ఇన్‌స్ట్రుమెంటేషన్‌ ఇంజినీరింగ్‌ కోర్సులున్నాయి. ఇప్పటికే కళాశాలలో పాలిసెట్‌ ర్యాంకులు సాధించిన విద్యార్థుల ధ్రువీకరణ పత్రాల పరిశీలన పూర్తయింది. ఆప్షన్ల ఎంపిక ప్రక్రియకు పూర్తి చేశారు. డిప్లొమా కోర్సు పూర్తి చేసిన తర్వాత ఈసెట్‌ రాసి లేటరల్‌ ఎంట్రీతో నేరుగా బీటెక్‌ రెండో సంవత్సరం చదవడానికి అవకాశం ఉంటుంది. 

మైనింగ్‌లో ఉద్యోగ అవకాశాలు

మైనింగ్‌తో సింగరేణితోపాటు ఇతర సంస్థల్లోనూ ఉద్యోగాలు ఉన్నాయి. అండర్‌గ్రౌండ్‌ మైన్స్‌ సింగరేణి, కోలిండియా, ఉపరితల గనులు(కోల్‌ అండ్‌ మెటల్‌), సిమెంట్‌ కంపెనీలు, ఎక్స్‌ప్లోజీవ్‌ కంపెనీలు, ప్రైవేట్‌ క్వారీలు, మైనింగ్‌ రీసర్చ్‌ సైంటిస్ట్‌లు, మైనింగ్‌ ఇన్‌స్పెక్టర్లు, నేషనల్‌ మినరల్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్లలో ఉద్యోగాలు అందుబాటులో ఉన్నాయి. డిప్లొమా పూర్తి కాగానే తక్కువ వయసులో ఉద్యోగాల కోసం ప్రయత్నించవచ్చు. బెల్లంపల్లి పాలిటెక్నిక్‌ కళాశాలలో చదివిన పూర్వ విద్యార్థులు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాలతో పాటు ప్రైవేటు సాఫ్ట్‌వేర్‌ కంపెనీల్లోనూ ఉన్నత ఉద్యోగాలు సాధించారు. 

మంచి భవిష్యత్తు: రవీందర్‌రెడ్డి, ప్రిన్సిపల్, పాలిటెక్నిక్‌ కళాశాల, బెల్లంపల్లి

పాలిటెక్నిక్‌ కళాశాలల్లో మంచి కోర్సులు చేయడానికి అవకాశం ఉంటుంది. బెల్లంపల్లి పాలిటెక్నిక్‌ కళాశాలలో మూడు కోర్సులు ఉన్నాయి. మైనింగ్‌ కోర్సుకు మంచి డిమాండ్‌ ఉంది. ఉద్యోగ అవకాశాలు ఎక్కువగానే ఉండడంతో ప్రతి విద్యార్థికి ఉద్యోగం వచ్చే అవకాశం ఉంటుంది. కోర్సు పూర్తయ్యేలోపు ఉద్యోగాలు సాధించిన వారు చాలా మంది ఉన్నారు. 

మంచిర్యాలలోని గోపాల్‌వాడకు చెందిన మహ్మద్‌ యూసుఫ్‌ డిప్లొమాలో మైనింగ్‌ ఇంజినీరింగ్‌ చదివారు. ఈ సమయంలో ద రామ్‌కో సిమెంట్‌ కంపెనీలో ఉద్యోగాన్ని సాధించారు. ఉద్యోగం చేస్తూనే బీటెక్‌ పూర్తి చేయడానికి సైతం కంపెనీ అవకాశం కల్పిస్తుంది. 

-మహ్మద్‌ యూసుఫ్‌ 

బెల్లంపల్లి పట్టణానికి చెందిన అల్వార్‌ వనక్రిష్ణన్‌ బెల్లంపల్లి పాలిటెక్నిక్‌ కళాశాలలో 2018-21 మధ్య మైనింగ్‌ డిప్లొమా పూర్తి చేశారు. ఈసెట్‌లో రాష్ట్రస్థాయిలో రెండో ర్యాంకు సాధించారు. కాకతీయ యూనివర్సిటీ పరిధిలోని కొత్తగూడెంలో మైనింగ్‌ ఇంజినీరింగ్‌లో గ్రాడ్యుయేషన్‌ పూర్తి చేశారు. ఈ ఏడాది కోర్సు పూర్తికాగానే వేదాంత రీసోర్సెస్‌ లిమిటెడ్‌ కంపెనీలో ఏడాదికి రూ.15.95 లక్షల ప్యాకేజీతో ఉద్యోగం దక్కించుకున్నారు.

-అల్వార్‌ వనక్రిష్ణన్‌ 

దిలాబాద్‌ జిల్లా సిరికొండకు చెందిన బొంతల సురేష్‌ బెల్లంపల్లి పాలిటెక్నిక్‌ కళాశాలలో 2018-21 మధ్య మైనింగ్‌ డిప్లొమా చదివారు. కాకతీయ యూనివర్సిటీ పరిధిలోని కొత్తగూడెంలో బీటెక్‌ పూర్తి చేశారు. ఇది పూర్తి కాగానే ఈ ఏడాది వేదాంత రీసోర్సెస్‌ లిమిటెడ్‌ కంపెనీలో సంవత్సరానికి రూ.16 లక్షల ప్యాకేజీతో ఉద్యోగం పొందారు.

-బొంతల సురేష్‌

చెన్నూరు మండలం కిష్టంపేట గ్రామానికి చెందిన వెయిగండ్ల మనోజ్‌ ఈ ఏడాది మైనింగ్‌ ఇంజినీరింగ్‌లో డిప్లొమా పూర్తి చేశారు. డిప్లొమా చదువుతుండగానే ద రామ్‌కో సిమెంట్స్‌ కంపెనీలో ఉద్యోగం వచ్చింది. అతి తక్కువ వయసులో డిప్లొమాతో ఉద్యోగం దక్కించుకున్నారు.

-వెయిగండ్ల మనోజ్‌ 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని