logo

అపురూప చరిత్ర.. చిగురిస్తున్న ఆశ!

కుమురంభీం జిల్లా ప్రకృతి సంపద, సహజ వనరులకు ఆలవాలం. అపార ఖనిజాలున్న అడవులతోపాటు, జలపాతాలు, విశాలమైన గోదావరి తీరం ఆకట్టుకుంటాయి.

Published : 04 Jul 2024 02:48 IST

కొండపల్లి అడవుల్లో 50 ఎకరాల విస్తీర్ణంలో ఫాసిల్‌వుడ్‌
తాజాగా అధికారుల పర్యటన..
బెజ్జూరు, పెంచికల్‌పేట్, న్యూస్‌టుడే

కుమురంభీం జిల్లా ప్రకృతి సంపద, సహజ వనరులకు ఆలవాలం. అపార ఖనిజాలున్న అడవులతోపాటు, జలపాతాలు, విశాలమైన గోదావరి తీరం ఆకట్టుకుంటాయి. వీటికితోడు అరుదైన వృక్షశిలాజాలు పెంచికల్‌పేట్‌ మండలం కొండపల్లి అడవుల్లో దాదాపు 12ఏళ్ల కిందటే వెలుగులోకి వచ్చాయి. వీటి రక్షణకు అప్పటి అధికారులు ప్రతిపాదనలు పంపినా అమలుకు నోచుకోలేదు. అయితే ఇటీవల కొండపల్లి అటవీ ప్రాంతంలోని వృక్ష శిలాజాలను సీఎఫ్‌ శాంతారాంతోపాటు జియాలాజికల్‌ సర్వే ఆఫ్‌ ఇండియా డైరెక్టర్‌ మంజుషా మహాజన్, సీనియర్‌ జియాలజిస్ట్‌ చక్రవర్తి ఆధ్వర్యంలో అధికారులు పరిశీలించి దీన్ని జీవవైవిధ్య ప్రాంతంగా గుర్తిస్తామని పేర్కొన్నారు. దీంతో వృక్ష శిలాజాల రక్షణకు చర్యలు తీసుకుంటారనే ఆశలు చిగురిస్తున్నాయి. 

పెంచికల్‌పేట్‌ మండల కేంద్రానికి 15 కి.మీ. దూరంలో కొండపల్లి అటవీ ప్రాంతం ఉంది. ఇక్కడ విస్తారంగా ఉన్న వృక్ష శిలాజాల జాడను 2013లో అటవీ అధికారులు గుర్తించారు. దాదాపు ఆరున్నర కోట్ల ఏళ్ల కంటే పూర్వం నాటివిగా భావిస్తున్నారు. కొండపల్లి గ్రామానికి నాలుగు కి.మీ. దూరంలో అన్వేషిస్తే 50ఎకరాల విస్తీర్ణంలో వివిధ రకాల వృక్షశిలాజాలు బయటపడ్డాయి. కొన్ని శిలాజాలు 9-25 అడుగుల పొడువు ఉన్నాయి. మరికొన్ని 50 అడుగులు ఉండి ముక్కలైనట్లు ఉన్నాయి. వీటిలో ఎక్కువగా కునిఫెర జాతికి చెందినవిగా భావించారు. వృక్ష ఖండాలకైవారం 5 అడుగుల వరకు ఉండటం విశేషం. ఈ ప్రాంతంలో తవ్వకాలు జరిపితే మరికొన్ని బయటపడతాయని అధికారులు చెబుతున్నారు. గతంలో పనిచేసిన రేంజ్‌ అధికారి అప్పయ్య.. సిబ్బందితో అటవీ ప్రాంతంలో గస్తీ తిరుగుతుండగా ఇవి కనిపించాయి. భూగర్భ గనులశాఖ అధికారులకు సమాచారం అందించగా.. 2015లో పలుమార్లు సర్వేలు చేశారు. అదే ఏడాది తెలంగాణ చరిత్ర బృంద సభ్యులు వేముగంటి మురళీ, హరగోపాల్, ప్రభాకర్, భూమన్న.. శిలాజాలను పరిశీలించి ప్రభుత్వానికి నివేదిక సమర్పించారు. అయితే సంబంధిత అధికారులు చర్యలు తీసుకోకపోవడంతో.. శిలాజాలకు ఆదరణ కరవైంది. 

వయసు అంచనాలు ఇలా.. 

మహారాష్ట్ర-తెలంగాణ సరిహద్దుల్లోని గడ్చిరోలికి 15కిలోమీటర్ల దూరంలోని ప్రాణహిత-గోదావరి బేసిన్‌లో ఉన్న వడదాంలో సారోఫోడ్స్‌ సరీసృపాల జాడ గతంలోనే వెలుగుచూశాయి. వాటి శిలాజాలను పరిశోధకులు కనుగొన్నారు. ఆరున్నర కోట్ల ఏళ్లకు పైగా చెందినవిగా జియాలాజికల్‌ ఆఫ్‌ ఇండియా సర్వే ద్వారా గుర్తించారు. ఆ తర్వాత ప్రభుత్వం ఈ ప్రాంతాన్ని వడదాం ఫాసిల్‌ పార్కుగా మార్చింది. ఇవి కొండపల్లి అటవీ ప్రాంతానికి చేరువుగా ఉండటంతో.. ఇక్కడి వృక్ష శిలాజాల వయసు కూడా అంతే ఉంటుందని అంచనా వేశారు. 

మన దేశంలో హిమాచల్‌ ప్రదేశ్‌లో శివాలిక్‌ ఫాసిల్‌ పార్క్, ఉత్తర్‌ప్రదేశ్‌లోని సల్కాన్‌ ఫాసిల్‌ పార్క్, గుజరాత్‌లోని ఇంద్రోడ తరహాలో.. కొండపల్లి అడవి వృక్షశిలాజాలు ఉన్న ప్రాంతాన్ని రక్షించేందుకు దాన్ని ఫాసిల్‌ పార్క్‌గా గుర్తించాలని నిపుణులు కోరుతున్నారు. ఈ ప్రాంతాన్ని పరిశీలిస్తే రాక్షస బల్లుల శిలాజాల జాడలు వెలుగుచూసే అవకాశం ఉందని భావిస్తున్నారు. వృక్ష శిలాజాలు ఉన్న ప్రాంతం చుట్టూ కంచె ఏర్పాటు చేసి పార్క్‌గా గుర్తిస్తే.. ఈ ప్రాంతం అభివృద్ధి చెందే అవకాశం ఉంటుంది. గతంలోనే వేమనపల్లి అటవీ ప్రాంతంలో రాక్షసబల్లి లభించగా.. హైదరాబాద్‌ బిర్లా సైన్స్‌ సెంటర్లలో ప్రదర్శనకు పెట్టిన విషయం విదితమే. 

రక్షణకు చర్యలు: శాంతారాం, సీఎఫ్‌ 

ఇటీవల కొండపల్లి అటవీ ప్రాంతంలోని వృక్ష శిలాజాలను సందర్శించాం. పొడవైన వృక్షశిలాజాలు ఉన్నట్లు గుర్తించాం. వాటి విషయంలో ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించాం. దాని రక్షణకు చర్యలు తీసుకుంటాం.  

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని