logo

పత్తి విత్తనాలు మొలకెత్తలేదని యువ రైతు ఆత్మహత్మ

పత్తి విత్తనాలు సరిగా మొలకెత్తలేదని మనోవేదనకు గురై ఓ యువరైతు ఆత్మహత్యకు పాల్పడిన ఘటన నిర్మల్‌ జిల్లా పెంబి మండలంలో జరిగింది. ఎస్సై శంకర్‌ తెలిపిన వివరాల ప్రకారం..

Published : 04 Jul 2024 02:45 IST

పెంబి, న్యూస్‌టుడే : పత్తి విత్తనాలు సరిగా మొలకెత్తలేదని మనోవేదనకు గురై ఓ యువరైతు ఆత్మహత్యకు పాల్పడిన ఘటన నిర్మల్‌ జిల్లా పెంబి మండలంలో జరిగింది. ఎస్సై శంకర్‌ తెలిపిన వివరాల ప్రకారం.. యాపలగూడ గ్రామానికి చెందిన అర్క సంతోష్‌ (29) తనకున్న ఎకరం భూమితో పాటు మరో నాలుగు ఎకరాలు కౌలుకు తీసుకుని ఇటీవలే పత్తి విత్తనాలు విత్తాడు. విత్తిన రోజే రాత్రి భారీ వర్షం కురువడంతో భూమి గట్టిగా మారి సరిగా మొలకెత్తలేదు. ఈ క్రమంలో మనోవేదనకు గురై మంగళవారం రాత్రి పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. స్థానికులు గమనించి కుటుంబ సభ్యులకు సమాచారం అందించడంతో అంబులెన్స్‌లో ఖానాపూర్‌ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. మెరుగైన వైద్యం కోసం నిర్మల్‌ ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో మృతిచెందినట్లు ఎస్సై తెలిపారు. మృతుడి భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు.


విద్యుదాఘాతంతో విద్యార్థి దుర్మరణం

ఆదిలాబాద్‌ నేర విభాగం: విద్యుదాఘాతంలో విద్యార్థి మృతి చెందిన ఘటన మావల పోలీసు స్టేషన్‌ పరిధిలోని కేఆర్‌కే కాలనీలో బుధవారం చోటు చేసుకుంది. ఇన్‌ఛార్జి ఎస్‌ఐ ముజాహిద్‌ వివరాల ప్రకారం.. బజార్‌హత్నూర్‌ మండలం భూతాయికి చెందిన ఫడ్‌ బాలాజీ కుటుంబం ఆ కాలనీలో పదేళ్లుగా నివాసం ఉంటోంది. కూలీ పనులు చేసుకునే ఫడ్‌ బాలాజీకి గోపాల్‌ ఒక్కడే సంతానం. ఏడో తరగతి పూర్తి చేసుకున్న గోపాల్‌ బుధవారం ఉదయం కాలనీలో ఆడుకొని వారుండే వీధిలోంచి వెళ్తూ రఫీక్‌ ఇంటి కిటికీ వద్ద ఏర్పాటు చేసుకున్న కూలర్‌ను ముట్టుకున్నాడు. కూలర్‌కు విద్యుత్తు సరఫరా అవుతుండటంతో విద్యుదాఘాతానికి గురై పక్కనే ఉన్న మురుగు కాలువలో పడిపోయి మృతి చెందాడు. తండ్రి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కూలర్‌ ఏర్పాటు చేసుకొని నిర్లక్ష్యంగా వదిలేసిన రఫీక్‌పై ఏఎస్‌ఐ యూనుస్‌ కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ తెలిపారు. 


సీసీఐలోని జనరేటర్‌ యంత్ర ప్లేట్ల చోరీ

ఆదిలాబాద్‌ నేర విభాగం: ఆదిలాబాద్‌ పట్టణంలో మూతపడిన సిమెంటు పరిశ్రమలోని యంత్రాల విడి భాగాల చోరీ పరంపర కొనసాగుతోంది. తాజాగా మంగళవారం రాత్రి పరిశ్రమలోని డీజీ సెట్ అనే భారీ యంత్రానికి ఉన్న ఎనిమిది ప్లేట్లను ఆగంతకులు తొలగించి తస్కరించారు. విద్యుత్తు సరఫరాలో ఆటంకం ఏర్పడినప్పుడు వినియోగించుకోవటానికి డీజీ సెట్ అనే జనరేటర్‌ను అప్పట్లోనే రూ.25 కోట్లకు కొనుగోలు చేసినట్లు సమాచారం. పరిశ్రమ మూతపడటంతో అది నిరుపయోగంగా మారింది. దీనికి రెండు వైపుల ఉన్న విలువైన ప్లేట్లను దొంగలు విడదీసి ఎత్తుకెళ్లారు.  

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని