logo

కుటుంబం ఛిన్నాభిన్నం!

ఇంటి పెద్ద, కుటుంబానికి రక్షణగా ఉండాల్సిన వాడే దారితప్పాడు. భార్యను పిల్లలను కంటికిరెప్పలా చూసుకోవాల్సి ఉండగా.. కుటుంబాన్ని పట్టించుకోకుండా మద్యానికి బానిస కావడంతో ఆర్థిక ఇబ్బందులు తలెత్తాయి.

Updated : 04 Jul 2024 05:28 IST

తల్లీకుమార్తెల మృతితో గజ్జిగూడలో విషాదం
కాగజ్‌నగర్‌ గ్రామీణం, న్యూస్‌టుడే 

ఇంటి పెద్ద, కుటుంబానికి రక్షణగా ఉండాల్సిన వాడే దారితప్పాడు. భార్యను పిల్లలను కంటికిరెప్పలా చూసుకోవాల్సి ఉండగా.. కుటుంబాన్ని పట్టించుకోకుండా మద్యానికి బానిస కావడంతో ఆర్థిక ఇబ్బందులు తలెత్తాయి. పోషణ భారంగా మారడం, కుటుంబ  కలహాలు పెరగడంతో.. చేసేదేమి లేక తల్లి, ముగ్గురు కుమార్తెలు బలవన్మరణమే శరణ్యమనుకున్నారు. ఈ నెల 1న పురుగుమందు తాగి ఆసుపత్రి పాలుకాగా..  చికిత్స పొందుతూ బుధవారం తల్లి, ఒక కుమార్తె మృతి చెందారు. కాగజ్‌నగర్‌ మండలం గజ్జిగూడలో ఒకే కుటుంబంలో నలుగురు ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డ ఘటన జిల్లావ్యాప్తంగా కలకలం రేపింది. 

గ్రామానికి చెందిన ప్రతాప్‌-అనితలకు నలుగురు సంతానం. వీరంతా కుమార్తెలే. పెద్ద కుమార్తెకు వివాహం చేశారు. వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. మూడుఎకరాలు ఉన్నప్పటికీ ఆర్థిక ఇబ్బందులు తోడు కావడంతో మనోధైర్యం కోల్పోయి ప్రతాప్‌ తాగుడికి బానిసయ్యాడు. గతంలో ప్రతాప్‌ తాగిన మైకంలో గ్రామానికి చెందిన ఒకరిపై హత్యాయత్నం చేశారు. ఆ కేసులో ప్రతాప్‌కు కోర్టు మూడేళ్ల జైలు శిక్ష విధించింది. ఇటీవల బెయిల్‌పై వచ్చినా ప్రతాప్‌ ప్రవర్తనలో మార్పు రాకపోగా.. తాగిన మైకంలో కుటుంబీకులతో గొడవలు పడేవాడు. భర్త గొడవను భరించలేక భార్య అనితతోపాటు కుమార్తెలు రమ్య, లక్ష్మి, ఐశ్వర్యలు.. తనువు చాలించాలనుకున్నారు. పురుగుమందు తాగారు. ప్రస్తుతం తల్లితోపాటు మూడో కుమార్తె మృతిచెందగా.. మిగతా ఇద్దరు లక్ష్మి (21), ఐశ్వర్య (14) మృత్యువుతో పోరాడుతున్నారు. రమ్య 2023-24లో ఇంటర్మీడియట్‌ పూర్తిచేసుకుంది. ఇటీవలే కాగజ్‌నగర్‌ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ప్రవేశానికి దరఖాస్తు చేసుకునేందుకు ప్రయత్నించినప్పటికీ సాంకేతిక కారణాలతో ప్రవేశం లభించలేదు. లక్ష్మి డిగ్రీ, ఐశ్వర్య పదో తరగతి పూర్తి చేసుకుంది. తహసీల్దార్‌ కిరణ్‌కుమార్, కాగజ్‌నగర్‌ రూరల్‌ సీఐ రాంబాబు పంచనామా నిర్వహించి ఇద్దరి మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం సిర్పూర్‌(టి) ఆసుపత్రికి తరలించారు.   

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని