logo

పదవీకాలం ముగింపు.. మిగిలిన పనుల పలకరింపు

తాండూరు మండలంలోని కుర్మవాడలో ముడుగిరి భీమయ్య ఇంటి నుంచి మురికి రాజయ్య ఇంటి వరకు సిమెంట్‌ రహదారి నిర్మాణం కోసం రూ.3 లక్షల నిధులు కేటాయించారు. ఇప్పటికీ ఆ పనులు మొదలుపెట్టలేదు.

Published : 04 Jul 2024 02:41 IST

అయిదేళ్లలో రూ. 11.23 కోట్లతో అభివృద్ధి పనులు 
మంచిర్యాల పట్టణం, న్యూస్‌టుడే 

తాండూరు మండలంలోని కుర్మవాడలో ముడుగిరి భీమయ్య ఇంటి నుంచి మురికి రాజయ్య ఇంటి వరకు సిమెంట్‌ రహదారి నిర్మాణం కోసం రూ.3 లక్షల నిధులు కేటాయించారు. ఇప్పటికీ ఆ పనులు మొదలుపెట్టలేదు. వర్షాకాలం వచ్చిందంటే చాలు ఆ రహదారి బురదగా మారుతుంది. 


జైపూర్‌ మండలంలోని శెట్టిపల్లి గ్రామంలో జిల్లా పరిషత్తు నిధులు రూ.22 లక్షలతో భీరన్న గుడికి సిమెంట్‌ రహదారి నిర్మించారు. ఆ దారిలో ఇళ్లు లేకున్నా పొలాల మధ్య నుంచే ఏర్పాటు చేయగా వివిధ ప్రాంతాల నుంచి భక్తులు ఆదివారం ఆలయానికి వచ్చి దర్శనం చేసుకుంటారు.

జిల్లా పరిషత్‌ పాలకవర్గం సభ్యుల పదవీకాలం గురువారంతో ముగుస్తుంది. ఆ పాలకవర్గం సభ్యులు ఆయా గ్రామాల్లో వివిధ అభివృద్ధి పనులు చేశారు. జిల్లాలోని 16 మండలాలకు 2019 జులైలో జిల్లా పరిషత్‌ ఎన్నికలు నిర్వహించారు. అప్పుడు మందమర్రికి చెందిన నల్లాల భాగ్యలక్ష్మి కోటపల్లి మండలం నుంచి భారాస మద్దతుతో జడ్పీటీసీ సభ్యురాలిగా గెలిచి జిల్లా పరిషత్‌ ఛైర్‌పర్సన్‌గా ఎంపిక అయ్యారు. ఆ తర్వాత ఆమె రెండు మూడుసార్లు పార్టీలు మారి ప్రస్తుతం కాంగ్రెస్‌ పార్టీలో కొనసాగుతున్నారు. అప్పుడు బెల్లంపల్లి నుంచి జడ్పీటీసీ సభ్యుడిగా గెలుపొందిన తొంగల సత్యనారాయణ భారాస తరఫున జడ్పీ ఉపాధ్యక్షుడిగా ఎన్నిక అయ్యారు. 

జిల్లా పరిషత్‌కు మంజూరైన 15వ ఆర్థిక సంఘం నిధులు, జడ్పీ స్పెషల్‌ గ్రాంట్, స్టేట్‌ మ్యాచింగ్‌ గ్రాంట్, జడ్పీ సాధారణ నిధుల ద్వారా గత అయిదేళ్లలో మొత్తం రూ.11.23 కోట్ల నిధులు మంజూరు అయ్యాయి. వీటితో 327 పనులు చేపట్ట్టగా ఇప్పటికీ 240 పనులు పూర్తి చేశారు. ఇంకా 87 పనులు పెండింగ్‌లో ఉన్నాయి. ఈ నిధులతో ఆయా గ్రామాల్లో సిమెంట్‌ రహదారులు, మురుగుకాలువలు తదితర అభివృద్ధి పనులు చేశారు. అయితే ఈ పనులన్నీ నామినేషన్‌ కింద జిల్లా పరిషత్‌ సభ్యులకే అప్పగించడంతో వారిలో కొందరు బినామీ పేర్ల మీద కాంట్రాక్టు పనులు చేయించినట్టు సమచారం. ఇందులో కొందరు జడ్పీటీసీ సభ్యులు ప్రజల అవసరాన్ని గుర్తించి అభివృద్ధి పనులు చేయగా మరికొందరు అవసరం లేని చోట కూడా అభివృద్ధి పనులు చేశారని ఆరోపణలు వ్యక్తం అవుతున్నాయి. అయితే జిల్లా పరిషత్‌ సభ్యుల పదవీకాలం ముగియటంతో పెండింగ్‌లోని అభివృద్ధి పనులను జిల్లా అధికారులు నిర్ణీత గడువులోగా నాణ్యతగా చేపట్టాలని ప్రజలు కోరుతున్నారు.


హాజీపూర్‌ మండలంలోని ముల్కల్లలో రైతు వేదికకు వెళ్లే దారిలో జడ్పీ నిధులు రూ.3 లక్షలతో మెటల్‌ రోడ్డు నిర్మించారు. అక్కడ నాయికిని రాజయ్య ఇంటి నుంచి రైతు వేదిక వరకు నిర్మించిన మెటల్‌ రోడ్డులో నాణ్యత పాటించలేదనే ఆరోపణలు వ్యక్తం అవుతున్నాయి.


మండలాల్లో ప్రత్యేక అధికారుల పాలన

నేటి నుంచి అమలుకు ఉత్తర్వులు జారీ

మంచిర్యాల గ్రామీణం, న్యూస్‌టుడే: జిల్లావ్యాప్తంగా 16 మండల ప్రజాపరిషత్తుల పాలకవర్గాల గడువు బుధవారం నాటికి ముగిసింది. దీంతో ఆయా మండలాల్లో పాలనను ఈ నెల 4 నుంచి ప్రత్యేక అధికారులకు అప్పగిస్తూ జిల్లా పాలనాధికారి కుమార్‌దీపక్‌ బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. ప్రజాప్రతినిధుల నుంచి ప్రత్యేక అధికారులకు పగ్గాలు అప్పగించడంతో పల్లెల్లోని పాలనలో మార్పు కనబడుతుందనే ఆశతో గ్రామీణ ప్రజలు ఎదురు చూస్తున్నారు. ఈ మేరకు జిల్లాలోని 16 మండలాలకు వివిధ శాఖల జిల్లాస్థాయి అధికారులను కేటాయించారు. 

సమన్వయంతో పనులు : నల్లాల భాగ్యలక్ష్మి, జిల్లా పరిషత్‌ ఛైర్‌పర్సన్, మంచిర్యాల

ప్రభుత్వ అధికారులు, జడ్పీటీసీ సభ్యుల సమన్వయంతో జిల్లాలోని గ్రామీణ ప్రాంతాల్లో అనేక అభివృద్ధి పనులు చేశాం. అయిదేళ్ల పాలనలో జిల్లాలో దాదాపు రూ.11.23 కోట్లతో రహదారులు, మురుగుకాలువలు నిర్మించి ప్రజలకు మౌలిక వసతులు కల్పించాం. ప్రభుత్వం నుంచి ఆశించినంత నిధులు రాకపోవడంలో అనుకున్న అభివృద్ధి పనులు కొన్ని చేయలేకపోయాం.   

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని