logo

పలుకు‘బడి’ బదిలీ

రాష్ట్ర ప్రభుత్వం ఉపాధ్యాయుల పదోన్నతులు, బదిలీలు పారదర్శకంగా చేపడుతున్నట్లు ఓ వైపు ప్రచారం చేస్తూనే.. రాష్ట్రస్థాయిలో పలుకుబడి ఉన్నవారికి కోరుకున్న ప్రాంతానికి బదిలీ చేస్తుండటం ఉపాధ్యాయవర్గాలను విస్మయానికి గురిచేస్తోంది.

Published : 04 Jul 2024 02:35 IST

పదోన్నతి.. వెంటనే కోరుకున్న చోటుకు..
మంచిర్యాల విద్యావిభాగం, న్యూస్‌టుడే 

రాష్ట్ర ప్రభుత్వం ఉపాధ్యాయుల పదోన్నతులు, బదిలీలు పారదర్శకంగా చేపడుతున్నట్లు ఓ వైపు ప్రచారం చేస్తూనే.. రాష్ట్రస్థాయిలో పలుకుబడి ఉన్నవారికి కోరుకున్న ప్రాంతానికి బదిలీ చేస్తుండటం ఉపాధ్యాయవర్గాలను విస్మయానికి గురిచేస్తోంది. విద్యాశాఖ కమిషనర్‌ కార్యాలయం కేంద్రంగా మంచిర్యాల జిల్లాకు చెందిన ఓ ఉపాధ్యాయురాలిని బదిలీ చేయడం చర్చనీయాంశంగా మారింది. పదోన్నతి పొందిన పది రోజుల్లో ఆ ఉపాధ్యాయురాలిని ఆగమేఘాల మీద బదిలీ చేయడాన్ని చూస్తే వారికి ప్రభుత్వ పెద్దల వద్ద ఉన్న పలుకుబడి ఎలాంటిదో తెలిసిపోతోంది. ఆ ఉపాధ్యాయురాలి భర్త రెండు, మూడు మండలాలకు విద్యాధికారి కావడంతో ఉపాధ్యాయ సంఘాలు మిన్నకుండి పోయాయని, ఇక సాధారణ ఉపాధ్యాయులు ఎలా నోరు మెదుపుతారని చెవులు కొరుక్కుంటున్నారు. 

వెబ్‌ కౌన్సెలింగ్‌ సందర్భంగా బెదిరింపులు

రాష్ట్ర విద్యాశాఖ ఇటీవల కల్పించిన పదోన్నతుల సందర్భంగా మండల విద్యాధికారి తన పరిధిలోని ఇతర ఉపాధ్యాయులను బెదిరించి తన భార్య చెన్నూరులోని బాలికల ఉన్నత పాఠశాలలో పని చేయాల్సిందేనని, ఆ పాఠశాలకు మిగతా ఎవరూ వెబ్‌ఆప్షన్స్‌ పెట్టుకోరాదని హెచ్చరించినట్లు సమాచారం. విద్యాధికారి పరిధిలోలేని మండలంలో పనిచేసే మరో ఉపాధ్యాయురాలికి ఈ విషయం తెలియక చెన్నూరు బాలికల ఉన్నత పాఠశాలను ఎంపిక చేసుకోవడంతో సమస్య వచ్చింది. అధికారి భార్య జన్నారం మండలంలోని ఓ పాఠశాలకు పదోన్నతిపై వెళ్లక తప్పని పరిస్థితి ఏర్పడింది. చివరికి ఆ అధికారి తన పలుకుబడి ఉపయోగించి రాష్ట్ర విద్యాశాఖ కమిషనరేట్‌ నుంచి నేరుగా బదిలీ ఉత్తర్వులు తెచ్చుకున్నారు. జూన్‌ 18న స్కూల్‌ అసిస్టెంట్‌(ఎస్‌ఏ) పదోన్నతుల ఉత్తర్వులు వెలువడగా అదే నెల 24 వరకు చేరికలు జరిగాయి. జన్నారంలోని పాఠశాలలో బాధ్యతలు చేపట్టకముందే ప్రణాళిక ప్రకారం బదిలీకి మార్గం సుగమం చేసుకున్నారు. పదోన్నతి పొందిన పాఠశాలలో చేరిన వెంటనే బదిలీ కోరుతూ దరఖాస్తు చేసుకోవడం, దాన్ని కిందిస్థాయి అధికారులు ఆగమేఘాల మీద సిఫారసు చేస్తూ ఉన్నతాధికారులకు పంపడం, కమిషనరేట్‌లో అసిస్టెంట్‌ డైరెక్టర్‌ పేరిట జన్నారం మండలం నుంచి వేమనపల్లి మండల కేంద్రానికి బదిలీ చేస్తూ మంగళవారం ఉత్తర్వులు జారీ చేయడం జరిగిపోయాయి. ఓ వైపు విద్యాశాఖ ఉన్నతాధికారులు ఉపాధ్యాయుల పదోన్నతులు, బదిలీల ప్రక్రియలో తీరికలేకుండా ఉన్నప్పటికీ విద్యాధికారి సతీమణి దరఖాస్తును చకచకా పరిశీలించి ఉత్తర్వులు ఇవ్వడం వెనక రాష్ట్ర ప్రభుత్వ పెద్దల హస్తం ఉండి ఉంటుందని ఉపాధ్యాయ సంఘాలు అనుమానిస్తున్నాయి.

ఉన్నతాధికారుల ఆదేశాలను పాటించాం: జిల్లా విద్యాధికారి యాదయ్య

ఇటీవల పదోన్నతి పొందిన ఉపాధ్యాయురాలి బదిలీ విషయంలో జిల్లా విద్యాశాఖ ప్రమేయం ఏమీ లేదు. ఉన్నతాధికారుల నుంచి వచ్చిన ఆదేశాలను పాటించాం. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని