logo

కొత్త చట్టంతో సత్వర న్యాయం

బ్రిటీష్‌ కాలం నుంచి అమల్లో ఉన్న న్యాయ చట్టాల్లో పలుమార్పులు, చేర్పులు చేసి నూతన విధానాలను జులై 1 నుంచి అమల్లోకి తీసుకొచ్చారు. వీటివల్ల బాధితులకు త్వరగా న్యాయం జరిగే వీలుంటుందని ఆశాభావం వ్యక్తమవుతోంది.

Updated : 04 Jul 2024 05:39 IST

బాధితులకు మరింత ప్రయోజనం 
నిర్మల్‌ పట్టణం, న్యూస్‌టుడే

మాట్లాడుతున్న ఎస్పీ జానకి షర్మిల

బ్రిటీష్‌ కాలం నుంచి అమల్లో ఉన్న న్యాయ చట్టాల్లో పలుమార్పులు, చేర్పులు చేసి నూతన విధానాలను జులై 1 నుంచి అమల్లోకి తీసుకొచ్చారు. వీటివల్ల బాధితులకు త్వరగా న్యాయం జరిగే వీలుంటుందని ఆశాభావం వ్యక్తమవుతోంది. కొత్త చట్టాలు పోలీసులకు మరింత శక్తినిచ్చేలా ఉన్నాయని, అదే సమయంలో బాధ్యతలనూ పెంచుతున్నాయని జిల్లా పోలీసు అధికారి డా.జి.జానకి షర్మిల అన్నారు. ఇదివరకు 144 సెక్షన్‌ అమలుచేయాలంటే జిల్లా మెజిస్ట్రీరియల్‌గా ఉన్న పాలనాధికారిని సంప్రదించాల్సి వచ్చేదని, ఇప్పుడా అవసరం లేకుండా ఆ అధికారం జిల్లా ఎస్పీకి లభించిందని పేర్కొన్నారు. ఫలితంగా అత్యవసర సమయాల్లో సత్వర నిర్ణయాలు తీసుకునేందుకు, శాంతిభద్రతలను మెరుగ్గా సంరక్షించేందుకు వెసులుబాటు ఏర్పడుతుందన్నారు. నూతన చట్టాలు, అందులోని పలు అంశాలపై ‘న్యూస్‌టుడే’ పలకరించగా ఆ వివరాలను ఇలా వెల్లడించారు.

నేరుగా వెళితేనే స్టేషన్లలో సిబ్బంది సక్రమంగా సహకరించడం లేదనే ఆరోపణలున్నాయి. బాధితులైనా, ఆరోపణలు ఎదుర్కొంటున్నవారైనా చేయి తడిపితేనే అక్కడ పనులు ముందుకు సాగుతాయని వినిపిస్తోంది. ఇలాంటి పరిస్థితుల్లో ఆన్‌లైన్‌లో చేసే ఫిర్యాదులకు న్యాయం జరుగుతుందా?

న్‌లైన్‌లో వచ్చే ఫిర్యాదులను నిర్లక్ష్యం చేసేందుకు వీల్లేదు. విధిగా వాటికి జవాబివ్వాల్సిందే. తీవ్రతను బట్టి కేసు నమోదుచేయాల్సిందే. అయితే.. మూడు రోజుల్లోపు బాధితుడు స్టేషన్‌కు వెళ్లి నమోదైన ఎఫ్‌ఐఆర్‌ కాపీ మీద సంతకం చేయాల్సి ఉంటుంది. ఈ కాపీలను వారు పొందడానికి అవకాశం ఉంటుంది.

ఎన్ని వెసులుబాట్లు కల్పించినా క్షేత్రస్థాయిలో ఫిర్యాదులు స్వీకరించకపోతే, ఇబ్బందులకు గురిచేస్తే బాధితులు ఎవరిని సంప్రదించాలి? ఏం చేయాలి?

మారుతున్న కాలానికనుగుణంగా ప్రజలూ మారాలి. ఇబ్బందిపెడితే ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసే అవకాశముంది. వివిధ కారణాలు, భయాలతో దానికి ముందుకొచ్చేవారి సంఖ్య తక్కువ. అయితే.. డయల్‌ 100లో సమాచారం ఇవ్వొచ్చు. లేదా ఫిర్యాదులుంటే  spnirmalts@gmail.com  కు మెయిల్‌ చేయొచ్చు. లేదా చరవాణి 87126 59555లో వాట్సాప్‌ చేయొచ్చు. జిల్లా పోలీసు కార్యాలయంలో ప్రత్యేకంగా సెంట్రల్‌ కంప్లైంట్‌ సెల్‌ ఏర్పాటుచేశాం. ఇక్కడకు వచ్చే ప్రతీ అర్జీని పర్యవేక్షిస్తూ, పురోగతి వివరాలు తెలియజేసేలా ప్రత్యేకంగా సిబ్బందిని నియమించాం. 

న్యూ: బాధితులకు ఎలాంటి ప్రయోజనం చేకూరనుంది?

ఎస్పీ: ఇదివరకు ఏ ఘటనలోనైనా బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేయాలంటే స్టేషన్‌ వెళ్లాల్సివచ్చేది. ఇప్పుడా అవసరం లేదు. సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకొని ఉన్నచోట నుంచే ఫిర్యాదులు నమోదుచేయొచ్చు. సంబంధిత స్టేషన్‌కు మెయిల్‌ చేసేందుకు, వాట్సప్‌లోనూ ఫిర్యాదు పంపించేందుకు అవకాశం కల్పించారు.  

ప్రాంతాలను బట్టి పోలీస్‌స్టేషన్ల పరిధి మారుతుంటుంది. దీనివల్ల బాధితులు ఎక్కడ ఫిర్యాదు చేయాలనే విషయంలో గందరగోళం నెలకొనే అవకాశాలుంటాయి కదా. అలాంటి వారు ఎలా ఫిర్యాదు చేయాలి?

ఎస్పీ: నిజమే. ఇదివరకైతే ఘటన జరిగిన ప్రదేశం పరిధిలోని పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేయాల్సి వచ్చేది. ఇప్పుడు జీరో ఎఫ్‌ఐఆర్‌ అందుబాటులోకి వచ్చింది. అంటే.. ఏ స్టేషన్‌లోనైనా ఫిర్యాదు చేయొచ్చు. పరిధి, ప్రాంతం కాదంటూ దాన్ని తిరస్కరించేందుకు అవకాశం లేదు. ముందుగా ఫిర్యాదు తీసుకొని కేసు నమోదుచేయాలి. ఆ తర్వాత సంబంధిత స్టేషన్‌కు దాన్ని పంపించాలి.

ఇంకా ఎలాంటి అవకాశాలుకల్పించారు?

ఇంతకుముందు ఎలక్ట్రానిక్‌ పరికరాలను సాక్ష్యంగా పరిగణించేవారు కాదు. ఇప్పుడు అవి కూడా సాక్ష్యంగా వాడుకోవచ్చు. సీడీలు, ఫోన్లు, ఇతర పరికరాలను, వాటిలోని సమాచారాన్ని సాక్ష్యాలుగా స్వీకరించే వెసులుబాటు కల్పించారు. నేటి ఆధునిక సాంకేతికయుగంలో మారిన కాలానికనుగుణంగా ఈ మార్పులు చేయడం ప్రయోజనకరం. ఇప్పుడందరి చేతుల్లో స్మార్ట్‌ఫోన్లు ఉన్నాయి. వాటి ఆధారంగా సంఘటనలు రికార్డ్‌ చేయొచ్చు. అయితే.. అవి ఎంతవరకు వాస్తవమనేది నిర్ధారణ చేసుకున్నాకే వాటిని సాక్ష్యంగా ఉపయోగించుకోగలుగుతాం. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని