logo

చెరిపేస్తున్నారు.. చక్కదిద్దేవరు?

చెరువు.. గ్రామంలోనైనా, పట్టణంలోనైనా ఇది ఉండటం ఎంతో ఆవశ్యకం. కేవలం సాగునీటి కోసమే కాదు.. అక్కడి ప్రజలు, జీవరాశుల ఇతర అవసరాలను తీర్చడంలో దాని ప్రాధాన్యం అంతాఇంతా కాదు.

Published : 04 Jul 2024 02:30 IST

ప్రశ్నార్థకంగా చెరువుల భవిష్యత్తు
నిర్మల్‌ పట్టణం, న్యూస్‌టుడే

చెరువు.. గ్రామంలోనైనా, పట్టణంలోనైనా ఇది ఉండటం ఎంతో ఆవశ్యకం. కేవలం సాగునీటి కోసమే కాదు.. అక్కడి ప్రజలు, జీవరాశుల ఇతర అవసరాలను తీర్చడంలో దాని ప్రాధాన్యం అంతాఇంతా కాదు. చెప్పాలంటే.. తల్లిలాంటి ఆ జలనిధి స్థానం భర్తీచేయడంలో ఇంకేదీ సాటిరాదు. ఒక చెరువు ఉంటేనే ఎంతో అక్కరకొచ్చే ఇలాంటి పరిస్థితుల్లో బంగారంలా ఉన్న 11 గొలుసుకట్టు తటాకాలతో ఇంకెంత ప్రయోజనం కలుగుతుందో ఊహించలేనిది కాదు. అలాంటి వనరులను ఎంతో జాగ్రత్తగా కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిదీ. ఈ విషయంలో పాలకులు, అధికారుల పాత్ర ఇంకాస్త కీలకం. కానీ, నిర్మల్‌ పట్టణంలో భిన్నమైన పరిస్థితులు కనిపిస్తున్నాయి. పాలకుల నిలువెత్తు నిర్లక్ష్యానికి అధికారుల నిర్లిప్తత తోడవుతుండటంతో విలువైన జలవనరులు దెబ్బతింటున్నాయి. మున్ముందు ఆనవాళ్లను కోల్పోయే పరిస్థితిని కొనితెచ్చుకుంటున్నాయి.

కేవలం సాగుకేనా..?

చెరువులు కేవలం సాగునీటి అవసరాలకే ఉపయోగపడుతాయా.. అంటే అంతకన్నా వెర్రితనం ఇంకోటి ఉండకపోవచ్చు. ఎందుకంటే, ఆ నీటిలో చేపల పెంపకం చేపట్టవచ్చు. దుస్తులు ఉతుక్కునేందుకు పనికొస్తుంది. పశువుల దాహార్తి తీర్చేందుకు అవసరమవుతుంది. సమీపంలో శ్మశానవాటికలు ఉంటే స్నానం చేసేందుకు, ఇతర అవసరాలకు అక్కరకొస్తుంది. అన్నింటికంటే ముఖ్యంగా ఆ ప్రాంతంలో భూగర్భ జలవనరులు పెరిగేందుకు ఎంతో దోహదం చేస్తుంది. ఇదంతా అధికారులకు తెలియనిది కాదు. అయినా.. వివిధ రకాల ఒత్తిళ్ల కారణంగా తమ విధి నిర్వహణలో అలసత్వం వహిస్తున్నారని, ఫలితంగా క్షేత్రస్థాయిలో ఇలాంటి పరిస్థితులు నెలకొన్నాయనేది బహిరంగ రహస్యం.

నిబంధనలు అంటూ..

చెరువుల కింద సాగు ఉంటేనే తమశాఖ పర్యవేక్షిస్తుందని, అవసరమైన చర్యలు చేపడుతుందంటూ నీటిపారుదలశాఖ అధికారులు పేర్కొంటున్నారు. పట్టణం విస్తరిస్తుండటం, అవసరాలు పెరుగుతుండటంతో ఇదివరకున్న సాగుభూములు ఇళ్లస్థలాలుగా మారిపోయాయి. సాగు గణనీయంగా తగ్గిపోయింది. పైన పేర్కొన్న ఉదాహరణలో.. ఇబ్రహీం చెరువు కింద ఆయకట్టు పదెకరాల లోపు ఉన్నట్లు తెలుస్తోంది. అధికారిక లెక్కల ప్రకారం ఇది కూడా ఉండకపోవచ్చు. దీని పరిధిలో వ్యవసాయం లేదన్న కారణంతో ఇప్పుడీ కట్ట మరమ్మతులను తమశాఖ అంగీకరించే అవకాశం లేదని చెబుతున్నారు. నిబంధనల అమలులో ఇంత పక్కాగా ఉన్న అధికారులు, అసలు కట్ట తవ్వేసే సమయంలో ఏం చేశారో, ఎందుకు పట్టించుకోలేదో వారికే తెలియాలి మరి. వర్షాకాలం మొదలైంది. సకాలంలో పనులు చేపట్టకపోతే నీరంతా ఖాళీ అవుతుంది. మున్ముందు ఇది భూగర్భజలాలపై తీవ్ర ప్రభావం చూపుతుంది.

ఎక్కడాలేని విడ్డూరం..

వర్షాలు బాగా కురిసి చెరువులు నిండితే ఎలా..? నీటిని ఎలా తోడేస్తారు, వాటిని ఎలా సంరక్షిస్తారు అని ఎవరైనా అడిగితే.. నవ్వుకుంటాం. నీరు నిండితే అలుగు నుంచి వెళ్లిపోతుంది. అవసరమైన చోట్ల తూములు ఉంటాయి. వాటి సాయంతో నీటినిల్వను మన అవసరాలకు అనుగుణంగా కొనసాగించే అవకాశం ఉంటుంది కదా అనే సమాధానం చెప్పాలనిపిస్తుంది. కానీ, నిర్మల్‌లో మాత్రం అదనంగా మరో ఐచ్ఛికం కనిపిస్తుంది. అదేంటంటే.. చెరువు కట్టను తవ్వేయడం! నమ్మశక్యంగా లేకపోయినా, విడ్డూరంగా అనిపిస్తున్నా.. ఇది నిజం. అధికారులు, పాలకులు దగ్గరుండి మరీ ఇలాంటి చర్యలను ప్రోత్సహిస్తుంటారు. దీనికి నిదర్శనం.. ఇబ్రహీం చెరువు. కొద్దినెలల క్రితం భారీవర్షాలతో చెరువు నిండటంతో నీటిని వృథాగా మళ్లించేందుకు కట్టను తవ్వేశారు. ఇదంతా నిబంధనలకు విరుద్ధమే అయినా అధికారులు చేష్టలుడిగిపోయారు. పోనీ, నీటి తరలింపు అనంతరం కట్ట మరమ్మతులు చేపట్టారా అంటే అదీ లేదు. ఆ విషయమే మర్చిపోయారు. కంచెరోని చెరువులోనూ ఇదేరీతిలో నీటిని వృథాగా మళ్లించేసిన ఘటనలున్నాయి. దీనివల్ల చేపల పెంపకానికి ఆటంకం ఏర్పడి మత్స్యకారులు నష్టపోవాల్సిన పరిస్థితి ఏర్పడింది.

మున్సిపల్‌ వారే చేపట్టాలి: నరేశ్, నీటిపారుదలశాఖ డీఈ, నిర్మల్‌

ఇబ్రహీం చెరువు కట్టను తవ్వేసిన విషయం తెలియదు. క్షేత్రస్థాయిలో పరిశీలిస్తాం. దీనికింద సాగు లేకపోవడం వల్ల మా శాఖ ఆధ్వర్యంలో నిధులు కేటాయించి మరమ్మతులు చేపట్టే అవకాశం లేదు. మున్సిపల్‌ వారే చూసుకోవాల్సి ఉంటుంది. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని