logo

మట్టి పరీక్షకు మరో విధానం

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రైతులకు నేల ఆరోగ్య కార్డు ఇవ్వాలని లక్ష్యంగా పెట్టుకున్నాయి. ఇందులో భాగంగా ఈ సీజన్‌లో జిల్లాకు ఒక మండలాన్ని ఎంపిక చేసి ప్రయోగాత్మకంగా మట్టి నమూనాలను సేకరించడంతోపాటు వాటి ఫలితాలను రైతులకు అందించాలని ఆదేశాలు జారీ చేశాయి.

Updated : 03 Jul 2024 05:45 IST

నమూనాల సేకరణకు జియో ట్యాగింగ్‌
ప్రయోగాత్మకంగా జిల్లాకో మండలం ఎంపిక
న్యూస్‌టుడే, ఆదిలాబాద్‌ వ్యవసాయం

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రైతులకు నేల ఆరోగ్య కార్డు ఇవ్వాలని లక్ష్యంగా పెట్టుకున్నాయి. ఇందులో భాగంగా ఈ సీజన్‌లో జిల్లాకు ఒక మండలాన్ని ఎంపిక చేసి ప్రయోగాత్మకంగా మట్టి నమూనాలను సేకరించడంతోపాటు వాటి ఫలితాలను రైతులకు అందించాలని ఆదేశాలు జారీ చేశాయి. మట్టి నమూనాల సేకరణ నుంచి మొదలు, రైతులకు ఫలితాలు అందించే వరకు పూర్తి సాంకేతికతను ఉపయోగించడంపై అధికారులు కసరత్తు చేస్తున్నారు. 

జిల్లా కేంద్రంలోని భూసార ప్రయోగశాల

  ఉమ్మడి జిల్లా సాధారణ సాగు 5.70 లక్షల హెక్టార్లు కాగా, వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా ఏటా 6 లక్షల హెక్టార్లలో పంటలు సాగు చేస్తారు. పశు సంపద తక్కువగా ఉండటంతో ఎక్కువ మంది రైతులు రసాయన ఎరువులపైనే ఆధారపడుతున్నారు. జిల్లాలో ఏటా 3.60 లక్షల లక్షల మెట్రిక్‌ టన్నులకు పైగా రసాయన ఎరువులను వినియోగిస్తున్నారు. ఏటా నిర్వహించే మట్టి నమూనా పరీక్షల్లో భూసారం గణనీయంగా తగ్గుతున్నట్లు నివేదికలు స్పష్టం చేస్తున్నాయి.  

ముందుగా నాలుగు మండలాల్లో

భూసార పరీక్షల ప్రాధాన్యం గుర్తించిన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రతి రైతుకు తమ భూమికి సంబంధించిన భూసార పరీక్ష ఫలితాల సమాచారం అందించాలని భావిస్తున్నాయి. సాధారణంగా మట్టి నమూనాలను మే నెలలో సేకరించి జూన్‌లో పంట సాగు చేసే సమయానికి ఫలితాలు రైతులకు అందిస్తే దాన్ని అనుసరించే అవకాశం ఉంటుంది. ఈ సీజన్‌లో ఆలస్యం కావడంతో జిల్లాకు ఒక మండలాన్ని ఎంపిక చేసి ప్రయోగాత్మకంగా భూసార పరీక్ష ఫలితాలను అందించేలా కార్యాచరణను రూపొందించారు. హెక్టార్లకు ఒక నమూనా చొప్పున ఉమ్మడి జిల్లా మొత్తంలో 18,482 మట్టి నమూనాలు సేకరించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.

సాంకేతికత వినియోగించి..

ఎంపిక చేసిన సాగు భూమిలో మట్టి నమూనాలు సేకరించిన తర్వాత వ్యవసాయ విస్తరణ అధికారి సంబంధిత నమూనాల వివరాలను సాయిల్‌ హెల్త్‌ యాప్‌లో నమోదు చేయాల్సి ఉంటుంది. పంట పొలానికి వెళ్లి మట్టి సేకరణ ఫొటో తీసి అప్‌లోడ్‌ చేయాలి. జియోట్యాగింగ్‌ విధానం అమలు చేస్తుండటంతో మట్టి నమూనా ఎక్కడిది అనేది తెలిసిపోతుంది. జులై పదో తేదీ లోగా మట్టి నమూనాల సేకరణ పూర్తి చేసి, 31లోగా విశ్లేషించి, ఆగస్టు రెండో వారంలో నేల ఆరోగ్య కార్డులు రైతులకు అందించాలని ఆదేశాలు ఉన్నాయి. ప్రతి క్లస్టర్‌లో ఒక అభ్యుదయ రైతును ఎంపికచేసి హెక్టారులో సాగు చేసిన పంటలో భూసార ఫలితాల ఆధారంగా ఎరువులు వేయడం వల్ల కలిగిన ప్రయోజనాలను రైతులకు తెలియచేసేందుకు వీలుగా ప్రదర్శన క్షేత్రాన్ని నిర్వహించాల్సి ఉంటుంది.

ప్రతి రైతుకు భూసార పరీక్ష కార్డు

జిల్లాలో ఎంపిక చేసిన మండలాల్లో ప్రతి రైతుకు నేల ఆరోగ్య కార్డులు అందించాలనేది లక్ష్యం. మట్టినమూనా సేకరణ సమయంలోనే జియోట్యాగింగ్‌ చేస్తారు. సేకరించిన మట్టినమూనాకు సంబంధించిన వివరాలు యాప్‌లో నమోదు చేస్తారు. ఆన్‌లైన్‌లో రైతు పేరున నెంబర్‌ వస్తుంది. ఆ నెంబరు వేసి, మట్టి నమూనాను జిల్లా కేంద్రానికి పంపించాల్సి ఉంటుంది. మట్టిని పరీక్షించి వాటి ఫలితాలను అంతర్జాలంలో నమోదు చేయడంతో పాటు, రైతుకు నేరుగా కార్డు అందించే విధంగా ఏర్పాట్లు చేస్తున్నాం.

ప్రసాద్, సహాయ సంచాలకులు, భూసార పరీక్ష కేంద్రం

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని