logo

కొత్త చట్టాలతో బాధితులకు మేలు

దేశ న్యాయ వ్యవస్థలో నూతన చట్టాల అధ్యాయం ప్రారంభమైంది. ఇందులో ఎఫ్‌ఐఆర్, ఈఎఫ్‌ఐఆర్‌ కీలకం.

Published : 03 Jul 2024 03:58 IST

‘ఈనాడు-ఈటీవీ’ ముఖాముఖిలో ఎస్పీ గౌష్‌ ఆలం
ఈటీవీ - ఆదిలాబాద్‌ 

దేశ న్యాయ వ్యవస్థలో నూతన చట్టాల అధ్యాయం ప్రారంభమైంది. ఇందులో ఎఫ్‌ఐఆర్, ఈఎఫ్‌ఐఆర్‌ కీలకం. కొత్త చట్టాలతో వచ్చిన మార్పులు ఏమిటి? బాధితులకు ఒనగూరే ప్రయోజనాలు తదితర అంశాలపై ఆదిలాబాద్‌ ఎస్పీ గౌష్‌ ఆలంతో ‘ఈనాడు-ఈటీవీ’  ముఖాముఖి.

ఈ : కేంద్ర ప్రభుత్వం చేసిన కొత్త చట్టాలతో ఒనగూరే ప్రయోజనం ఏమిటి? వాటి ఉద్దేశాలేమిటి?

ఎస్పీ : ఇదివరకు ఉన్న భారత శిక్షా స్మృతి(ఐపీసీ) స్థానంలో ఇక నుంచి భారతీయ న్యాయ సంహిత(బీఎన్‌ఎస్‌), నేర శిక్షా స్మృతి(సీఆర్‌పీసీ)కి బదులుగా భారతీయ నాగరిక్‌ సురక్షా సంహిత(బీఎన్‌ఎస్‌ఎస్‌), భారత సాక్ష్యాధార చట్టం(ఐఈఏ) చోట భారతీయ సాక్ష్య అధినియం(బీఎస్‌ఏ) చట్టాల విధానం అమల్లోకి వచ్చింది. గతంలోని చట్టాలు శిక్షాధారితమైనవిగా ఉంటే తాజాగా మారిన చట్టాలతో బాధితుల న్యాయాధారిత కేంద్రమైనవి. గతంలో బాధితుల పాత్ర ఫిర్యాదు వరకే ఉండేది. ఇప్పుడు వారికి ఎప్పటికప్పుడు సమాచారం ఇవ్వాల్సి ఉంటుంది. దాంతో నిరక్షరాస్యులు, చట్టాలంటే అవగహనలేని వారికి సైతం ఉపయుక్తంగా ఉంటుంది.

ఈ : మీరన్నట్లుగా బాధితులు మూడో రోజుల్లోగా పోలీసు స్టేషన్‌కు వచ్చి సంతకం చేయకుంటే ఈఎఫ్‌ఐఆర్‌ కేసులను మూసివేస్తారా? అలా చేస్తే బాధితులకు న్యాయం జరిగినట్లు అవుతుందా?

ఎస్పీ : లేదు. అందులోనూ విచక్షణతో కూడిన విచారణ జరుగుతుంది. ఆదిలాబాదో, బేలనో, ఇచ్చోడనో లేదా ఏ స్టేషన్లోనైనా ఈఎఫ్‌ఐఆర్‌ కింద వచ్చిన ఫిర్యాదును జీడీలో నమోదు చేశాక కేసు తీవ్రతను పరిశీలిస్తాం. తీవ్రమైన నేరానికి సంబంధించినదైతే సుమోటాగా కేసు నమోదు చేస్తాం. చిన్నా, చితకవి ఉంటే ఫిర్యాదుదారులు రాకుంటే మూసివేస్తాం.

ఈ : కొత్త చట్టాల్లో జీరో ఎఫ్‌ఐఆర్, ఈఎఫ్‌ఐఆర్‌ అనే విధానం అమల్లోకి వచ్చింది. వీటి వల్ల ఫిర్యాదుదారులకు కలిగే ప్రయోజనం?

ఎస్పీ : గతంలో ఉన్న ఎఫ్‌ఐఆర్‌ విధానం ప్రకారం తప్పనిసరిగా నేరం జరిగిన పోలీసుస్టేషన్‌ పరిధిలోనే బాధితులు ఫిర్యాదు చేయాల్సి ఉండేది. ఇప్పుడు జీరో ఎఫ్‌ఐఆర్‌ అంటే దేశంలోని ఏ ప్రాంతం నుంచి ఏ పోలీసు స్టేషన్లోనైనా ఫిర్యాదు చేసుకోవచ్చు. ఉదాహరణకు ఆదిలాబాద్‌ జిల్లా జైనథ్‌ పోలీసు స్టేషన్‌ పరిధిలోని ఓ గ్రామంలో దొంగతనమో, భూసంబంధ దౌర్జన్యమో జరిగిందనుకోండి. బాధితులు దూర ప్రాంతంలో ఉంటే జైనథ్‌ వచ్చి ఫిర్యాదు చేయటం ఆలస్యమవుతుంది. అందుకే వారికి సమీప పోలీసుస్టేషన్లో ఫిర్యాదు చేస్తే అక్కడి పోలీసులు జైనథ్‌కు బదిలీ చేసే విధానమే జీరో ఎఫ్‌ఐఆర్‌. ఇక ఈఎఫ్‌ఐఆర్‌ అంటే గతంలో బాధితులు స్వయంగా పోలీసుస్టేషన్‌కు వచ్చి మౌఖికంగానో, రాతపూర్వకంగానో వచ్చి సంతకంతో కూడిన ఫిర్యాదు చేయాల్సి ఉండేది. ఇప్పుడు బాధితులు వాట్సాప్, ట్విట్టర్, ఈమెయిల్, ఫేస్‌బుక్‌ ద్వారా స్టేషన్‌హౌస్‌ ఆఫీసర్‌(ఎస్‌హెచ్‌వో), డీఎస్పీ, ఎస్పీకి ఫిర్యాదు చేస్తే స్టేషన్లలో జనరల్‌ డైరీ(జీడీ)లో నమోదు చేస్తాం. బాధితులు మూడు రోజుల్లో వచ్చి సంతకం చేయాల్సి ఉంటుంది. ఈ విధానాన్నే ఈఎఫ్‌ఐఆర్‌ అంటారు.

ఈ : కొత్త చట్టాల ఆధారంగా కోర్టుల్లో వాది, ప్రతివాదిల తరఫున వాదించే పబ్లిక్‌ ప్రాసిక్యూటర్, న్యాయవాదుల పాత్ర ఏమిటి? కీలకమైన కేసుల్లో వైద్యుల సాక్ష్యం ఏ విధంగా ఉంటుంది? సకాలంలో తీర్పులు ఇవ్వాలంటే కోర్టులపై ఒత్తిడి పెరగదంటారా?

ఎస్పీ : చట్టాల మార్పుతో సమయసారణి అందుబాటులోకి వచ్చింది. నిజంగానే కేసుల పరిష్కారంలో కోర్టులపై పని భారం పెరిగే అవకాశం ఉంది. కానీ బాధితులకు జరిగే న్యాయమనే కేంద్ర బిందువుగా పని చేయాలనే ఆలోచన ఉంది. న్యాయమూర్తులపై ఒత్తిడిని తగ్గించటానికి కొత్తగా నియమాకాలు జరిగే అవకాశం ఉంటుందనుకుంటున్నా. ఇక బాధితుల తరఫున గతంలో పీపీలే వాదించే విధానం ఉండేది. ఇప్పుడలా కాదు. పీపీలపై నమ్మకం లేదని బాధితులు భావిస్తే ఇష్టమైన ఇతర న్యాయవాదిని నియమించుకోవచ్చు. ఏడేళ్ల పైబడే కేసుల్లో వైద్యుల సాక్ష్యంతోపాటు ఫోరెన్సిక్‌ విధానం తప్పనిసరిగా సమర్పించాల్సి ఉంది. కోర్టుల్లోనూ రెండింటికి మించి వాయిదాలకు వేయరాదు. చివరికి హియరింగ్‌ తర్వాత 45 రోజుల్లో తీర్పు వెల్లడించాల్సి ఉంది. తీర్పులను బాధితులకు పీపీల ద్వారానే ఇవ్వాలని కాకుండా  ఆన్‌లైన్‌లో అప్‌లోడ్‌ చేసి బాధితులకు ఉచితంగా ఇవ్వాల్సి ఉంది. దీని ద్వారా బాధితుడికి సాంత్వన చేకూరినట్లవుతుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని