logo

ఖాళీ చేయరు.. కూలగొట్టరు!

‘వర్షాలకు నాగర్‌కర్నూర్‌ జిల్లా వనపట్లలోని ఓ పురాతన మట్టిమిద్దె అర్ధరాత్రి వేళ కూలింది.

Updated : 03 Jul 2024 05:47 IST

శిథిల భవనాల్లో కొనసాగుతున్న ప్రభుత్వ కార్యాలయాలు!

జిల్లా కేంద్రంలోని గ్రామీణ నీటి సరఫరా సబ్‌ డివిజన్‌ కార్యాలయ భవనం శిథిలావస్థకు చేరింది. గోడలు పగుళ్లు తేలి ఎప్పుడు కూలుతాయో తెలియని పరిస్థితి. వర్షం పడితో నీరు దిగి తడిగా మారుతోంది. కొత్త భవనం లేక ఉద్యోగులు బిక్కుబిక్కుమంటూ విధులు నిర్వహిస్తున్నారు.

‘వర్షాలకు నాగర్‌కర్నూర్‌ జిల్లా వనపట్లలోని ఓ పురాతన మట్టిమిద్దె అర్ధరాత్రి వేళ కూలింది. ఈ ఘటనలో నలుగురు కుటుంబ సభ్యులు మృతి చెందగా, ఒకరు తీవ్ర గాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందడం ఆ గ్రామంలో విషాదాన్ని నింపింది.’.. ఇటువంటి భవనాలు, ప్రభుత్వ కార్యాలయాలు జిల్లాలోనూ కనిపిస్తున్నాయి. పురాతన భవనాలను ఖాళీ చేసి కూలగొట్టాల్సి ఉండగా.. అవేమీ పట్టనట్లు వ్యవహరిస్తున్నారు.

ఆసిఫాబాద్, న్యూస్‌టుడే వర్షాకాలం నేపథ్యంలో పాత భవనాలు, శిథిలావస్థలో చేరిన వాటిలో ఉంటున్న వారు అప్రమత్తంగా ఉండాల్సిన తరుణమిది. గోడలపై ప్లాస్టరింగ్‌ ఊడిపోవడం, స్లాబులకు లీకేజీలు ఏర్పడితే వాన నీరు వాటిలోకి దిగి గదుల్లో చేరుతుంది. గోడల్లోకి దిగి పదనెక్కి కూలిపోయే ప్రమాదం ఉంటుంది. గతేడాది జులై, ఆగస్టు నెలల్లో కురిసిన వానలతో 28 ఇళ్లు పూర్తిగా కూలిపోగా, 54 పాక్షికంగా దెబ్బతిన్నాయి. శిథిలావస్థకు చేరిన భవనాల మన్నికను తెలుసుకునేందుకు ఆర్‌అండ్‌బీ శాఖకు దరఖాస్తు చేస్తే.. వారు పరిశీలించి, వినియోగానికి అనుకూలంగా లేకపోతే నోటీసు జారీ చేసి కూల్చివేయాలని సూచిస్తారు. కానీ జిల్లాలో ఇలాంటి పరిస్థితులు కనిపించడంలేదు.

జిల్లాలోని చాలా ప్రభుత్వ కార్యాలయాలు శిథిలావస్థకు చేరాయి. కొత్త వాటి నిర్మాణం లేక పాత వాటిలోనే భయం భయంగా ఉద్యోగులు విధులు నిర్వహిస్తున్నారు. ఏప్రిల్‌లో జిల్లాలో నిర్వహించిన ప్రత్యేక పారిశుద్ధ్య కార్యక్రమంలో కార్యదర్శులు శిథిలావస్థ భవనాలు, ఇళ్లను గుర్తించారు. మొత్తం 87లలో.. 62 వాటిని కూలగొట్టినట్లు లెక్కల్లో చూపారు. కానీ ఆయా మండలాల్లో తహసీల్దార్, ఎంపీడీవో, ఎమ్మార్సీ, నీటిపారుదల శాఖ, నీటి సరఫరా శాఖల భవనాలు శిథిలావస్థలో చేరినా.. ఖాళీ చేయకుండా, కొత్తవి నిర్మించకుండా వాటిలోనే విధులు నిర్వహిస్తున్నారు. వానకాలంలో స్లాబులు, గోడల నుంచి నీరు దిగి పెచ్చులూడి కిందపడుతున్నాయి. కొన్ని సందర్భాల్లో పలువురు గాయాలపాలయ్యారు. 

జిల్లా కేంద్రంలోని అగ్నిమాపక కార్యాలయం భవనం నిర్మించి 40ఏళ్లు దాటింది. గోడలు పెచ్చులూడి శిథిలావస్థకు చేరింది. వాన పడితే నీరంతా లోపలికి చేరుతోంది. ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని ఉద్యోగులు విధులు నిర్వహిస్తున్నారు.


జిల్లా కేంద్రంలోని నీటి పారుదలశాఖ డివిజన్‌ కార్యాలయం-4 భవనం లోపల గోడలు నెర్రలతో పెచ్చులూడి ప్రమాదకరంగా మారాయి. ఫ్లోరింగ్‌ పూర్తిగా దెబ్బతిన్నాయి. జిల్లాస్థాయి అధికారి చాంబర్, ఇతర ఉద్యోగుల గదుల గోడలు పెచ్చులూడి శిథిలావస్థకు చేరాయి. 

రెబ్బెన మండలం పైకాజీగూడలోని ప్రాథమిక పాఠశాల భవనం పూర్తిగా దెబ్బతింది. ఇక్కడ 1-5వ తరగతి విద్యార్థులు చదువుతున్నారు. కొత్త భవనం నిర్మించాలని గ్రామస్థులు కోరుతున్నారు. వానాకాలం ఎలాంటి పరిస్థితులు ఎదుర్కోవాల్సి వస్తుందోనని తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు.
దహెగాంలోని మండల విద్యా వనరుల కేంద్ర భవనంలో.. వర్షం పడితే ఉరుస్తూ ఇబ్బంది కలిగిస్తోంది. గోడల నుంచి వర్షం నీరు దిగి తడిగా మారుతున్నాయి.
 సిర్పూర్‌(టి)లో తహసీల్దార్‌ కార్యాలయ దస్త్రాలను ఓ శిథిలావస్థ భవనంలో ఉంచారు. వర్షానికి భవనం కూలితే దస్త్రాలు పాడైపోయే ప్రమాదం ఉంది.

వాంకిడి తహసీల్దార్‌ కార్యాలయం

వాంకిడి తహసీల్దార్‌ కార్యాలయం 40ఏళ్ల కిందట నిర్మించారు. భవనం శిథిలావస్థకు చేరినా.. కొత్త భవనం లేక భయం భయంగా ఉద్యోగులు విధులు నిర్వహిస్తున్నారు. లోపలి గోడలు పెచ్చులూడాయి. నిత్యం వివిధ పనులపై ప్రజలు ఇక్కడికి వస్తుంటారు. ఎప్పుడు ఎలాంటి వార్త వినాల్సి వస్తుందోనని జంకుతున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు

https://assets.eenadu.net/eeimages//featureimages/365X255/124124709-365X255.jpg మరిన్ని