logo

బస్సు ప్రయాణం.. ప్రయాసల మయం

ఓవైపు అడుగుతీసి వేయనంతగా రద్దీ మరోవైపు బస్సులకోసం గంటల తరబడి వేచి చూడాల్సిన దుస్థితిని నిత్యం జిల్లావాసులు ఎదుర్కొంటున్నారు.

Published : 03 Jul 2024 03:40 IST

రద్దీ.. అసౌకర్యాలతో హడలిపోతున్న జనం
ఈనాడు, ఆసిఫాబాద్‌

సాయంత్రం 4గంటల సమయంలో మంచిర్యాలలో ఆసిఫాబాద్‌ వైపు వెళ్లే ప్లాట్‌ఫాం వద్ద ప్రయాణికుల నిరీక్షణ

ఓవైపు అడుగుతీసి వేయనంతగా రద్దీ మరోవైపు బస్సులకోసం గంటల తరబడి వేచి చూడాల్సిన దుస్థితిని నిత్యం జిల్లావాసులు ఎదుర్కొంటున్నారు. ఉదయం, సాయంత్రం వేళల్లో బస్టాండ్లు రణరంగంగా మారుతున్నాయి. ఇతరప్రాంతాలనుంచి వచ్చే బస్సులు పక్కకు నిలిపి ఉంచిన సమయంలోనే ప్రయాణికులతో నిండిపోతున్నాయి. ఇక ప్లాట్ఫామ్‌ వద్దకు వచ్చాక అంతే సంగతులు. పది, ఇరవై కిలోమీటర్ల మేర వెళ్లాల్సిన దూరానికి సైతం గంటల కొద్దీ నిరీక్షించాల్సిన పరిస్థితి. ఆసిఫాబాద్‌ నుంచి ప్రయాణమంటేనే వామ్మో అని అనాల్సి వస్తోంది.

నిజాం కాలంలో 1932లో ఇక్కడ బస్సు డిపోను ఏర్పాటు చేశారు. ఇంగ్లాండ్‌ నుంచి తెప్పించిన మూడు బస్సులు ఇక్కడి నుంచి కరీంనగర్, వరంగల్, హైదరాబాద్‌కు రాకపోకలు సాగించేవి. ఘన చరిత్ర కలిగిన ఆసిఫాబాద్‌ డిపో నుంచి బయలుదేరే బస్సులతో నేడు ప్రయాణికులు అవస్థలు పడుతున్నారు. ప్రస్తుతం డిపోలో 83 బస్సులు ఉండగా.. నెలకు దాదాపు 25 వేల మంది రాకపోకలు సాగిస్తున్నారు. దాదాపు రూ.18.65 లక్షల ఆదాయం సమకూరుతోంది. 14 సూపర్‌ లగ్జరీ బస్సులు ఉండగా, 6 మాత్రమే ఎక్స్‌ప్రెస్‌లు.

ఉదయం, సాయంత్రం వేళల్లో చుక్కలే..

మహాలక్ష్మి పథకంతో బస్సుల్లో ప్రయాణించే మహిళల సంఖ్య పెరిగింది. అయితే పరిమితికి మించి ఎక్కడంతో కొన్ని స్టేజీల్లో ఇవి నిలపకుండా వెళ్లే పరిస్థితి ఉంది. ముఖ్యంగా ఉదయం, సాయంత్రం వేళల్లో రద్దీ విపరీతం. చంటి పిల్లలతో తల్లులు, వృద్ధులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పాఠశాలల నుంచి వచ్చే విద్యార్థులు, ఉద్యోగులు ఒకేసారి రావడంతో.. ఈ సమయాల్లో బస్సు ఎక్కాలంటేనే సాధారణ ప్రజలు హడలిపోతున్నారు. రద్దీకి అనుగుణంగా సర్వీసుల సంఖ్య పెంచాలని జిల్లావాసులు కోరుతున్నారు.

చుట్టూ తిరగాల్సిందే..

ఆసిఫాబాద్‌ నుంచి మంచిర్యాల (65 కి.మీ.) ప్రయాణం సైతం చమటలు పట్టిస్తోంది. రెండు గంటలకు పైగానే ప్రయాణం సాగుతోంది. ఇందులో బెల్లంపల్లి బైపాస్‌ మీదుగా వెళితే అరగంట సమయం మిగులుతోంది. కానీ పట్టణం లోపలికి, బస్టాండ్‌ నుంచి వెళ్తుండటంతో సమయం పెరుగుతోంది. ముఖ్యంగా ఉద్యోగులు, కళాశాల నుంచి వచ్చే విద్యార్థుల కోసం మంచిర్యాల-ఆసిఫాబాద్‌ రెండు, మూడు స్టాప్‌లతో, బెల్లంపల్లికి వెళ్లకుండా నేరుగా వెళ్లేలా సర్వీసులు నడపాలనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

ఉగ్గబట్టుకోవాల్సిందే..

ఆసిఫాబాద్‌ నుంచి ఆదిలాబాద్‌ 140 కిలోమీటర్ల దూరం ఉంటుంది. ఆసిఫాబాద్‌ నుంచి ఉట్నూరుకు 70 కి.మీ. బస్సు ప్రయాణానికి దాదాపు రెండు, రెండున్నర గంటల సమయం పడుతోంది. మార్గమధ్యలో కెరమెరి, జైనూర్‌ మండల కేంద్రాలు ఉన్నా.. ఎక్కడా ప్రజా శౌచాలయాలు, మరుగుదొడ్లు లేవు. కొన్ని సర్వీసులు ఉట్నూరు బస్టాండ్‌కు వెళ్లకుండా నేరుగా ఆదిలాబాద్‌కు వెళ్తుంటాయి. ఈక్రమంలో సుమారుగా నాలుగు లేదా అయిదు గంటలు ఒంటికి, రెంటికి ఉగ్గబట్టుకోవాల్సిన పరిస్థితి ప్రయాణికులది. ముఖ్యంగా మహిళలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. నిత్యం 1500-2000 మంది ఈ మార్గంలో రాకపోకలు సాగిస్తుంటారు. ప్రజా ప్రతినిధులు స్పందించి ఉట్నూర్‌ కూడలి వద్ద లేదా, జైనూర్, కెరమెరి మండలాల్లో మరుగుదొడ్లు ఏర్పాటు చేయాలని కోరుతున్నారు.

విద్యార్థుల కోసం కొన్ని సర్వీసులు కేటాయించాం

పాఠశాలలకు వెళ్లే విద్యార్థుల కోసం కొన్ని సర్వీసులను నడుపుతున్నాం. రద్దీ మార్గాల్లో సర్వీసులను పెంచేలా చూస్తాం. ఆసిఫాబాద్‌-మంచిర్యాల నేరుగా వెళ్లే బస్సులను సైతం రద్దీకి అనుగుణంగా ప్రవేశపెడతాం.

విశ్వనాథ్, డిపో మేనేజర్‌ 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని