logo

నిరంతరాయం.. ఆరోగ్య సాయం

సర్కారు ఆసుపత్రికి వచ్చే గర్భిణులు, వీరికి సేవలు అందించే సిబ్బందికి మధ్య వారధిగా ఉండేందుకు జిల్లా తొలి పాలనాధికారిగా పనిచేసిన ఆర్వీ కర్ణన్‌ హెల్ప్‌డెస్క్‌ను ఏర్పాటు చేశారు.

Updated : 03 Jul 2024 05:50 IST

  ‘సర్కారు’లో ప్రసవాలు పెంచేందుకు కృషి 

గర్భిణి వివరాలు సేకరిస్తున్న హెల్ప్‌ డెస్క్‌ సిబ్బంది

మంచిర్యాల వైద్యవిభాగం, న్యూస్‌టుడే సర్కారు ఆసుపత్రికి వచ్చే గర్భిణులు, వీరికి సేవలు అందించే సిబ్బందికి మధ్య వారధిగా ఉండేందుకు జిల్లా తొలి పాలనాధికారిగా పనిచేసిన ఆర్వీ కర్ణన్‌ హెల్ప్‌డెస్క్‌ను ఏర్పాటు చేశారు. ఆయన బదిలీ అయినా ఆరేళ్లుగా ఇది నిర్విరామంగా కొనసాగుతోంది. మధ్యలో ఒక వైద్యాధికారి దీన్ని నిర్లక్ష్యం చేసినా.. ఇటీవల తిరిగి పుంజుకుంది. మాతాశిశు సంరక్షణ కేంద్రం(ఎంసీహెచ్‌) లోపలికి రాగానే ఎదురుగా కనిపిస్తూ బాధితులకు అవసరమైన సేవలు అందిస్తున్నారు. కుమురం భీం ఆసిఫాబాద్, మంచిర్యాల జిల్లాలకు సంబంధించిన గర్భిణులకు దీనిద్వారా ఎంతో మేలు కలుగుతోంది.

మంచిర్యాలలోని ఎంసీహెచ్‌లో 24 గంటలపాటు మూడు షిఫ్టుల్లో ముగ్గురు వైద్యశాఖకు సంబంధించిన ఆరోగ్య సహాయకులు(ఎంపీహెచ్‌ఏ) అందుబాటులో ఉంటారు. జిల్లాలోని గర్భిణుల వివరాలు సేకరించి.. ఏ నెలలో.. ఏ రోజు ఎవరి ప్రసవం ఉందో తెలుసుకుని ఎప్పటికప్పుడు అప్రమత్తం చేస్తుంటారు. బాధిత వ్యక్తి ప్రైవేటుకు వెళ్లాలని ఆసక్తి చూపించినా ఆమెతోపాటు కుటుంబసభ్యులను సంప్రదించి సర్ది చెబుతారు. సర్కారు సేవలపై నమ్మకం కలిగించేలా భరోసా ఇస్తారు. బాధితులకు చికిత్స పరంగా అసౌకర్యం కలుగుతుందని సమాచారం అందిస్తే వెంటనే వీరికి, సిబ్బందికి మధ్య వారధిగా మారి పరిష్కరించేందుకు ప్రయత్నిస్తారు.

గర్భిణుల ఆరోగ్యంపై ప్రత్యేక దృష్టి

రెండు జిల్లాల్లోని పీహెచ్‌సీల పరిధిలోని గర్భిణులు మూడు, నాలుగు నెలల్లో తప్పనిసరిగా వైద్యులను సంప్రదించాలి. ఆ సమయంలో వారు పలు రకాల రక్త పరీక్షలు చేసుకోవాలి. బాధితుల పరీక్ష ఫలితాలను సేకరిస్తారు. హెచ్‌బీ(హిమోగ్లోబిన్‌) శాతాన్ని గుర్తించి తక్కువగా ఉంటే అందుకు తగ్గట్లుగా చర్యలు చేపడతారు. రక్తం తక్కువగా ఉన్నవారి వివరాలు తీసుకుని బాధితురాలి పరిధి ఆశా కార్యకర్తలకు సమాచారం ఇస్తారు. తీసుకోవాల్సిన జాగ్రత్తలు, మందులు అందించేందుకు కృషి చేస్తారు. తీవ్రత ఎక్కువగా ఉంటే ఆసుపత్రిలోనే చేర్పిస్తారు. ప్రసవ సమయంలోనూ రక్తహీనత ఉంటే అప్రమత్తమై కుటుంబసభ్యులకు, రక్తనిధి కేంద్రాలకు సమాచారం అందిస్తారు. ఆసుపత్రిలో హెల్ప్‌ డెస్క్‌కు ప్రత్యేక క్యాబిన్‌తో పాటు మరొకరి నియామకం చేపడితే సేవలు మరింత మెరుగుపడతాయి.

నెన్నెలకు చెందిన ఓ గర్భిణి ప్రసవానికి ఎంసీహెచ్‌కు వచ్చారు. చేరి అయిదు రోజులు అవుతున్నా వైద్యులు, సిబ్బంది పట్టించుకోకపోవడంతో ప్రైవేటుకు వెళ్లిపోతామంటూ ఆశా కార్యకర్త, ఏఎన్‌ఎంకు సమాచారం అందించారు. ఆ సిబ్బంది ఇక్కడి హెల్ప్‌ డెస్క్‌ సహాయకులకు తెలుపగా వెంటనే స్పందించి వైద్యురాలు, సిబ్బందితో మాట్లాడించారు. ప్రసవం పరిస్థితిని వివరించి సర్దిచెప్పించారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని