logo

ఏటీఎంల నుంచి రూ. 1.25 కోట్ల చోరీ

కంచే చేను మేసినట్లుగా విధులు నిర్వర్తిస్తున్న సంస్థనే మోసం చేసి ఏకంగా రూ. 1.25 కోట్లు అపహరించుకుపోయిన ఘటన మంచిర్యాల జిల్లా కేంద్రంలో చోటుచేసుకుంది.

Updated : 03 Jul 2024 05:51 IST

వివరాలు వెల్లడిస్తున్న మంచిర్యాల ఏసీపీ ప్రకాష్, పక్కన సీఐ బన్సీలాల్‌ 

మంచిర్యాలనేరవిభాగం, న్యూస్‌టుడే: కంచే చేను మేసినట్లుగా విధులు నిర్వర్తిస్తున్న సంస్థనే మోసం చేసి ఏకంగా రూ. 1.25 కోట్లు అపహరించుకుపోయిన ఘటన మంచిర్యాల జిల్లా కేంద్రంలో చోటుచేసుకుంది. మంగళవారం ఏసీపీ ప్రకాష్‌ వెల్లడించిన వివరాల ప్రకారం.. దండేపల్లి మండలం నెల్కివెంకటాపూర్‌కు చెందిన బోడకుంట మోహన్, సీసీసీ నస్పూర్‌ హౌజింగ్‌బోర్డు కాలనీకి చెందిన రేణిగుంట్ల పూర్ణచందర్‌లు గత కొన్ని సంవత్సరాలుగా సీఎంఎస్‌ కంపెనీ కరీంనగర్‌ శాఖలో విధులు నిర్వర్తిస్తున్నారు. వీరు రోజూ జిల్లాలోని ఎస్‌బీఐ బ్యాంకుల నుంచి డబ్బులు తీసుకుని 29 ఏటీఎంలలో నగదు జమ చేస్తుంటారు. ప్రతి నెలకోసారి బ్యాంకు అధికారులు ఏటీఎంలలో అడిటింగ్‌ చేస్తుంటారు. ఆరునెలల్లో మోహన్, పూర్ణచందర్‌లు ఏటీఎంల నుంచి పలుమార్లు రూ. 1.25 కోట్లు తీసుకొని సరిసమానంగా పంచుకుంటూ వస్తున్నారు. ఇదివరకు ఏటీఎంలలో ఉన్న నగదు తక్కువ మొత్తంలో చూపకుండా ఒకదాని నుంచి మరోదానికి మారుస్తూ వస్తున్నారు. గతనెల 26న ఏటీఎంలలో అడిటింగ్‌ జరగడంతో పెద్దమొత్తంలో డబ్బులు మార్చడానికి వీలు లేకపోవడంతో నిందితులిద్దరూ తమ సెల్‌ఫోన్‌లను స్విచ్ఛాప్‌ చేసి పరారయ్యారు. అనుమానం వచ్చిన బ్యాంకు అధికారులతో పాటు సీఎంఎస్‌ కంపెనీ కరీంనగర్‌ బ్రాంచి మేనేజర్‌ శ్రీనివాస్‌లు పోలీసులను ఆశ్రయించారు. వారి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. మంగళవారం నిందితులు మంచిర్యాల బస్టాండుకు వచ్చినట్లు నమ్మదగిన సమాచారం రావడంతో వారిని అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి రూ. 50వేల నగదుతో పాటు ప్రామిసరి నోట్లు, చెక్కులు, బాండ్లు స్వాధీనం చేసుకొని రిమాండ్‌కు తరలించినట్లు ఏసీపీ పేర్కొన్నారు. నిందితులు కాజేసిన సొమ్ముతో జల్సాలు, విలాసాలకు వాడినట్లు విచారణలో తేలిందన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని