logo

చైతన్యంతోనే సర్కారు బడి సాకారం

 సర్కారు బడుల బలోపేతం కోసం ప్రభుత్వం, పాఠశాల విద్యాశాఖ ప్రత్యేకత కనబరుస్తోంది. అమ్మ ఆదర్శ కమిటీల నేతృత్వంలో కనీస మౌలిక వసతులు కల్పించేందుకు చర్యలు చేపట్టింది.

Published : 03 Jul 2024 03:23 IST

ముగిసిన పదోన్నతులు, బదిలీలు.. ప్రవేశాలపై ప్రత్యేకత చూపితే సత్ఫలితాలు
నిర్మల్‌ అర్బన్, న్యూస్‌టుడే

ప్రతిజ్ఞ చేస్తున్న ఉపాధ్యాయులు, అంగన్‌వాడీ టీచర్లు, విద్యార్థులు, తదితరులు (పాతచిత్రం)

 సర్కారు బడుల బలోపేతం కోసం ప్రభుత్వం, పాఠశాల విద్యాశాఖ ప్రత్యేకత కనబరుస్తోంది. అమ్మ ఆదర్శ కమిటీల నేతృత్వంలో కనీస మౌలిక వసతులు కల్పించేందుకు చర్యలు చేపట్టింది. పలు చోట్ల పనులు పూర్తవ్వగా, కొన్ని చివరి దశలో ఉన్నాయి. ఆచార్య జయశంకర్‌ బడిబాట కార్యక్రమాన్ని సర్కారు ఏటా విద్యాసంవత్సరం ప్రారంభంలో నిర్వహిస్తుంది. ఈ నేపథ్యంలో ఈ ఏడాది గత నెల 6-19 తేదీల్లో చేపట్టారు. అదే దశలో ఉపాధ్యాయుల పదోన్నతులు, బదిలీలు ఉండడంతో కొన్ని అవాంతరాలు ఎదురయ్యాయి. పూర్తి స్థాయిలో నిమగ్నం చేయలేకపోయారు. గత ఏడాదితో పోల్చితే ప్రవేశాల సంఖ్య కొంత మెరుగైనా.. మరింత ప్రత్యేకతతో అవగాహన, చైతన్యం తీసుకొస్తే పిల్లల సంఖ్య పెరిగే అవకాశాలున్నాయి.

ఓ వైపు బడిబాట.. మరోవైపు పదోన్నతులు, బదిలీలు

ఎస్జీటీ తత్సమాన అర్హత కలిగిన వారికి పీఎస్‌ హెచ్‌ఎం, స్కూల్‌ అసిస్టెంట్, పీడీలుగా పదోన్నతులు, బదిలీలను గత నెల 20 తేదీ వరకు పూర్తి చేశారు. తాజాగా ఎస్జీటీ, భాషాపండితులు, పీఈటీల బదిలీలు ముగిశాయి. బడిబాట కార్యక్రమం సమయంలోనే ఈ ప్రక్రియ చేపట్టడంతో కొంత అంతరాయం నెలకొంది. కార్యక్రమంపై పూర్తి స్థాయి దృష్టి పెట్టలేకపోయారు. బదిలీలు, పదోన్నతులు ముగియడంతో సంబంధిత ఉపాధ్యాయులు ప్రత్యేకత కనబరిస్తే మరింత మంది పిల్లలు సర్కారు బడి వైపు అడుగులు వేసే అవకాశం ఉంది.

కొంత మెరుగు..

ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలలు 2,847 ఉన్నాయి. గత విద్యాసంవత్సరం జూన్‌ 3 నుంచి జులై 6 వరకు నమోదు, రోజువారీ కార్యక్రమాలు, కొనసాగింపు, రెండో విడత బడిబాట చేపట్టారు. 2023-24 సంవత్సరంతో పోల్చితే ఈ ఏడాది ప్రవేశాలు కొంత మెరుగయ్యాయి. నిర్మల్‌ జిల్లాలో గత ఏడాది 4,756 మంది పిల్లలు ప్రవేశం పొందారు. ఈ విద్యా సంవత్సరం ఇప్పటి వరకు 5,321 మంది చేరారు. మిగతా జిల్లాల్లోనూ ప్రవేశాలు ఆశించిన స్థాయిలో వచ్చాయి. ఇదే స్ఫూర్తితో ఉపాధ్యాయులు సంబంధిత పాఠశాలల్లో కొత్తగా చేరిన సందర్భంలో మరింత దృష్టి సారిస్తే బడులు బలోపేతం కావడంతోపాటు, పిల్లలందరికీ సర్కారు విద్య అందే అవకాశం ఉంది. ఆ దిశగా ప్రతి ఒక్కరూ ముందుకు సాగితే సత్ఫలితాలు సాధించవచ్చని పలువురు పేర్కొంటున్నారు.

ప్రవేశాల సంఖ్య పెంచేలా ప్రత్యేక శ్రద్ధ

ఎంఈవోలు, కాంప్లెక్స్, సంబంధిత పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, స్థానికుల సహకారంతోపాటు స్వయం సహాయక సంఘ సభ్యులు ఇలా అందరి సమన్వయంతో పిల్లలందరికీ సర్కారు విద్య అందించేందుకు ప్రత్యేక శ్రద్ధ కనబరుస్తున్నాం. గత ఏడాదితో పోల్చితే కొంత మెరుగయ్యాయి. మరింత పెంచేలా ప్రత్యేకత చూపేలా ఇప్పటికే సూచనలు ఇచ్చాం.

ఎ.రవీందర్‌రెడ్డి, జిల్లా విద్యాధికారి, నిర్మల్‌

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు