logo

పరిశోధనలకు వారధి.. విజ్ఞాన్‌ మంథన్‌

కేంద్ర ప్రభుత్వ సంస్థ ఎన్‌సీఈఆర్‌టీ, డీఎస్‌టీ సంయుక్తంగా దేశవ్యాప్తంగా ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల్లో ఆరో తరగతి నుంచి ఇంటర్మీడియట్‌ ప్రథమ సంవత్సరం చదువుతున్న విద్యార్థులకు ఆన్‌లైన్‌లో విద్యార్థి విజ్ఞాన్‌ మంథన్బ్‌వీవీఎం్శ విజ్ఞాన శాస్త్రం ప్రతిభాన్వేషణ పరీక్ష ఏటా నిర్వహిస్తోంది.

Updated : 03 Jul 2024 05:52 IST

ఆరు నుంచి ఇంటర్‌ విద్యార్థులకు అవకాశం

మంచిర్యాల విద్యావిభాగం, న్యూస్‌టుడే: కేంద్ర ప్రభుత్వ సంస్థ ఎన్‌సీఈఆర్‌టీ, డీఎస్‌టీ సంయుక్తంగా దేశవ్యాప్తంగా ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల్లో ఆరో తరగతి నుంచి ఇంటర్మీడియట్‌ ప్రథమ సంవత్సరం చదువుతున్న విద్యార్థులకు ఆన్‌లైన్‌లో విద్యార్థి విజ్ఞాన్‌ మంథన్బ్‌వీవీఎం్శ విజ్ఞాన శాస్త్రం ప్రతిభాన్వేషణ పరీక్ష ఏటా నిర్వహిస్తోంది. తరగతి గదిలో నిత్యం పుస్తకాలతో కుస్తీ పట్టే విద్యార్థుల దృష్టిని పరిశోధన, ప్రయోగాల రంగాల వైపు మళ్లించే లక్ష్యంగా కేంద్రం ప్రభుత్వం పలు ప్రత్యేక కార్యక్రమాలు అమలు చేస్తోంది. వీవీఎం పరీక్షకు ప్రస్తుతం 202425 విద్యాసంవత్సరానికి గానూ దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభం కాగా సెప్టెంబరు 15 వరకు అవకాశముంది.

పాఠశాల నుంచి జాతీయ స్థాయిలో

వీవీఎంలో పాల్గొనేందుకు ఆసక్తి ఉన్న విద్యార్థులు రూ. 200 చెల్లించి సంబంధిత వెబ్‌సైట్‌లో సెప్టెంబరు 15 వరకు దరఖాస్తు చేసుకోవాలి. సీనియర్, జూనియర్‌ విభాగాల్లో పాఠశాల, జిల్లా, రాష్ట్ర, జాతీయ స్థాయిలో పరీక్షలు ఉంటాయి. సెప్టెంబరు 1న నమూనా పరీక్ష నిర్వహిస్తారు. అక్టోబరు 23, 27 తేదీల్లో జిల్లా స్థాయి పరీక్షలు నిర్వహించి నవంబరు 15న ఫలితాల ప్రకటిస్తారు. డిసెంబరు 8, 15, 22 తేదీల్లో రాష్ట్ర స్థాయి పోటీలు, 2025 మే 17 లేదా 18 తేదీన జాతీయ స్థాయిలో పరీక్ష ఉంటుంది.

ప్రతిభావంతులకు ఉపకారం

పాఠశాల స్థాయి పోటీల్లో ప్రతి తరగతి నుంచి ప్రతిభ చూపిన మొదటి ముగ్గురు చొప్పున 18 మందిని ఒక్కో పాఠశాల నుంచి జిల్లా స్థాయి పోటీలకు ఎంపిక చేస్తారు. ప్రతి తరగతి నుంచి 20 మందికి రాష్ట్ర స్థాయి పోటీల్లో పాల్గొనే అవకాశం కల్పిస్తారు. ఇందులో ప్రతి తరగతి నుంచి ముగ్గురు చొప్పున 18 మంది రాష్ట్ర స్థాయిలో విజేతలుగా ఎంపిక చేస్తారు. వీరికి ధ్రువపత్రంతో పాటు జ్ఞాపిక రూ. 5 వేలు, రూ. 3 వేలు, రూ. 2 వేల చొప్పున ప్రోత్సాహకం అందిస్తారు. రాష్ట్ర స్థాయిలో ప్రథమ, ద్వితీయ స్థానాల్లో నిలిచిన విద్యార్థులు జాతీయ స్థాయిలో పాల్గొనే అవకాశముంటుంది. మొదటి మూడు స్థానాల్లో విజేతలుగా నిలిచిన వారికి రూ. 25వేలు, రూ. 15వేలు, రూ.10వేల చొప్పున అందుతాయి. దీంతో పాటు భాస్కర స్కాలర్‌షిప్‌ పేరిట ఏడాది పాటు నెలకు రూ. 2వేల చొప్పున ఉపకార వేతనం ఇస్తారు. జాతీయ ప్రఖ్యాత పరిశోధన సంస్థలను సందర్శించే అవకాశం కల్పిస్తారు. దీనిపై అవగాహన లేకపోవడంతో చాలా మంది విద్యార్థులు సద్వినియోగం చేసుకోవడం లేదు. ఈ విద్యాసంవత్సరమైనా ఉపాధ్యాయులు ప్రత్యేక చొరవ తీసుకుంటే విద్యార్థులకు మేలు కలగనుంది.

పరీక్ష ఇలా..

విద్యార్థులకు వంద బహుళైచ్చిక ప్రశ్నలతో ఆన్‌లైన్‌ విధానంలో పరీక్ష నిర్వహిస్తారు. సామాన్య, గణితం, పుస్తకాల్లోని అంశాలు 50శాతం, విజ్ఞానశాస్త్రం రంగంలో భారతదేశ కృషిపై 20 శాతం, శాస్త్రవేత్తల జీవిత చరిత్రపై 20 శాతం మార్కులు ఉంటాయి. ఇక లాజిక్, రీజనింగ్‌లో 10 శాతం ప్రశ్నలపై పరీక్ష ఉంటుంది. పరీక్షకు సన్నద్ధమయ్యేందుకు వెబ్‌సైట్‌లో పుస్తకాలు అందుబాటులో ఉంచారు.

ఉమ్మడి జిల్లాలో ఇలా..

ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలు: 4773
జూనియర్‌ కళాశాలలు: 235
6 నుంచి ఇంటర్‌ విద్యార్థులు: 2.35లక్షలు

సద్వినియోగం చేసుకోవాలి

వీవీఎం పోటీల్లో ప్రతిభ చాటిన వారికి ప్రోత్సాహకాలు అందనున్నాయి. ఆయా పాఠశాలల ఉపాధ్యాయులు విద్యార్థులు పాల్గొనేలా చొరవ చూపాలి. విద్యార్థులు ఈ ప్రతిభాన్వేషణ పరీక్షను సద్వినియోగం చేసుకోవాలి. సందేహాలకు 9849550200ను సంప్రదించవచ్చు.

ఎస్‌.మధుబాబు, జిల్లా సైన్స్‌ అధికారి మంచిర్యాల

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని