logo

నటుడిగా మొదలై..నిర్మాతగా ఎదిగి

ప్రస్తుతం ఏదైనా ఒక రంగంలో రాణించాలంటేనే ఎన్నో సవాళ్లు, ఒత్తిళ్లు ఉంటాయి. ఇలాంటి తరుణంలో ఎవరి తోడ్పాటు లేకుండా సినిమా పరిశ్రమలో విభిన్న రంగాల్లో రాణిస్తున్నారు.

Updated : 03 Jul 2024 05:55 IST

సినిమా రంగంలో ఆదిలాబాద్‌ జిల్లా వాసి
‘మా ఊరి పొలిమేర’ సినిమాతో అందరి దృష్టి
 జైనథ్, న్యూస్‌టడే

పొలిమేర చిత్ర యూనిట్‌తో నిర్మాత గౌరీ కృష్ణ 

ప్రస్తుతం ఏదైనా ఒక రంగంలో రాణించాలంటేనే ఎన్నో సవాళ్లు, ఒత్తిళ్లు ఉంటాయి. ఇలాంటి తరుణంలో ఎవరి తోడ్పాటు లేకుండా సినిమా పరిశ్రమలో విభిన్న రంగాల్లో రాణిస్తున్నారు. ఆ యువకుడే ఆదిలాబాద్‌ జిల్లా జైనథ్‌ మండలం ఆనంద్‌పూర్‌(బహదూర్‌పూర్‌) గ్రామానికి చెందిన గౌరీ కృష్ణ. సహనటుడిగా, విలన్‌గా, క్యారెక్టర్‌ ఆర్టిస్టుగా, పంపిణీదారుగా, నిర్మాతగా చలనచిత్ర రంగంలో  ఆయన ప్రస్థానం నిర్విరామంగా కొనసాగుతోంది.

ఆనంద్‌పూర్‌కు చెందిన గౌరు రమేష్‌ విశ్రాంత ప్రధానోపాధ్యాయుడు. భార్య లలిత గృహిణి. వీరికి ఇద్దరు సంతానం. చిన్న కుమారుడు నవనీత్‌ సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌ కాగా పెద్ద కుమారుడు గౌరు కృష్ణ సినిమా రంగంలో రాణిస్తున్నారు. ఈయనకు భార్య రుద్వి, కొడుకు గణబాబు ఉన్నారు. కృష్ణ ప్రాథమిక, ఉన్నత విద్యాభ్యాసం ఆదిలాబాద్‌ పట్టణంలో కొనసాగింది. కరీంనగర్‌లో ఇంటర్‌ చదివారు. హైదరాబాద్‌లో బీటెక్‌ పూర్తిచేశారు. సినిమాల్లో నటించాలన్న కోరిక మనసులో బలంగా నాటుకోవడంతో ఫిల్మ్‌నగర్‌ బాట పట్టారు. ఏడేళ్ల పాటు ఇలా తిరిగిన ఆయన చిత్ర పరిశ్రమలో ఏర్పడిన పరిచయాలతో సినిమారంగ ప్రవేశం చేసి తనదైన ప్రత్యేకతను చాటుకున్నారు.  

 మలయాళంలో నిర్మించిన బర్న్‌ చిత్రం పోస్టర్‌ 

ముందడుగు..

ఒక వైపు తన నటనతో అలరిస్తూనే మరో వైపు చిత్ర నిర్మాణం వైపు అడుగేశారు. శ్రీ కృష్ణ క్రియేషన్స్‌ బ్యానర్‌ను 2015లో ఏర్పాటు చేశారు. ప్రముఖ దర్శకుడు రాంగోపాల్‌ వర్మతో ‘కిల్లింగ్‌ వీరప్పన్‌’ సినిమాను నిర్మించి నిర్మాతగా తన అదృష్టాన్ని పరీక్షించుకున్నారు. అప్పటి నుంచి గౌరు కృష్ణ కాస్త గౌరీ కృష్ణగా తన పేరును మార్చుకున్నాడు. యువ హీరో నటించిన ‘గరం’ సినిమాకు పంపిణీదారుగా వ్యవహరించి మరో సారి అదృష్టాన్ని తన ఖాతాలో వేసుకున్నాడు. ఇటీవల సత్యం రాజేష్‌తో మా ఊరి పొలిమేర-2, చిత్రాన్ని నిర్మించారు. ఆ చిత్రం విజయవంతం కావడంతో ఆయనకు సినీ పరిశ్రమలో మంచి గుర్తింపును తీసుకొచ్చి పెట్టింది. ఆ చిత్రాన్ని ‘దాదాసాహెబ్‌ పాల్కే’ ఫిల్మ్‌ ఫెస్టివల్‌లో ప్రదర్శించారు. చిత్ర హీరోయిన్‌ కామాక్షి భాస్కర్ల ఉత్తమ నటి జ్యూరీ అవార్డు సొంతం చేసుకోగా ఎక్స్‌లెన్స్‌ సర్టిఫికెట్‌ను చిత్ర నిర్మాత గౌరీ కృష్ణ, దర్శకుడు అనిల్‌ విశ్వనాథ్‌ అందుకున్నారు. పట్టు వదలకుండా లక్ష్యంతో ముందుకెళ్తే విజయం సాధ్యమవుతుందని కృష్ణ అన్నారు.

సహాయ నటుడి పాత్రలతో

మొదట క్యారెక్టర్‌ ఆర్టిస్టు పాత్రలకు ప్రాధాన్యం ఇచ్చిన కృష్ణ క్రమంగా విభిన్న పాత్రలను పోషించారు. ‘ప్రేమ ఒక మైకం’ సినిమాలో హీరోయిన్‌ ఛార్మి స్నేహితుడిగా గుర్తింపు తెచ్చే పాత్రను.. యువ హీరో అజయ్‌ నటించిన ‘ఎంత అందంగా ఉన్నావే’ సినిమాలో విలన్‌ పాత్రను పోషించి తనలో దాగి ఉన్న నటనను బయటకు తీశారు. హీరో నితిన్‌ నటించిన చినదాన నీకోసం, హీరో గోపీచంద్‌ నటించిన లౌక్యం సినిమాల్లో క్యారెక్టరు ఆర్టిస్టు పాత్రలతో ఒదిగి అందరినీ మెప్పించారు. అంతకుముందు డైరీ, తాజ్‌మహల్, చండీ, ప్రతినిధి, పోలీస్‌ గేమ్, హైదరాబాద్‌ లవ్‌స్టోరీ చిత్రాల్లో నటించి తన ప్రతిభను చాటారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని