logo

కళాశాల అభివృద్ధికి గ్రామస్థుల చేయూత

కుంటాలకు ప్రభుత్వం గతేడాది నూతన జూనియర్‌ కళాశాలను మంజూరు చేసింది. కాస్త ఆలస్యంగా ఉత్తర్వులు రావడంతో కళాశాలను తాత్కాలిక సిబ్బందితో నెట్టుకొచ్చారు.

Published : 03 Jul 2024 03:12 IST

విద్యార్థులకు పాఠ్య, రాత పుస్తకాలు అందజేస్తున్న డీఐఈఓ పరశురాం

కుంటాల, న్యూస్‌టుడే: కుంటాలకు ప్రభుత్వం గతేడాది నూతన జూనియర్‌ కళాశాలను మంజూరు చేసింది. కాస్త ఆలస్యంగా ఉత్తర్వులు రావడంతో కళాశాలను తాత్కాలిక సిబ్బందితో నెట్టుకొచ్చారు. కళాశాల అభివృద్ధికి గ్రామస్థులు, విద్యావంతులు ప్రైవేటుకు దీటుగా తమవంతు కృషి చేస్తున్నారు. పదో తరగతి వార్షిక పరీక్ష ఫలితాలు వెలువడినప్పటి నుంచి ప్రక్రియ చేపట్టారు. ప్రభుత్వ ఆశయం మేరకు విద్యార్థుల సంఖ్య పెంచాలనే ఉద్దేశంతో ఈ ఏడాది గ్రామస్థులందరూ సమన్వయంతో కృషి చేశారు. ఉద్యోగులు, విద్యావంతులు, గ్రామస్థులను భాగస్వాములను చేస్తూ కళాశాల అభివృద్ధి సమితిని ఏర్పాటు చేశారు.

ఉచిత బోధన .. ఇప్పటి వరకు ప్రభుత్వం అధ్యాపకులను నియమించ లేదు. వివిధ గ్రామాలకు చెందిన అనుభవజ్ఞులైన విద్యావంతులు ఉచితంగా బోధించేందుకు ముందుకొచ్చారు. ఆయా అంశాలపై బోధన చేసేందుకు 10 మంది సిద్ధమయ్యారు. ఎలాంటి వేతనం లేకుండా ప్రభుత్వం అధ్యాపకులను నియమించే వరకు తాము బోధన చేస్తామని భరోసా కల్పించారు. బైపీసీ, ఎంఈసీ, హెచ్‌ఈసీ విభాగాల్లో తరగతులు కొనసాగుతున్నాయి. అధ్యాపకుల నియామకం విషయంలో ఇప్పటికే ఎమ్మెల్యే రామారావుపటేల్, జిల్లా పాలనాధికారికి విన్నవించగా రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కరిస్తామన్నారు.

దాతల చేయూత

ఉన్నత పాఠశాలలో అదనంగా ఉన్న తరగతి గదుల్లో తాత్కాలికంగా తరగతులను కొనసాగిస్తున్నారు. దాతలు కార్యాలయ సామగ్రి, పాఠ్య, రాత పుస్తకాలు, ఫ్యాన్లు, కంప్యూటర్, ఫర్నిచర్, బీరువా, ఇతరత్రా సామగ్రి అందజేశారు. ఇతర అవసరాల కోసం విరాళాలు సైతం సమకూరాయి. సైన్స్‌ విద్యార్థులకు అవసరమయ్యే ప్రయోగ పరికరాలు అందుబాటులో ఉన్నాయి. గతంలో ఆదర్శ పాఠశాలకు భూమి కొనుగోలు చేసినట్లే కళాశాలకు కూడా శాశ్వత భవన నిర్మాణానికి స్థల పరిశీలన జరిపి అవసరమైతే కొనుగోలు చేస్తామన్నారు. బస్సు సౌకర్యం లేని గ్రామాల విద్యార్థులకు బీసీ వసతి గృహంలో బాలురకు, ఆదర్శ పాఠశాల బాలికల వసతి గృహంలో బాలికలకు అవకాశం కల్పించాలని ఎమ్మెల్యే, పాలనాధికారులకు విజ్ఞప్తి చేశారు.

నర్సాపూర్‌(జి), కుంటాల, భైంసా మండలాల్లోని ఉన్నత పాఠశాలల పరిధిలో గల గ్రామాల్లో విస్తృతంగా ప్రచారం నిర్వహించారు. విద్యార్థుల సంఖ్యను పెంచుతూ సత్ఫలితాలు సాధించేందుకు బాధ్యతగా శ్రమించారు. ఇప్పటి వరకు సుమారుగా 50 మందికి 2024-25 విద్యా సంవత్సరానికి ప్రవేశాలు కల్పించారు. ప్రభుత్వం ప్రవేశాలకు జులై 31 వరకు గడువు పొడిగించడంతో మరింత మంది చేరే అవకాశముంది. గతంలో కళాశాల ఏర్పాటు ఆవశ్యకతను యువకులు, గ్రామస్థులు అప్పటి ఎమ్మెల్యే, పాలనాధికారికి సైతం విన్నవించి పలు సందర్భాల్లో దీక్షలు చేపట్టారు.

ఉన్నతంగా తీర్చిదిద్దుతాం

గతంలో భైంసా పట్టణంలోని ఓ కళాశాలలో బోధించా. స్వగ్రామంలో కళాశాల ఏర్పాటు చేశారని తెలిసింది. విద్యావంతులు ఉచితంగా బోధించేందుకు ముందుకొచ్చారనే విషయం తెలియగానే నేను సైతం అంగీకరించా. పేద విద్యార్థులకు ఉన్నతంగా తీర్చిదిద్దే అవకాశం లభించడంతో సంతోషించా.

గాజుల గోదావరి, ఎంఏ, బీఎడ్‌

చక్కటి అవకాశం

కల్లూరు కస్తూర్బా పాఠశాల వసతి గృహంలో ఉండి పదోతరగతి వరకు చదువుకున్నా. మాధ్యమిక విద్య చదవలేని పరిస్థితులు నెలకొన్నాయి. కళాశాల అభివృద్ధి సమితి సభ్యులు వచ్చి కుంటాల కళాశాలలో  తక్షణ ప్రవేశం కల్పించారు. మా గ్రామం నుంచి 4 కి.మీ. దూరంలోనే ఉండటంతో అదృష్టంగా భావించా. చదువు ముందుకు సాగుతుందనే భరోసా కలిగింది.

జయశ్రీ, విద్యార్థిని, రాయ్‌పాడ్‌ తండా

గ్రామస్థుల సహకారం బాగుంది

కళాశాల మంజూరు మొదలు ఇప్పటి వరకు గ్రామస్థుల సహకారం బాగుంది. అందరూ ముందుకు రావడం అభినందనీయం. ఇక్కడి పరిస్థితులను ఉన్నతాధికారులకు వివరిస్తా. రాబోయే రోజుల్లో కళాశాలను ప్రైవేటుకు దీటుగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తాం. కళాశాల నిర్వహణకు సమకూర్చి సామగ్రి, బోధకులు, విద్యార్థుల విషయంలో విద్యావంతుల ప్రోత్సాహమే సత్ఫలితాలు సాధించేలా చేసింది.

తుకారాం, ప్రిన్సిపల్‌

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని