logo

పర్యావరణ ప్రేమికులు

రాష్ట్ర ప్రభుత్వం ప్లాస్టిక్‌ వాడకం పూర్తిగా తగ్గించే దిశగా చర్యలు ప్రారంభించింది. జిల్లా యంత్రాంగం ఇందుకోసం నడుం బిగించింది.

Updated : 03 Jul 2024 05:55 IST

న్యూస్‌టుడే, ఆదిలాబాద్‌ పాలనాప్రాంగణం

రాష్ట్ర ప్రభుత్వం ప్లాస్టిక్‌ వాడకం పూర్తిగా తగ్గించే దిశగా చర్యలు ప్రారంభించింది. జిల్లా యంత్రాంగం ఇందుకోసం నడుం బిగించింది.ఆదిలాబాద్‌ కలెక్టర్‌ రాజర్షిషా  కలెక్టరేట్లో జరిగే సమావేశాల్లో ప్లాస్టిక్‌ బాటిళ్లు వాడకుండా కట్టడి చేశారు. ఇప్పుడు ఏ సమావేశం జరిగినా    అధికారుల ముందు స్టీలు బాటిళ్లు కనిపిస్తున్నాయి. ఇదే స్ఫూర్తితో ఇటీవల జడ్పీ సమావేశంలోనూ గాజుసీసాలు, కాగితపు గ్లాసులను వినియోగించారు. బుధవారం అంతర్జాతీయ ప్లాస్టిక్‌ రహిత దినోత్సవ వేళ పర్యావరణ స్పృహ కలిగి ఏళ్లుగా ప్లాస్టిక్‌ వాడకానికి దూరంగా ఉన్న వారిపై కథనం.


వినియోగిస్తూ.. అవగాహన కల్పిస్తూ..

ద్విచక్ర వాహనంపై బట్ట సంచితో కనిపిస్తున్న ఈ వ్యక్తి పేరు కందుల గజేందర్‌. ఆదిలాబాద్‌ పట్టణం కుమార్‌పేట్కాలనీకి చెందిన ఈయన జైనథ్‌ మండలం గూడ జడ్పీఎస్‌ఎస్‌ ప్రధానోపాధ్యాయులుగా పని చేస్తున్నారు. గతంలో బస్సులో పయనిస్తున్న సమయంలో చెరువంతా ప్లాస్టిక్‌ వ్యర్థాలతో నిండిపోయి కనిపించింది. వర్షం పడితే చుక్క నీరు ఇంకలేని పరిస్థితిని గమనించిన తాను ఇక ప్లాస్టిక్‌ వాడకానికి దూరంగా ఉండాలని నిర్ణయించారు. అలా  పదిహేనేళ్లుగా ప్లాస్టిక్‌ వాడటం లేదని చెబుతున్నారు. విధులకు వెళ్లినా.. సరకులకు, కూరగాయలకు వెళ్లినా వెంట సంచిని తీసుకెళ్లడం అలవాటుగా మార్చుకున్నారు. తాను పని చేసినా చోట పిల్లలకు అవగాహన కల్పిస్తూ బట్ట సంచులను పంచిపెడుతున్నారు. ప్లాస్టిక్‌ వాడకం వల్ల కలిగే అనర్థాలు వివరిస్తూ చైతన్యపరుస్తున్నారు. ఈయన మాదిరిగా ప్రతి ఒక్కరు స్వచ్ఛందంగా ప్లాస్టిక్‌ వాడకం మానేస్తే పర్యావరణహితులుగా మారచ్చు.


ఆదర్శం.. ఈ చిరువ్యాపారి

ఆదిలాబాద్‌ పట్టణం పాతబస్టాండ్‌ సమీపంలో చికెన్‌ విక్రయ దుకాణాదారు ఈయన. పేరు కిరణ్‌. అయిదేళ్లుగా తన వద్దకు వచ్చే వినియోగదారులకు ప్లాస్టిక్‌ కవర్లలో పెట్టి మాంసం విక్రయించడం మానేశారు. ప్లాస్టిక్‌కు బదులు బట్ట సంచులను వినియోగిస్తూ చిరువ్యాపారులకు ఆదర్శంగా నిలుస్తున్నారు. ప్లాస్టిక్‌ వాడినపుడు అధికారులు జరిమానా విధిస్తారని క్షణక్షణం భయపడాల్సిన పరిస్థితి ఉండేదని.. ఇప్పుడు దర్జాగా వ్యాపారం చేసుకుంటున్నట్లు చెబుతున్న కిరణ్‌.. బ్యాగుల వాడకంతో గిరాకీ పెరిగిందంటున్నారు. మొదట్లో తోటి వ్యాపారులు విచిత్రంగా చూసేవారని, హేళన చేసేవారని, ఇప్పుడు అధికారులు వచ్చి తనను స్ఫూర్తిగా తీసుకోవాలని ఇతర వ్యాపారులకు చెబుతుండటం సంతృప్తినిస్తోందని చెబుతున్నారు. చిరు వ్యాపారులు ప్లాస్టిక్‌ వాడకం విషయంలో కిరణ్‌ను ఆదర్శంగా తీసుకుంటే ప్లాస్టిక్‌ రహిత సంచుల వాడకం పెరగడం ఖాయం.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని