logo

భారీగా ఎస్జీటీల స్థానచలనం

జిల్లాలో ఉపాధ్యాయ బదిలీలు భారీగా జరిగాయి. సోమవారం మొత్తం 812 మంది ఉపాధ్యాయులకు స్థానచలనం కల్పిస్తూ విద్యాశాఖ ఉత్తర్వులు జారీ చేసింది.

Published : 02 Jul 2024 06:01 IST

న్యూస్‌టుడే, పాలనాప్రాంగణం

జిల్లాలో ఉపాధ్యాయ బదిలీలు భారీగా జరిగాయి. సోమవారం మొత్తం 812 మంది ఉపాధ్యాయులకు స్థానచలనం కల్పిస్తూ విద్యాశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఇందులో సెకండరీ గ్రేడ్‌ టీచర్లు (ఎస్జీటీ) అత్యధికంగా 792 మందికి ఉండగా.. భాషా పండితులు 14 మంది, పీఈటీలు ఆరుగురు ఉన్నారు. ఒకే చోట 8 ఏళ్ల సర్వీసు పూర్తి చేసుకున్న 617 మందిని కదిలించిన విద్యాశాఖ.. సాధారణ బదిలీ కింద 195 మంది ప్రస్తుతం పని చేస్తున్న చోటు నుంచి మరో పాఠశాలకు బదిలీ అయ్యారు. బదిలీ కోసం 998 మంది ఉపాధ్యాయులు దరఖాస్తు చేసుకోగా. ఇందులో కోరుకున్న స్థానాలు లభించని 185 మంది యథాస్థానాల్లో ఉండిపోయారు.  

జిల్లాలో ఉపాధ్యాయ పదోన్నతుల, బదిలీ ప్రక్రియ ఎట్టకేలకు ముగిసింది. దాదాపు నెలరోజులుగా సాగిన ఈ క్రతువుతో పాఠశాలల్లో చదువులు అంతంత మాత్రంగానే సాగాయి. మండలానికి అయిదారు పాఠశాలలను ఉపాధ్యాయులు ఎవరూ కోరుకోకపోవడంతో ఆ బడులకు రెగ్యులర్‌ ఉపాధ్యాయులు రావాలంటే డీఎస్సీ నియామకాలు జరగాల్సిందే. అప్పటి వరకు ప్రస్తుతం ఉన్న ఉపాధ్యాయులతో నెట్టుకొస్తారా? లేదా విద్యా వాలంటీర్లను నియమిస్తారా? అన్నది తేలాల్సి ఉంది. సోమవారం మధ్యాహ్నం తర్వాత ఎస్జీటీల బదిలీల ఉత్తర్వులు వెలువడటం.. ఆదివారం రిలీవ్‌ అయినా సోమవారం కొత్త స్థానాల్లో జాయిన్‌ కావాలని ఆదేశించడంతో ఉపాధ్యాయులు ప్రస్తుతం ఉన్న పాఠశాలకు, ఆ తర్వాత కేటాయించిన పాఠశాలలో చేరేందుకు ఉరుకులు, పరుగులు పెట్టాల్సి వచ్చింది. ఎంతమంది విధుల్లో చేరారు. మరెంత మంది రిలీవ్‌ కాలేదనే సమాచారం డీఈవో కార్యాలయానికి రావాల్సి ఉంది. ఈ విషయంలో మంగళవారం స్పష్టత రావచ్చు.

బడులు మూతపడకుండా చర్యలు

బదిలీల నేపథ్యంలో పాఠశాలలు మూతపడకుండా విద్యాశాఖ చర్యలు చేపట్టింది. ఏ పాఠశాల మూతపడకుండా తగు జాగ్రత్తలు తీసుకుంటోంది. ఎక్కడైతే ఒక ఉపాధ్యాయుడు ఉండి.. ఆ ఉపాధ్యాయుడు బదిలీ అయితే.. ఆ స్థానం ఖాళీగా ఉంటే అలాంటి వారిని రిలీవ్‌ చేయొద్దని ఆదేశాలు వచ్చాయని జిల్లా విద్యాశాఖాధికారి టి.ప్రణీత వెల్లడించారు. ఎక్కువ మంది పిల్లలు ఉన్నచోట ఏం చర్యలు తీసుకోవాలనేది ఉన్నతాధికారులకు నివేదిస్తామని చెప్పారు. విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా ఉపాధ్యాయ ఖాళీలు చూపించారని చెబుతున్నా... క్షేత్రస్థాయిలో అలాంటి పరిస్థితి కనిపించలేదని స్పష్టమవుతోంది. భీంపూర్‌ మండలం గుంజాల ప్రాథమిక పాఠశాలలో 72 మంది విద్యార్థులు ఉండగా.. బదిలీల్లో కొత్తగా ముగ్గురు వస్తుండగా.. ఇప్పటికే పని చేస్తున్న ఒకరితో కలిపి మొత్తం నలుగురు బోధకులు ఉంటారన్నమాట. అదే మండలం అంతర్గాంలో ఉన్న ఒక్క ఉపాధ్యాయుడికి స్థానచలనం కలగగా.. అక్కడ 81 మంది విద్యార్థులు ఉండటం గమనార్హం. ఇదే మండలంలో గుడిబి ప్రాథమికోన్నత పాఠశాలలో ఇద్దరు ఉపాధ్యాయులు ఉంటే ఆ ఇద్దరికి తాజా బదిలీల్లో స్థానచలనం కలగడం.. అక్కడి ఏ ఒక్కరు రాకపోవడం ఖాళీల గుర్తింపులో విద్యాశాఖ నిర్లక్ష్యానికి అద్దం పడుతోంది.


పదోన్నతిపై ఒకరు.. బదిలీపై మరొకరు  

ది భీంపూర్‌ మండలం అంతర్గాం ప్రాథమిక పాఠశాల. ప్రస్తుతం 81 మంది విద్యార్థులు ఉండగా.. మూడు పోస్టులు ఉన్నాయి. ఏడాది కిందట ఇక్కడి హెచ్‌ఎం అనారోగ్యంతో చనిపోగా.. ఇటీవల జరిగిన పదోన్నతిపై ఒకరు.. తాజా బదిలీల్లో మరొకరు బదిలీ అయ్యారు. ప్రస్తుతం పని చేస్తున్న ఉపాధ్యాయుడిని రిలీవ్‌ చేస్తే పాఠశాలలో విద్యార్థులే తప్ప ఉపాధ్యాయులు ఉండరన్న మాట.  


అయిదు పాఠశాలల ఉపాధ్యాయులు ఖాళీ 

భీంపూర్‌ మండలం అంతర్గాంతోపాటు మందపల్లి, భగవాన్‌పూర్, రాజుల్‌వాడి, గుబిడి గ్రామాల్లోని పాఠశాలల్లో పని చేస్తున్న ఉపాధ్యాయులంతా బదిలీ అయ్యారు. ఆ స్థానాలను ఏ ఒక్కరూ కోరుకోలేదు. ఫలితంగా ఆ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య మరింత తగ్గే ప్రమాదముంది. రోడ్డు మార్గం అధ్వానంగా ఉండటంతోనే చాలామంది ఇతర మండలాల ఖాళీలను ఎంపిక చేసుకున్నారని ఉపాధ్యాయ వర్గాలు అంటున్నాయి. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని