logo

విపత్తుల నివారణదళం.. సన్నద్ధం

జిల్లాలో ఎక్కడైనా ప్రకృతి విపత్తులు ఏర్పడితే సహాయక చర్యల కోసం ఎదురుచూడాల్సి వస్తోంది. ముఖ్యంగా వర్షాకాలంలో ఈ బాధలు ఎక్కువ. భారీ వర్షాల్లో ఎవరైనా చిక్కుకుంటే అంతే సంగతులు. కేంద్ర రక్షణ బృందాలు రావాలంటే ఆలస్యమౌతుంది.

Published : 02 Jul 2024 05:58 IST

20 మంది పోలీసులకు ప్రత్యేక శిక్షణ 
న్యూస్‌టుడే, ఆదిలాబాద్‌ పట్టణం 

జిల్లాలో ఎక్కడైనా ప్రకృతి విపత్తులు ఏర్పడితే సహాయక చర్యల కోసం ఎదురుచూడాల్సి వస్తోంది. ముఖ్యంగా వర్షాకాలంలో ఈ బాధలు ఎక్కువ. భారీ వర్షాల్లో ఎవరైనా చిక్కుకుంటే అంతే సంగతులు. కేంద్ర రక్షణ బృందాలు రావాలంటే ఆలస్యమౌతుంది. దశాబ్దంన్నర కిందట పెన్‌గంగ పరీవాహక ప్రాంతాల్లో భారీ వర్షాలకు ప్రజలు ప్రాణాలు గుప్పిట్లో పెట్టుకొని బయటపడ్డారు. కొందరైతే సమీప ఎత్తయిన భవనాల్లో, పాఠశాలల్లో తలదాచుకుంటే విపత్తు ప్రతిస్పందన బృందాలు వచ్చి వారిని క్షేమంగా సురక్షిత ప్రాంతానికి తరలించాయి. అప్పుడప్పుడు లోతట్టు ప్రాంతాల్లో ఉన్న గ్రామాల్లో, వాగులు ప్రవహించే గ్రామాల వద్ద ప్రజలకు భారీ వర్షాల సమయంలో ఇక్కట్లు ఏర్పడుతున్నాయి. అలాంటి చోట ప్రాణనష్టం సంభవించకుండా తక్షణమే రంగంలోకి దిగి సహాయక చర్యలు చేపట్టేలా జిల్లా స్థాయిలో విపత్తు ప్రతిస్పందన దళం(డిస్ట్రిక్‌ డిజాస్టర్‌ రెస్పాన్స్‌ ఫోర్స్‌) ఏర్పాటైంది.

పదిరోజులపాటు శిక్షణ

జిల్లా ఎస్పీ గౌష్‌ ఆలం ములుగు జిల్లాలో పని చేసిన సమయంలో విపత్తుల నివారణ బృందం పని తీరును గమనించి అలాంటి బృందాలు ఆదిలాబాద్‌ జిల్లాలోనూ అవసరమనే భావనతో ఏఆర్‌(ఆర్మ్‌డ్‌ రిజర్వు పోలీసు) విభాగంలోని 20 మందికి హైదరాబాద్‌లో ప్రత్యేక శిక్షణ ఇప్పించారు. ఒక ఏఆర్‌ ఎస్సై, 19మంది కానిస్టేబుళ్లు ఇందులో సభ్యులు. పదిరోజులపాటు వీరు శిక్షణ తీసుకున్నారు. సాధారణ రోజుల్లో తమ విధులు నిర్వర్తిస్తూనే జిల్లాలో ఎక్కడి నుంచైనా పిలుపువచ్చిన వెంటనే సహాయ చర్యల్లో వీరు రంగంలోకి దిగుతారు. అవసరమైతే పక్క ప్రాంతాలకు సైతం వెళ్తారు.

ప్రత్యేక పడవ.. రక్షణ జాకెట్లు

మోటారుతో నడిచే ప్రత్యేక పడవ వీరికి అందుబాటులో ఉంటుంది. పది మందిని తీసుకెళ్లే సామర్థ్యం ఈ పడవకు ఉంది. ఒక వేళ తక్కువ నీళ్లుంటే మోటారు కాకుండా చేతి సాయంతో పెడల్స్‌ వినియోగించి ముందుకు వెళతారు. నీటిలో మునిగే వాళ్ల ప్రాణాలు కాపాడేందుకు వీరి వద్ద లైవ్‌ జాకెట్లు ఉన్నాయి. నీటి ప్రాంతాల్లో ఇరుక్కుంటే గుండ్రటి ట్యూబ్‌కు తాడుకట్టి వారు బయటకు వచ్చేలా చర్యలు చేపడతారు. 

చెట్లు పడిపోయినా.. ఇళ్లు కూలినా

వర్షాకాలంలో ఎక్కువగా భారీ చెట్లు కూలిపోవడం వల్ల రాకపోకలు ఆటంకాలు ఏర్పడుతున్నాయి. అలాంటి చోట వీరు తక్షణమే వాలిపోతారు. ఛార్జింగ్‌ సాయంతో పనిచేసే రంపాలతో పడి పోయిన చెట్లను చిన్న భాగాలుగా చేసి అడ్డంకులు తొలగిస్తారు. ఎక్కడైనా నిర్మాణాలు కూలిపోయి శిథిలాల్లో ఇరుక్కుపోతే అక్కడా రంగంలోకి దిగుతారు. గాయపడిన వారిని పడుకోబెట్టి తీసుకొచ్చేందుకు స్ట్రెచర్‌ సైతం వీరి వద్ద అందుబాటులో ఉంటుంది. రెవెన్యూ, పోలీసు, అగ్నిమాపక, ఇతరశాఖల సమన్వయంతో వీరు పని చేస్తారు.   

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని