logo

రైతు నేస్తం.. సాంకేతిక ఫలం

జిల్లాల్లో నిర్మించిన రైతు వేదికల్లో రైతులకు సలహాలు, సూచనలు అందించేందుకు వీలుగా దృశ్యశ్రవణ పరికరాలను బిగించి రైతు నేస్తం కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు.

Published : 02 Jul 2024 05:54 IST

మండలాల వారీగా రైతు వేదికల్లో దృశ్య శ్రవణ కేంద్రాలు    
న్యూస్‌టుడే, ఆదిలాబాద్‌ వ్యవసాయం

జిల్లాల్లో నిర్మించిన రైతు వేదికల్లో రైతులకు సలహాలు, సూచనలు అందించేందుకు వీలుగా దృశ్యశ్రవణ పరికరాలను బిగించి రైతు నేస్తం కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ప్రయోగాత్మకంగా చేపట్టిన ఈ కార్యక్రమం సత్ఫాలితాలను ఇవ్వడంతో మరిన్ని సేవలు అందించేందుకు మండలానికి ఒక రైతు వేదికను ఎంపిక చేసి ‘రైతు నేస్తం’ కార్యక్రమాన్ని నిర్వహించాలని ప్రభుత్వం ఆదేశించింది. దీనికోసం ఒక్కో రైతువేదికకు రూ.3.70 లక్షలు మంజూరు చేసింది. ఇందుకోసం ఇప్పటికే కొన్ని మండలాల్లో దృశ్యశ్రవణ పరికరాలను బిగించారు. మరి కొన్ని మండలాల్లో పనులు జరుగుతున్నాయి. 

జిల్లాల్లో గత ప్రభుత్వం నిర్మించిన రైతు వేదికల ద్వారా రైతులకు సేవలందించేందుకు వీలుగా ఆధునిక, సాంకేతికత పద్ధతులను ఉపయోగించుకొని రైతులకు అవసరమైన సలహాలు, సూచనలు శాస్త్రవేత్తలతో అందించేలా దృశ్యశ్రవణ పరికరాలను ఏర్పాటు చేశారు. తొలివిడతలో ప్రయోగాత్మకంగా ఉమ్మడి జిల్లాలోని వ్యవసాయ డివిజన్ల వారీగా రైతులకు అందుబాటులో ఉండే ఒక రైతు వేదికను దృశ్య శ్రవణ కేంద్రంగా తీర్చిదిద్దారు. తాజాగా జిల్లాలోని అన్ని మండలాల్లో ఒక రైతువేదికలో రైతు నేస్తం కార్యక్రమాన్ని అందుబాటులోకి తెచ్చేందుకు అధికారులు చర్యలు తీసుకుంటున్నారు.    

చకచకా ఏర్పాట్లు..

  • ఆదిలాబాద్‌ జిల్లాలోని బోథ్, ఇచ్చోడ, కేస్లాపూర్, జైనథ్, బండల్‌నాగాపూర్‌ రైతు వేదికల్లో ఇప్పటికే దృశ్య శ్రవణ కేంద్రాలను ఏర్పాటు చేయగా, తాజాగా మండలానికి ఒకటి చొప్పున ఆదిలాబాద్‌ జిల్లాలో అంకోలి, మావల, కాప్సి, ధనోరా, బరంపూర్, బజార్‌హత్నూర్, నేరడిగొండ, సిరికొండ, గుడిహత్నూర్, శ్యాంపూర్, తడిహత్నూర్, గాదిగూడ రైతు వేదికల్లో రైతు నేస్తం కార్యక్రమాలను రైతులు వీక్షించేందుకు వీలుగా దృశ్యశ్రవణ కేంద్రాలను ఏర్పాటు చేశారు.
  • నిర్మల్‌ జిల్లాలోని మూడు వ్యవసాయ డివిజన్ల పరిధిలో కడెం, కుభీరు మండలంలోని సొనారి, సోన్‌ మండలంలోని బ్రహ్మన్‌గావ్‌ రైతు వేదికలను ఎంపిక చేశారు. లక్ష్మణచాందా, సోన్, పరిమండల్, బన్సపెల్లి, అక్కాపూర్, నర్సాపూర్‌(జి), నిర్మల్, చుచుండ్, కుభీరు, ముథోల్, దౌలతాబాద్, బాసర, సత్తెనపల్లి, దస్తూరాబాద్, ఇటిక్యాల రైతు వేదికల్లో పరికరాలను బిగిస్తున్నారు.
  • మంచిర్యాల జిల్లాలో బెల్లంపల్లి, భీమిని, చెన్నూరు డివిజన్‌ పరిధిలో కిష్టంపేట, లక్షెట్టిపేట రైతు వేదికల్లో కేంద్రాలను ఏర్పాటు చేశారు. కొత్తగా మండలానికి ఒకటి చొప్పున సౌకర్యాలు ఉండే రైతు వేదికలను ఎంపిక చేసి దృశ్యశ్రవణ కేంద్రాలను ఏర్పాటు చేశారు.కుమురం భీం జిల్లాలో సిర్పూరు(యు) మండలం మహాగావ్, ఆసిఫాబాద్‌ డివిజన్‌లో రాజంపేట, సిర్పూరు (టి)లోని రైతు వేదికల్లో ఇప్పటికే ఏర్పాటు చేశారు. కొత్తగా బెజ్జూర్, దహెగాం, కౌటాల, చింతలమానెపల్లి, తిర్యాణి, రెబ్బెన, వాంకిడి, కెరమెరి, లింగాపూర్‌ మండలాల్లో ఏర్పాటు చేస్తున్నారు.

పరికరాలు బిగిస్తున్నారు..

-పుల్లయ్య జిల్లా వ్యవసాయాధికారి, ఆదిలాబాద్‌

రైతు వేదికలను దృశ్య శ్రవణ కేంద్రాలుగా మార్చడం వల్ల రైతులకు మేలు జరుగుతుంది. వ్యవసాయ సంబంధిత సమాచారంతో పాటు పంటల వారీగా నేరుగా వ్యవసాయ విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తల నుంచి సలహాలు, సూచనలు పొందే వీలుంది. గతంలో ప్రయోగాత్మకంగా జిల్లాకు నాలుగు రైతు వేదికల్లో కార్యక్రమాన్ని నిర్వహించాం. ప్రభుత్వ ఆదేశాల మేరకు మండలానికి ఒకటి చొప్పున జిల్లాల వారీగా అన్ని మండలాల్లో పరికరాలను బిగిస్తున్నారు. వారం రోజుల్లో రైతు నేస్తం కార్యక్రమాన్ని ప్రారంభించే అవకాశాలు ఉన్నాయి.   

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని