logo

అమ్మకు కానుక.. అవనికి వేడుక

పర్యావరణ పరిరక్షణ కోసం అటవీ విసీˆ్తర్ణం పెంపుపై ప్రతిఒక్కరూ దృష్టి సారించాలి. ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా నా మాతృమూర్తి జ్ఞాపకార్థం ఒక మొక్కను నాటడం ఆనందంగా ఉంది.

Updated : 02 Jul 2024 06:31 IST

లక్షెట్టిపేట, న్యూస్‌టుడే 

పర్యావరణ పరిరక్షణ కోసం అటవీ విసీˆ్తర్ణం పెంపుపై ప్రతిఒక్కరూ దృష్టి సారించాలి. ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా నా మాతృమూర్తి జ్ఞాపకార్థం ఒక మొక్కను నాటడం ఆనందంగా ఉంది. తల్లి గౌరవార్థం ఆమె పేరిట మొక్కను నాటే కార్యక్రమం వేగంగా దేశ ప్రజల్లోకి చొచ్చుకుని వెళ్లాలి. కన్నతల్లిలాంటి భూగోళాన్ని రక్షించుకోవడంలో ఇలా మొక్కలు నాటడం దోహదం చేస్తుంది.  

మన్‌కీ బాత్‌లో ప్రధాని నరేంద్ర మోదీ

మ్మను మించి దైవమున్నదా...అని పాడుకున్నా...పెదవే పలికే మాటల్లోనా తీయని మాటే అమ్మ అని కీర్తించినా..అంతటి ఘనత అమ్మకు మాత్రమే దక్కుతుంది. నవమాసాలు మోసి తన ప్రాణాలను సైతం లెక్క చేయకుండా పిల్లల్ని కని పెంచే అమ్మకు ఏమిచ్చినా రుణం తీర్చుకోవడం సాధ్యం కాదు. సృష్టిలో అమ్మకు ఎంతటి గౌరవం దక్కుతుందో ప్రకృతి పరంగా తన, పర భేధం లేకుండా అందరికీ నీడనిచ్చే చెట్టుకు కూడా అంతే ప్రాధాన్యముంది. నాటి కేవలం నీరు పోస్తే చాలు ఎలాంటి లాభాపేక్ష లేకుండా మన కోసం తన సర్వస్వాన్ని ధారపోసే మొక్కను అమ్మ పేరిట నాటితే మనకు మనమే కాకుండా సమాజానికి మేలు చేసిన వారమవుతాం. ఆదివారం నిర్వహించిన మన్‌కీబాత్‌ కార్యక్రమంలో ప్రధాని మోదీ దేశప్రజలను ఉద్దేశించి అమ్మపేరిట ఒక మొక్కను నాటాలని పిలుపునిచ్చారు. వనమహోత్సవ వజ్రోత్సవ వేళ ప్రతి ఒక్కరూ అమ్మ పేరిట మొక్కలు నాటడం ఉద్యమంలా సాగాల్సిన ఆవశ్యకతపై ‘న్యూస్‌టుడే’ కథనం. 
ఇంట్లో శుభ కార్యాలు, పుట్టిన రోజు, పెళ్లిరోజుల్లో చాలా మంది మొక్కలు నాటడం చాలా  కాలంగా చూస్తున్న అంశమే. ప్రకృతి ప్రేమికులు తమ ఇంట్లో జరిగే ఇలాంటి కార్యాక్రమాల సందర్భంగా పర్యావరణ హిత కార్యక్రమాలు చేస్తూ మొక్కల పరిరక్షణకు చర్యలు తీసుకోవడం చాలాకాలంగా ఉంది. ప్రభుత్వ పరంగా వివిధ కార్యక్రమాల పేరిట మొక్కలు నాటడం ఆనవాయితీగా వస్తోంది. కారణం ఏదైనా చాలా మంది మొక్కలను నాటడంలో చూపే శ్రద్ధ తర్వాత వాటి పరి రక్షణలో చూపడం లేదనేది నిర్వివాదాంశం. దీంతో కష్టపడి నాటిన మొక్కలు కూడా తర్వాత దశలో కనుమరుగైపోయి ప్రయోజనం లేకుండా పోతోంది. 

తల్లి పేరిటే ఎందుకంటే..

సృష్టిలో అమ్మ ప్రేమకు ఉన్న ప్రత్యేక స్థానం దృష్ట్యా వారి పేరిట మొక్కను నాటితే వాటిని అపురూపంగా పెంచి పెద్ద చేసే అవకాశం ఉంటుంది. శుభకార్యాలు, పుట్టిన రోజు, పెళ్లి రోజుల్లో ఆ ఒక్కరు, లేదా జంట పేరిట ఒక మొక్క మాత్రమే నాటే అవకాశముంటుంది. కుటుంబంలో ఉన్న ప్రతి ఒక్కరికీ అమ్మ ఉంటుంది. కొందరికి తల్లి మరణించినా.. వారి జ్ఞాపకార్థం మొక్క నాటడానికి అవకాశముంది. అమ్మ పేరిట మొక్క నాటి వాటిని సంరక్షించగలిగితే 140 కోట్లకు పైగా జనాభా ఉన్న మన దేశంలో అన్ని కోట్ల మొక్కలు నాటే వెసులుబాటు కలుగుతుంది. వాటిని ఎవరికి వారు సంరక్షించగలిగితే పర్యావరణానికి ఎంతో మేలు చేకూరే అవకాశాలు ఉంటాయి. 

మీకు తెలుసా...

పర్యావరణ సమతుల్యత ఉండాలంటే భూవైశాల్యంలో 33 శాతం అటవీ విస్తీర్ణం ఉండాలి. చాలా జిల్లాల్లో అటవీ విస్తీర్ణం తక్కువే. అతివృష్టి, అనావృష్టి పరిస్థితులు, వేసవిలో 50 డిగ్రీలకు చేరిన ఎండల తీవ్రతలకు అటవీ విస్తీర్ణం తక్కువగా ఉండటమే కారణం. పర్యావరణ అసమతుల్యతను నిరోధించి దేశంలో అటవీ  విస్తీర్ణాన్ని పెంపొందించే ఉద్దేశంతో మొక్కలు నాటే కార్యక్రమాన్ని ప్రభుత్వ పరంగా 1950లో శ్రీకారం చుట్టారు.


ప్రయోజనాలివీ..

  • 50 సంవత్సరాల వ్యవధిలో ఒక చెట్టు రూ. 21 లక్షల విలువైన ఆక్సిజన్‌ను అందిస్తుంది. 
  • ఒక చెట్టు తన ఆకుల ద్వారా రోజుకు 100 గాలాన్ల నీటిని గాలిలో తేమ రూపంలో వదులుతుంది. అందుకే చెట్లు ఉండే ప్రాంతాల్లో 5 డిగ్రీల వరకు ఉష్ణోగ్రత తక్కువగా ఉంటుంది. 
  • ఒక ఎకరం విస్తీర్ణంలోని చెట్లు ఏడాదికి 2.6 టన్నుల కార్భన్‌డై ఆక్సైడ్‌ను వాతావరణం నుంచి తొలగిస్తాయి.
  • చెట్ల వేర్లు భూగర్భంలోని జలాల నుంచి ప్రమాదకరమైన కాలుష్యాన్ని తొలగించి శుద్ధి చేస్తాయి. 
  • రెండు చెట్లు రోజుకు నలుగురు ఉన్న కుటుంబానికి సరిపడా ప్రాణవాయువును అందిస్తాయి.
  • ఒక చెట్టుకు రెండునుంచి నాలుగు లక్షల ఆకులు ఉంటాయి. ఇవి గాలిని శుభ్రపరిచే ఫిల్టర్ల లాగా పని చేస్తాయి.
  • ఒక ఎకరంలో దట్టంగా విస్తరించిన చెట్లు 13 టన్నుల దూళిని తొలగిస్తాయి
  • చెట్టు లేని రహదారిలో లీటరు గాలిలో 10 నుంచి 12 వేల దూళికణాలు ఉంటే చెట్టు ఉన్న ప్రాంతంలో కేవలం 3 వేలు మాత్రమే ఉంటాయి.
  • ఒక చెట్టు ఇచ్చే చల్లదనాన్ని 20 ఎయిర్‌ కండీషనర్లు రోజుకు 20 గంటలు పని చేసినా ఇవ్వలేవు.  
Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని